ఉప్పెన విడుదలకు కొత్త స్ట్రాటజీ

By iDream Post Oct. 30, 2020, 04:09 pm IST
ఉప్పెన విడుదలకు కొత్త స్ట్రాటజీ

లాక్ డౌన్ కు ముందు రిలీజ్ ఆగిపోయిన సినిమాల్లో ఉప్పెన ఒకటి. సుప్రీమ్ హీరో సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ని పరిచయం చేస్తూ డెబ్యూ డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీపై మెగా అభిమానుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన రెండు పాటలు బ్లాక్ బస్టర్ అయ్యాక సాధారణ ప్రేక్షకుల్లోనూ ఆసక్తి పెరిగింది. సముద్రం బ్యాక్ డ్రాప్ లో ఓ బెస్తవాడి ప్రేమకథగా రూపొందిన ఉప్పెన ద్వారా కృతి శెట్టి హీరోయిన్ గా పరిచయమవుతోంది. ఇప్పటికే మంచి ఆఫర్లు తనను పలకరిస్తున్నాయి. నాని శ్యామ్ సింగ రాయ్ ఓకే చేసింది కూడా. ఉప్పెనలో విజయ్ సేతుపతి విలనీ మరో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.

ఇదిలా ఉండగా ఉప్పెనను డిసెంబర్ లో విడుదల చేసే అవకాశాలు తక్కువగా ఉండటంతో యూనిట్ కొత్త స్ట్రాటజీని ప్లాన్ చేసుకుందని సమాచారం. 2021 సంక్రాంతికి ఇప్పటికే విపరీతమైన పోటీ ఉంది. అరణ్య, రెడ్, క్రాక్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లతో పాటు పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ వచ్చే అవకాశాల గురించి గట్టి ప్రచారమే జరుగుతోంది. ఇంత రద్దీలో కొత్త హీరో సినిమా వదిలితే చాలా రిస్క్. దానికి తోడు ఇన్ని నెలలు ఓటిటి ఆఫర్లు కాదనుకుని థియేటర్ల కోసం ఎదురు చూసినందుకు ఫలితం దక్కదు. మెగా హీరో మొదటి సినిమా కాబట్టి ఏ చిన్న పొరపాటు కూడా భారీ మూల్యానికి దారి తీయొచ్చు.

తాజా అప్ డేట్ ప్రకారం ఉప్పెనను పండగ బరిలో కాకుండా జనవరి మొదటి వారంలోనే విడుదల చేసే ప్లానింగ్ జరుగుతున్నట్టు తెలిసింది. అవకాశం కుదిరితే ఒకటో తేది అయితే ఎలా ఉంటుందన్న కోణం కూడా చూస్తున్నారట. గతంలో పవన్ కళ్యాణ్ సుస్వాగతం ఇదే తరహాలో న్యూ ఇయర్ రోజే విడుదలై సూపర్ హిట్ కొట్టింది. నాలుగేళ్ల క్రితం రామ్ నేను శైలజ సైతం నూతన సంవత్సర కానుకగా వచ్చి బ్లాక్ బస్టర్ అందుకుంది. సో సంక్రాంతి కంటే ముందే వస్తే సినిమా ఆడదని చెప్పడానికి లేదు. ఈ లెక్కన ఉప్పెనకు ఫస్ట్ వీకే మంచి ముహూర్తంగా కనిపిస్తోంది. హిట్ టాక్ వస్తే తర్వాత ఎన్ని సినిమాలు వచ్చినా మొదటి పది రోజుల్లో ఎక్కువ కలెక్షన్లు రాబట్టుకుని సేఫ్ అవ్వొచ్చు. ఇంకొద్ది రోజుల్లో విడుదల చేయబోయే ఆడియో సింగల్ తో దీని గురించి క్లారిటీ రావొచ్చు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp