'అతడు'కు మాత్రమే సాధ్యమైన రికార్డు

By iDream Post Oct. 14, 2020, 08:08 pm IST
'అతడు'కు మాత్రమే సాధ్యమైన రికార్డు

సూపర్ స్టార్ మహేష్ బాబు అతడు సినిమా టీవీలో వచ్చిన ప్రతిసారి ఛానల్ మార్చాలంటే మనసు రాదు. అంతగా అందులో కంటెంట్ తో కట్టిపారేస్తాడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అలా అని అదేమైనా ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టి చరిత్రలు తిరగరాసిన చిత్రమా అంటే అదీ కాదు. నిర్మాత మురళీమోహన్ కు విడుదల సమయంలో కమర్షియల్ గా అంత భారీ లాభాలేమి రాలేదు. జస్ట్ హిట్ అనిపించుకుంది అంతే. మరి ఇప్పుడేం రికార్డు వచ్చిందనుకుంటున్నారా. శాటిలైట్ ప్రసారం ఇప్పటిదాకా 1350 సార్లకు పైగా జరిగినట్టు టీవీ వర్గాల సమాచారం. ఇక్కడితో ఆగడం లేదు లెండి. కౌంట్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది

స్టార్ మాతో పాటు దాని అనుబంధ ఛానల్స్ లో ఎన్నో సార్లు వచ్చిన అతడు ఇప్పటికీ వారానికి ఒకసారి ఏదో ఒకదానిలో వేయడం పరిపాటి. హిందీలోనూ ఏ మూవీకి ఇలాంటి ఘనత దక్కలేదంటే ఆశ్చర్యం కలగక మానదు. వేసిన ప్రతిసారి మంచి రేటింగ్స్ రావడమే దీనికి కారణం. అదే ఛానల్ వద్ద బాహుబలి, మగధీర లాంటి ఎపిక్ సినిమాలు ఉన్నా కూడా అతడుకే ఇంత ఆదరణ దక్కడం అంటే విశేషమే. 2005లో ఆగస్ట్ 10 విడుదలైన అతడు ఆ తర్వాత విసిడి, డివిడిలతో పాటు యుట్యూబ్ లోనూ అఫీషియల్ వెర్షన్ అందుబాటులో ఉంది. దీనికి తోడు ఆన్ లైన్ పైరసీ రూపంలో ఎన్ని లక్షల డౌన్లోడ్లు జరిగి ఉంటాయో లెక్క చెప్పడం కష్టం.

ఇవి మొత్తంగా కలుపుకుని చూస్తే నెంబర్ కౌంట్ కి మతులు పోవడం ఖాయం. అగ్రిమెంట్ పూర్తయిన ప్రతిసారి స్టార్ మా అతడుని రెన్యూవల్ చేసుకుంటూనే ఉంది. తనకు ఇది కామధేనువులా ఆదాయం తెస్తూనే ఉందని ఆ మధ్య మురళీమోహన్ ఓ సందర్భంలో చెప్పారు కూడా. మణిశర్మ సంగీతం, త్రిష గ్లామర్, క్వాలిటీ కాస్టింగ్, టెక్నికల్ వాల్యూస్, అన్నింటిని మించి పదే పదే చూసి ఎంజాయ్ చేయాలనిపించేలా త్రివిక్రమ్ మాటలు ప్లస్ టేకింగ్ అతడుని ఎక్కడికో తీసుకెళ్లాయి. ఇక మహేష్ బాబు గురించి చెప్పేదేముంది. కిల్లర్ గా అయినా అల్ట్రా స్టైలిష్ గా కనిపించిన తీరు దీన్నో క్లాసిక్ గా మార్చేసింది. అందుకే పదివేల సార్లు వచ్చినా బోర్ కొట్టదని అభిమానులు సోషల్ మీడియాలో తెగ మురిసిపోతున్నారు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp