వచ్చే నెల కూడా చిన్న సందడే ?

By iDream Post Jul. 27, 2021, 04:20 pm IST
వచ్చే నెల కూడా చిన్న సందడే ?

ఇంకో మూడు రోజుల్లో థియేటర్లు తెరుచుకోబోతున్నాయి. ఆగస్ట్ నుంచి కొత్త సినిమాలతో హాళ్లు కళకళలాడబోతున్నాయి. కానీ సందడిగా హౌస్ ఫుల్ బోర్డులు పడాలంటే మాత్రం పెద్ద లేదా మీడియం రేంజ్ హీరోలు బరిలో దిగాల్సిందే. పరిస్థితి చూస్తుంటే ఆగస్ట్ లో కూడా ఆ ఛాన్స్ పెద్దగా కనిపించడం లేదు. నాని, నాగ చైతన్య లాంటి వాళ్ళు వస్తారేమో అనుకుంటే ఆ అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఏపిలో టికెట్ వ్యవహారం ఇంకా కొలిక్కి రాకపోవడంతో పాటు గోదావరి జిల్లాలో కరోనా కేసులు పూర్తి స్థాయిలో తగ్గకపోవడం లాంటి పరిణామాలు డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. సో చిన్న సందడే ఖాయమయ్యేలా కనిపిస్తోంది.

అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఆగస్ట్ 6న ఎస్ఆర్ కల్యాణ మండపం, ముగ్గురు మొనగాళ్లు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు,మెరిసే మెరిసేలను షెడ్యూల్ చేశారు. ఆగస్ట్ 13కి పూర్ణ టైటిల్ రోల్ చేసిన సుందరి, మేఘా ఆకాష్ చేసిన డియర్ మేఘా రావడం దాదాపు ఖాయమైనట్టే. ఒకవేళ పాగల్ సడన్ ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆగస్ట్ 20న సందీప్ కిషన్ గల్లీ రౌడీ వచ్చే ఛాన్స్ ని కొట్టి పారేయలేం. ఆగస్ట్ 27న మారుతీ మంచి రోజులు వచ్చాయి ప్లాన్ చేశారనే టాక్ ఉంది. తలైవి కూడా అదే రోజుకు ఆలోచిస్తున్నారు. ఇవి కాకుండా కొన్ని హాలీవుడ్ బాలీవుడ్ చిత్రాలు కూడా రాబోతున్నాయి.

ఈ లెక్కన టక్ జగదీశ్, లవ్ స్టోరీ, విరాట పర్వం లాంటి పెద్ద సినిమాలు ఆగస్టులో వచ్చే సూచనలు కనిపించడం లేదు. అంటే సెప్టెంబర్ నుంచి కానీ అసలు సందడి మొదలు కాదన్న మాట. ఈలోగా అన్ని సమస్యలు ఒక కొలిక్కి వచ్చి కరోనా కేసులు పూర్తిగా తగ్గిపోతే ఒక్కొక్కటిగా బయటికి వస్తాయి. ఇప్పటికే ఫస్ట్ కాపీలు సిద్ధమవుతున్న సినిమాల లిస్టు తిరుమల సర్వ దర్శనం క్యూలాగా అంతకంతా పెరుగుతూ పోతోంది. భారీ క్లాషులు తప్పేలా లేవు. ఆలోపే మీడియం రేంజ్ మూవీస్ తమకు అందివచ్చిన అవకాశాలను వాడుకునేందుకు చూస్తున్నాయి. ఏడాది చివరి నాలుగు నెలలు సినిమా ప్రేమికుల పర్సులు గట్టిగానే ఖర్చు కావడం ఖాయం

Also Read: రాజమౌళి కీరవాణిల మ్యూజిక్ స్కెచ్

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp