అలా కొత్త ట్రెండ్ మొదలయ్యింది

By iDream Post Jan. 12, 2021, 02:22 pm IST
అలా కొత్త ట్రెండ్ మొదలయ్యింది

నిన్న సాయంత్రం అల వైకుంఠపురములో బృందం రీ యూనియన్ బాష్ పేరుతో టీమ్ మొత్తాన్ని ఒకచోట చేరి భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ స్థాయిలో అల్లు ఆఫీస్ లో సెలబ్రేషన్స్ చేయడం మీడియాలో హై లైట్ అయ్యింది. హీరో హీరొయిన్ దర్శకుడుతో సహా ఎవరూ మిస్ కాకుండా పక్కాగా ప్లాన్ చేశారు. ఎంతగా అంటే మాములు పరిస్థితుల్లో అయితే రాలేని తమిళ నటుడు సముతిరఖని కూడా అటెండ్ అయ్యేంత. అఫ్ కోర్స్ టబు,జయరాం లాంటి వాళ్ళు మిస్సింగ్ అనుకోండి. వేరే చోట ఉన్నారు కాబట్టి రావడం సాధ్యపడలేదు. తమన్ లైవ్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. వచ్చినవాళ్లంతా ఈ సినిమాతో తమ జ్ఞాపకాన్ని అది సాధించిన విజయాన్ని నెమరు వేసుకున్నారు. ఫ్యాన్స్ కూడా ఆన్ లైన్ లో లైవ్ చూసి ఎంజాయ్ చేశారు.

ఇప్పుడిది ఓ కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టిందనే చెప్పాలి. మాములుగా ఘన విజయం సాధించిన సినిమా అయినా లేక ఫ్లాప్ అయినా మూవీ అయినా ప్రతి సంవత్సరం యానివర్సరీ పేరుతో దాన్ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడం గత కొంత కాలంగా ఫ్యాన్స్ చేస్తూనే ఉన్నారు. దీని కోసం ప్రత్యేకంగా డిపిలు తయారు చేయించి మరీ వైరల్ చేస్తారు. ఆరంజ్ లాంటి డిజాస్టర్లకు సైతం ఈ రూపంలో మంచి పబ్లిసిటీ దక్కేది. ఇక ఇండస్ట్రీ హిట్ల గురించి చెప్పదేముంది. అయితే ఈ సందర్భాన్ని ఒక ఈవెంట్ గా చేయొచ్చనే అల్లు ఆలోచన మాత్రం మరికొందరికి ఖచ్చితంగా స్ఫూర్తినిస్తుంది.

అంటే ఇక భవిష్యత్తులో పెద్ద పెద్ద హిట్టు సినిమాలకు ఏడాదికో లేక రెండు మూడేళ్ళు లేదా ఐదేళ్ళకు గ్రాండ్ ఈవెంట్లు జరుగుతాయన్న మాట. గతంలో ఆడియో ఫంక్షన్లు కనుమరుగైపోయినప్పుడు ఈ కల్చర్ ని సరైనోడుతో తీసుకొచ్చింది అల్లు సంస్థే. ఆ తర్వాత దీన్ని అందరూ ఫాలో కావడం మొదలుపెట్టారు. ఆఖరికి వెబ్ సిరీస్ లకు కూడా ఇలాంటి వేడుకలు చేసే దాకా వచ్చింది పరిస్థితి. నిన్న దీంతో పాటు అల్లు అర్జున్ నటించిన సినిమాలు అన్నింటిని హైలైట్ చేస్తూ తమన్ కంపోజ్ చేసిన ర్యాప్ సాంగ్ ఒకటి నెట్ లో ఇప్పటికే హల్చల్ చేస్తోంది. మాయాబజార్ లో అన్నట్టు ఎవరో ఒకరు సృష్టించకపోతే మాటలెలా పుడతాయి తరహాలో ఈ ట్రెండ్ కి కూడా ఈ వ్యాక్యాన్ని అన్వయించుకోవచ్చు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp