నవంబర్ స్టోరీ రివ్యూ

By iDream Post May. 20, 2021, 05:40 pm IST
నవంబర్ స్టోరీ రివ్యూ

లాక్ డౌన్ మళ్ళీ ముంచుకొచ్చిన నేపథ్యంలో కొత్త ఎంటర్ టైన్మెంట్ కావాలంటే ఓటిటి మీద ఆధారపడటం తప్ప ప్రేక్షకులకు వేరే ఆప్షన్ లేకుండా పోయింది. అందుకే డిజిటల్ సంస్థలు కొత్త కంటెంట్ ని తీసుకొచ్చేందుకు పోటీ పడుతున్నాయి. పైగా స్టార్ హీరోయిన్లు వీటిలో నటించేందుకు ముందుకు రావడంతో సామాన్య జనంలోనూ వెబ్ సిరీస్ ల పట్ల ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలోనే హాట్ స్టార్ లో ఇవాళ వచ్చిన నవంబర్ స్టోరీ ప్రమోషన్ టైం నుంచే హైప్ తెచ్చుకుంది. తమన్నా లీడ్ రోల్ లో నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ చాలా ఇంటెన్స్ గా ఉందని ట్రైలర్ చూసినప్పుడు అర్థమయ్యింది. మరి ఆ స్థాయిలో అసలు విషయం ఉందో లేదో రివ్యూలో చూద్దాం

కథ

అనురాధ ఉరఫ్ అను(తమన్నా)పోలీస్ డిపార్ట్ మెంట్ కి పాత ఫైల్స్ ని డిజిటల్ చేసేందుకు పనికొచ్చే సాఫ్ట్ వేర్ ని తయారు చేసి ఇస్తుంది. అయితే అందులో కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. క్రైమ్ నవల రచయితైన నాన్న గణేష్(జిఎం కుమార్)బాగోగులు చూసుకుంటూ తమ పాత ఇంటిని అమ్మే ప్రయత్నాల్లో ఉంటుంది అను. అనుకోకుండా ఓ రాత్రి ఆ ఇంట్లో ఓ మహిళ దారుణ హత్యకు గురవుతుంది. స్పాట్ లో గణేష్ ఉండటం చూసిన అను వెంటనే సాక్ష్యాలు మాయం చేసి తీసుకెళ్లిపోతుంది. పోలీసులకు ఆధారాలు దొరక్క సతమతమవుతూ ఉంటారు. ఈ లోగా మరో రెండు మర్డర్లు జరుగుతాయి. అప్పుడు రంగంలోకి దిగుతాడు మాజీ పోస్ట్ మార్టం డాక్టర్ ఏసు(పశుపతి). అతను ఇచ్చిన క్లూలు కేసుని కొత్త మలుపు తిప్పుతాయి. తర్వాత ఏం జరిగిందన్నది స్మార్ట్ గా చూడాలి

నటీనటులు

ఇప్పటికే లెవెన్త్ హవర్ లో డిజిటల్ డెబ్యూ చేసిన తమన్నా ఆ కాన్సెప్ట్ కి పూర్తి విరుద్ధమైన సబ్జెక్టుతో నవంబర్ స్టోరీలో నటించింది. ఛాలెంజింగ్ రోల్ అని చెప్పలేం కానీ ఉన్నంతలో మధ్య తరగతి అమ్మాయిగా నాన్నను ప్రమాదం నుంచి బయట పడేయాలనే తపన పడే కూతురిగా మంచి హావభావాలను ఇచ్చింది. కొన్ని సందర్భాల్లో బ్లాంక్ ఎక్స్ ప్రెషన్లు ఇచ్చినప్పటికీ తన స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సిరీస్ కి చాలా దోహదపడింది. ఎవరైనా ఇమేజ్ లేని హీరోయిన్ చేసి ఉంటే మాత్రం ఇంపాక్ట్ తగ్గిపోయేది. నిండైన డ్రెస్సులో పాటలే లేకుండా అయిదు గంటల నిడివిలో తమన్నాని ఇలాంటి పాత్రలో చూడటం వెరైటీ

చాల కాలం తర్వాత కనిపించిన పశుపతి తనకిచ్చిన క్యారెక్టర్ ని అపారమైన అనుభవంతో నిలబెట్టేశారు. క్యాస్టింగ్ పరంగా తీసుకున్న ఉత్తమ నిర్ణయం ఇదేనని చెప్పొచ్చు. జిఎం కుమార్ మానసిక పరిణితి తక్కువగా ఉన్న తండ్రి పాత్రలో ఎప్పటిలాగే చేసుకుంటూ పోయారు. ఇన్స్ పెక్టర్ గ నటించిన అరుణ్ దాస్ పెర్ఫార్మన్స్ పరంగా మంచి అవుట్ ఫుట్ ఇచ్చాడు. వివేక్ ప్రసన్న, మైనా నందిని, తరణి సురేష్, నమితా కృష్ణమూర్తి తదితరులు తమకిచ్చిన బాధ్యతలకు న్యాయం చేకూర్చారు. కథ మొత్తం నాలుగైదు పాత్రల చుట్టే తిరుగుతుంది కాబట్టి మిగిలినవారు అంతగా గుర్తుండరు.

డైరెక్టర్ అండ్ టీమ్

వెబ్ సిరీస్ లలో క్రైమ్ థ్రిల్లర్ లేదా హారర్ కు వచ్చినంత స్పందన రామ్ కామ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ కు ఉండదు. అందుకే దర్శక రచయితలు వీటికే ప్రాధాన్యం ఇస్తారు. దర్శకులు ఇందిరా సుబ్రహ్మణ్యన్ దీనికి మినహాయింపుగా నిలవలేదు. నిజానికి వెబ్ సిరీస్ లు ఎక్కువ నిడివితో ఉంటాయి. అందుకే ఎపిసోడ్ల వారిగా విభజన చేస్తారు. ఒక్కో భాగం గడిచే కొద్ది ఆసక్తి పెరిగితే మిగిలినవి చూడాలా వద్దా అనేది దాన్ని బట్టి ఆడియన్స్ డిసైడ్ చేసుకుంటారు. నవంబర్ స్టోరీలో డిఫరెంట్ పాయింట్ ఉంది. 7 ఎపిసోడ్లు అందులోనూ ఎక్కువ అరగంట టైమింగ్ ఉన్నవి కాబట్టి ఇది చాలా ఫాస్ట్ గా పరుగులు పెడుతుందని ఆశిస్తాం.

కానీ నవంబర్ స్టోరీలో జరిగింది వేరు. మెయిన్ థీమ్ ఆసక్తికరంగానే ఉన్నా దాన్ని నడిపించిన తీరు సాగతీతకు గురి కావడంతో ఎంగేజింగ్ గా సాగాల్సిన స్క్రీన్ ప్లే చాలా చోట్ల నత్తనడకతో పడుతూ లేస్తూ వెళ్తుంది. పాత్రల పరిచయానికి చాలా ఎక్కువ సమయం తీసుకున్న ఇందిరా తర్వాతైనా కథనాన్ని రేసీగా మార్చి ఉంటే ఇదో బెస్ట్ థ్రిల్లర్ గా మిగిలేది. ఎంతసేపూ మెయిన్ విలన్ ని రివీల్ చేయకుండా ఉంటే చాలు మిగిలింది ఎలా నడిచినా ప్రేక్షకులు చూస్తారనుకోవడంలోనే లెక్క పూర్తిగా తప్పింది. ఒక దశ దాటాక కామన్ ఆడియెన్ సైతం హత్యలు ఎవరు చేస్తుంటారో ఊహించగలడు. కారణం స్లోగా నడిచే టేకింగే.

ఇలాంటి థ్రిల్లర్స్ లో డిటైలింగ్ ముఖ్యమే. కాదనలేం. అలా అని వెబ్ సిరీస్ పేరుతో ఇంత లెన్త్ ఉండకపోతే వ్యూయర్స్ ఎక్కువ సేపు స్ట్రీమింగ్ టైంని ఖర్చు పెట్టరు అనే అంచనాలో అవసరం లేని సన్నివేశాలు జొప్పిస్తే వాళ్ళ చేతిలో ఫార్వార్డ్ ఆప్షన్ కూడా ఉంటుందని మర్చిపోకూడదు. నవంబర్ స్టోరీలో మధ్యలో రెండు మూడు ఎపిసోడ్లు మాత్రమే కాస్త పరుగులు పెడతాయి. ప్రతి భాగానికి ముందు బ్లాక్ అండ్ వైట్ లో ఫ్లాష్ బ్యాక్ ని అంతంత సేపు రన్ చేయడం కూడా మైనస్ అయ్యింది. చాలా బలమైన క్యాస్టింగ్ సపోర్ట్ ఉన్నప్పటికీ దాన్ని వాడుకునేంత స్ట్రాంగ్ కంటెంట్ లేకపోవడం నవంబర్ స్టోరీని యావరేజ్ గా మార్చింది

శరణ్ రాఘవన్ నేపధ్య సంగీతం సోసోనే. విధు అయ్యన్న ఛాయాగ్రహణం పర్లేదు. లిమిటెడ్ లొకేషన్స్ లో సినిమా స్టాండర్డ్ క్వాలిటీని చూపించేందుకు బాగానే కష్టపడ్డారు. ఎడిటర్ గోవిందస్వామి చేతులు కట్టేశారో లేక వెబ్ సిరీస్ కాబట్టి ఎక్కువ కట్ చేయడానికి అవకాశం ఉండదని ఆయనే సైలెంట్ అయ్యాడో తెలియదు కానీ కోతకు అవకాశం ఉన్న చోట వదిలేయడం ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదు. ఆర్ట్ వర్క్ ని కొంతవరకు మెచ్చుకోవచ్చు. నిర్మాణ విలువలు ఓకే

కంక్లూజన్

నవంబర్ స్టోరీ లాంటి క్రైమ్ వెబ్ సిరీస్ లను రోజుకొకటి రెండు రోజులకొకటి వీలుని బట్టి ఎపిసోడ్స్ చూసే ఓటిటి ఫ్యాన్స్ తక్కువగా ఉంటారు. అధికశాతం ఆడియన్స్ మొదలుపెడితే చివరి దాకా వీలైనంత తక్కువ టైంలో ఏకధాటిగా ఫినిష్ చేసే వాళ్లే ఎక్కువ. ఈ వెబ్ సిరీస్ రెండు విభాగాల ప్రేక్షకులను ఓ మోస్తరుగా తప్ప అంతకు మించి మెప్పించే అవకాశాలు తక్కువ. నేర పరిశోధన మీద విపరీతమైన ఆసక్తి ఉండి సిరీస్ ఎంత స్లోగా నడిచినా పర్లేదు కూసింత సస్పెన్స్ ఉంటే చాలు అనుకుంటే నవంబర్ స్టోరీని ట్రై చేయొచ్చు. కానీ చాలా ఓపిక ఉండాలన్న విషయం మర్చిపోకూడదు. అలా కాకుండా ఏ ఫ్యామిలీ మ్యానో, ఆర్యనో, స్పెషల్ ఓపిఎస్ రేంజ్ లోనో ఊహించుకుంటే మాత్రం నిరాశ ఖాయం

ఒక్కమాటలో - సాగతీత స్టోరీ

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp