బంగార్రాజులో కొత్త ట్విస్టులు

By iDream Post Jun. 22, 2021, 07:26 pm IST
బంగార్రాజులో కొత్త ట్విస్టులు

అయిదేళ్ల క్రితం 2016లో సంక్రాంతికి విపరీతమైన పోటీ మధ్య ఆఖరున విడుదలైన సోగ్గాడే చిన్ని నాయనా ఎంత పెద్ద హిట్టో అభిమానులు అంత సులభంగా మర్చిపోలేరు. ఒకపక్క బాలకృష్ణ డిక్టేటర్, మరోపక్క జూనియర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో హవాను తట్టుకుని మరీ భారీ వసూళ్లు సాధించింది. నిజానికి అప్పుడు నాగార్జున మార్కెట్ ఏమంత ఆశాజనకంగా లేదు. ఆ టైంలో ఇంత పెద్ద సక్సెస్ రావడంతో కింగ్ లోనూ మంచి ఉత్సాహం రేకెత్తింది. అందుకే అప్పటి నుంచి దాని మీద ప్రత్యేక అభిమానం చూపిస్తూ వచ్చారు. అంతే కాదు దానికి సీక్వెల్ లాంటి ప్రీక్వెల్ కూడా బంగార్రాజు టైటిల్ తో తీయాలని అప్పుడే నిర్ణయించుకున్నారు.

కానీ ఏళ్ళు గడుస్తున్నాయి కానీ బంగార్రాజు అడుగు ముందుకు పడటం లేదు. మధ్యలో నాగార్జునవే కాదు నాగచైతన్య సినిమాలు కూడా వేరేవి వచ్చాయి. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఈ గ్యాప్ లోనే చైతూతో రారండోయ్ వేడుక చూద్దాంతో హిట్టు రవితేజ నేల టికెట్టుతో ఫట్టు అందుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ బంగార్రాజుని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేస్తున్న యాక్షన్ డ్రామా పూర్తి కాగానే నాగార్జున తన ఫేవరెట్ సీక్వెల్ ని మొదలుపెట్టేస్తారని ఇన్ సైడ్ టాక్. ఈలోగా ప్రీ ప్రొడక్షన్ కు సంబంధించిన పనులు ఆల్రెడీ మొదలయ్యాయని అంతర్గత వర్గాల నుంచి వస్తున్న న్యూస్.

వాటిలో కొన్ని ఆసక్తి కలిగించేవి ఉన్నాయి. ఇందులో నాగార్జున, నాగ చైతన్య అన్నదమ్ములుగా నటిస్తారట. వీళ్ళవి ఫుల్ లెన్త్ రోల్స్ కాగా అఖిల్ మాత్రం చిన్న క్యామియో క్యారెక్టర్ లో బంగార్రాజు మనవడిగాగా కనిపిస్తాడట. అంతేకాదు నిన్నటి తరం సీనియర్ హీరోయిన్ జయప్రదకు ఒక కీలక పాత్రను సెట్ చేసినట్టు తెలిసింది. బంగార్రాజుకు ఏ వరసలో ఆవిడను చూపిస్తారో ఇంకా క్లారిటీ లేదు. ఇవన్నీ లీకవుతున్న సోర్స్ నుంచి వస్తున్న వార్తలే తప్ప అధికారికంగా ఇంకా ఏదీ చెప్పలేదు. మరోవైపు నాగార్జున బిగ్ బాస్ 5 చేస్తారని కూడా వినిపిస్తోంది. ఇప్పటికే ఏర్పాట్లు మొదలుపెట్టేశారు. లాక్ డౌన్ లేదు కాబట్టి ఇంకో రెండు నెలల్లో మొదలైనా ఆశ్చర్యం లేదు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp