ఓటిటి దూకుడు - పెరిగిందా తగ్గిందా

By iDream Post Aug. 11, 2020, 08:57 pm IST
ఓటిటి దూకుడు - పెరిగిందా తగ్గిందా

లాక్ డౌన్ టైంలో మహా జోరుగా కనిపించిన ఓటిటి విప్లవం కొద్దికొద్దిగా చల్లబడుతోంది. థియేటర్లు త్వరలో తెరవబోతున్నారన్న వార్తలు వస్తున్నప్పటికీ ప్రస్తుతానికి వాటి మీద ఎవరూ ఆశలు పెట్టుకోవడం లేదు. నిన్న కోన వెంకట్ సోషల్ మీడియాలో నిశబ్దం సినిమాను ఎందులో చూడాలనుకుంటున్నారని ప్రశ్నిస్తే ఏకంగా 60 శాతం దాకా డిజిటల్ కే ఓటు వేసి షాక్ ఇచ్చారు. చాలా తక్కువ మంది థియేటర్ కు జై కొట్టారు. మరికొందరు కరోనా కేసులు పూర్తిగా తగ్గాక అంటూ టిక్ పెట్టారు. మొత్తానికి ప్రేక్షకులలో కరోనా భయం గణనీయమైన మార్పులు తీసుకొచ్చింది. సంక్రాంతి దాకా హాళ్ళు కళకళలాడటం కష్టమే అని పరిశీలకుల అభిప్రాయం.

దీని సంగతలా ఉంచితే కొత్త కంటెంట్ లేక స్ట్రీమింగ్ సంస్థలు వేట మొదలుపెట్టాయి. ఆహా ఇప్పటికే వరసబెట్టి మలయాళం, తమిళం డబ్బింగ్ సినిమాలను మంచి క్వాలిటీతో వదులుతోంది. మరోవైపు రిలీజ్ ఆగిపోయిన బడ్జెట్ సినిమాలను రీజనబుల్ రేట్లకు కొనుగోలు చేస్తోంది. ఇవి కాకుండా స్వయానా నిర్మాణాలు కూడా చేస్తోంది. తెలుగు లోకల్ ట్యాగ్ ని నిలబెట్టుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు అమెజాన్ ప్రైమ్ స్టార్ సినిమాలపై కన్ను వేసింది. క్రేజీ ఆఫర్స్ తో నిర్మాతలను ఊరించి శతవిధాలా ప్రయత్నిస్తోంది. నెట్ ఫ్లిక్స్ కూడా క్యాస్టింగ్ ఉన్న మూవీస్ మీద బడ్జెట్ పెట్టేందుకు వెనుకాడటం లేదు. ఉమామహేశ్వరఉగ్రరూపస్యకు దాని బడ్జెట్ కన్నా ఎక్కువ ఇచ్చి హక్కులు కొంది.

మరోవైపు హాట్ స్టార్ ఏకంగా బాలీవుడ్ భారీ బొమ్మలను హోం మల్టీ ప్లెక్స్ పేరుతో హంగామా చేస్తోంది. ఆగస్ట్ మూడో వారం నుంచి బ్లాక్ బస్టర్ అంచనాలున్న సినిమాలు క్యు కడుతున్నాయి. జీ5 సైతం పోటీ ఇచ్చేందుకు అన్ని బాషల్లోనూ కంటెంట్ కొనే పనిలో ఉంది. ఇక ఈ క్యాటగిరీలో వీక్ గా ఉన్న సోనీ లివ్ సైతం స్ట్రాటజీను మార్చుకునే దిశగా ప్లానింగ్ చేసుకుంటోంది. ఫ్రీగా దొరికే ఎంఎక్స్ ప్లేయర్ కూడా రాజీ పడటం లేదు. జెమిని, ఈటీవీ లాంటి ఛానల్స్ సైతం ఓటిటిలో బలపడేందుకు ప్రణాలికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ లెక్కన థియేటర్లు తెరిచే లోపు ఇవి మరింత బలంగా ఆడియన్స్ లోకి చొచ్చుకుపోయే ప్లాన్లు తీవ్రంగా చేస్తున్నాయి. వందల కోట్ల మార్కెట్ తో భవిషత్తు బంగారు బాతులా కనిపిస్తున్న ఓటిటి జోరు మన సౌత్ లోనే ఒకింత తక్కువగా ఉంది. ఇక్కడా ఒకటి రెండు స్టార్ సినిమాలు ఓటిటిలోకి వస్తే ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp