సర్దుబాటు చర్చల్లో పాన్ ఇండియా సినిమాలు

By iDream Post Oct. 26, 2021, 02:53 pm IST
సర్దుబాటు చర్చల్లో పాన్ ఇండియా సినిమాలు

ఇకపై గతంలోలా పరిస్థితులు ఉండకపోవచ్చు. థియేటర్ల వద్ద రోజుల తరబడి జనంతో కిటకిటలాడే హౌస్ ఫుల్ బోర్డులు ఎక్కువ కాలం కనిపించకపోవచ్చు. ఏదున్నా హాట్ కేక్ మాదిరి రెండు వారాల లోపే లేదా అంతకన్నా తక్కువలో సర్దుకునే రోజులు వచ్చేశాయి. ఇప్పుడీ సంగతి ఎందుకనుకుంటున్నారా. ఆర్ఆర్ఆర్ , పుష్ప, ఆచార్య లాంటి పాన్ ఇండియా సినిమాలకు గతంలో చేసుకున్న డీల్స్ లో సుమారు 30 శాతం తగ్గింపులతో డిస్ట్రిబ్యూటర్లు కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటున్నారన్న వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అంటే ఒక ఏరియాని ఎవరైనా పంపిణీదారుడు ఓ ఇరవై కోట్లకు ఇంతకు ముందు మాట్లాడుకుంటే ఇప్పుడు ఆరు కోట్ల దాకా డిస్కౌంట్ వచ్చేస్తుందన్న మాట.


దీనికి పలు కారణాలు ఉన్నాయి. కరోనా సెకండ్ లాక్ డౌన్ తర్వాత అంతా సద్దుమణిగినట్టు కనిపిస్తున్నా కొత్త సినిమాల హడావిడి పది రోజులకు మించి ఉండటం లేదు. అంతెందుకు మొన్న దసరాకు మొదటి మూడు రోజులు భారీ వసూళ్లు దక్కించుకున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నాలుగో రోజు నుంచే సడన్ గా డ్రాప్ అయిపోయింది. అంత ఘనంగా చెప్పుకునే లవ్ స్టోరీ సైతం ఫైనల్ రన్ కి 35 కోట్ల మార్కుని మాత్రమే టచ్ చేయగలిగింది. పెద్ద మార్కెట్ ఉన్న స్టార్ హీరో సినిమా ఏదీ రిలీజ్ కాలేదు కాబట్టి అప్పుడే కంక్లూజన్ కు రాలేం కానీ ఎంత బ్లాక్ బస్టర్ అయినా రాబోయే రోజుల్లో ఒక సినిమా వంద కోట్ల షేర్ ని ఎన్ని రోజుల్లో రాబట్టుకుంటుందనేది కీలకం.


అందుకే భారీ బడ్జెట్ చిత్రాలకు ఇప్పుడు రేట్ల కోతలు తప్పడం లేదు. అందులోనూ ఏపిలో టికెట్ రేట్లకు సంబంధించి ఇంకా నియంత్రణ కొనసాగుతుండటం మరో కారణంగా చెప్పొచ్చు. అసలు ఒక స్టార్ హీరో సినిమా ఖచ్చితంగా ఎంత వసూలు చేయొచ్చనే అంచనా కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. అది అఖండతో తెలుస్తుందా లేక పుష్ప దాకా వెయిట్ చేయలా అర్థం కావడం లేదు కానీ మొత్తానికి ఒక బ్లాక్ బస్టర్ పడితే కానీ క్లారిటీ వచ్చేలా లేదు. పక్కన తమిళనాడులో డాక్టర్ ఏకంగా 90 కోట్ల గ్రాస్ రాబట్టి ఆశ్చర్యపరిచింది. అలాంటిది ఆర్ఆర్ఆర్ లాంటి గ్రాండియర్ కు మూడు వందల కోట్లు పెద్ద మ్యాటర్ కాదు. పైగా కరోనా కేసులు దాదాపు తగ్గిపోయాయి. ఎటొచ్చి ఫ్యామిలీ ఆడియన్స్ రెండు మూడో వారం నుంచి థియేటర్లకు రావడం చాలా అవసరం. చూద్దాం ఎలా ఉండబోతోందో.


ALSO READ - Operation Hydravati - 'గరుడ' నవ్వుల పాలయింది.. ఇక ఇప్పుడు 'ఆపరేషన్ హైద్రావతి' వంతు!

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp