నేత్రికన్ రివ్యూ

By iDream Post Aug. 13, 2021, 04:54 pm IST
నేత్రికన్ రివ్యూ

థియేటర్లు తెరుచుకున్నా కూడా ఓటిటి రిలీజులు మాత్రం యథావిధిగా వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడులో సినిమా హాళ్ల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటంతో అక్కడి నిర్మాతలు డిజిటల్ డీల్స్ కు ఓకే చెప్పేస్తున్నారు . అందులో భాగం వచ్చిందే నేత్రికన్. నయనతార ప్రధాన పాత్రలో రంగం ఫేమ్ అజ్మల్ నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మీద ట్రైలర్ వచ్చాక ఓ మోస్తరు అంచనాలు పెరిగాయి, దానికి తోడు గృహం డైరెక్టర్ మిలింద్ రావు టేకింగ్ అనగానే ఇలాంటి జానర్ ని ఇష్టపడే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. డిస్నీ హాట్ స్టార్ ద్వారా ఇవాళ మధ్యాహ్నం రిలీజైన ఈ నేత్రికన్ ని తెలుగులోనూ అందించారు. రిపోర్ట్ ఏంటో చూద్దాం

కథ

సిబిఐ ఆఫీసర్ దుర్గ(నయనతార)తన తమ్ముడితో కలిసి ఓ రాత్రిపూట ప్రయాణం చేస్తుండగా యాక్సిడెంట్ జరిగి కళ్ళు పోతాయి. చేస్తున్న ఉద్యోగం ఊడుతుంది. నగరంలో వరసగా అమ్మాయిలు మాయమవుతూ ఉంటారు. ఆ కిడ్నాపర్ ఎవరో తెలియక పోలీసులు సతమతమవుతారు. ఓ సందర్భంలో ఈ సంఘటనలకు కారణమైన డాక్టర్ జేమ్స్(అజ్మల్)కు సంబంధించిన కొన్ని కీలకమైన ఆధారాలు దుర్గకు తెలుస్తాయి. దీంతో జేమ్స్ కోసం వేట మొదలవుతుంది. కళ్ళు కనిపించకపోయినా పట్టువదలకుండా దుర్గ ఓ ఇన్స్పెక్టర్ తో కలిసి రిస్క్ తీసుకుంటుంది. ఆ తర్వాత ఏమయ్యిందన్నది సినిమాలో చూడాలి

నటీనటులు

నయనతారకు దొరికిన మంచి ఛాలెంజింగ్ పాత్రల్లో ఇది ఒకటి. చూపు లేకపోయినట్టు నటించడం కష్టమే అయినా దాన్ని చాలా ఈజ్ తో మెప్పించిన తీరు ప్రశంసలు దక్కించుకుంది. బరువైన సన్నివేషాలలోనూ తనదైన ముద్ర వేసింది. ఈమె కన్నా ఎక్కువగా మార్కులు కొట్టేసింది మాత్రం అజ్మలే. పైకి సాఫ్ట్ గా కనిపిస్తూ అమ్మాయిలను చిత్రవథ చేసి మానసిక శారీరక ఆనందాన్ని పొందే శాడిస్ట్ గా అద్భుతంగా నటించాడు. ఇన్వెస్టిగేషన్ సీన్ లో చెలరేగిపోవడం ఒక చిన్న ఉదాహరణ. ఫుడ్ డెలివరీ బాయ్ గా నటించిన శరణ్ ఇంప్రెస్ చేశాడు. కీలకమైన ఎస్ఐ క్యారెక్టర్ చేసిన ఆర్టిస్ట్ మాత్రం అంతగా రైట్ ఛాయస్ అనిపించుకోలేదు

డైరెక్టర్ అండ్ టీమ్

దర్శకుడు మిలింద్ రావు తీసుకున్న కథాంశం ఓ కొరియా సినిమా నుంచి స్ఫూర్తి పొందినది. పాయింట్ కొంత యూనీక్ గా అనిపించినప్పటికీ ఇప్పటికే బోలెడు సైకో కిల్లర్లు చూసిన ప్రేక్షకులకు ఇందులో ఎలాంటి కొత్తదనం కనిపించదు. సైకో తాను ఎత్తుకెళ్లిన వాళ్ళను చంపకుండా దాచి పెట్టడం ఒకటే కాస్త డిఫరెంట్ గా అనిపిస్తుంది తప్ప మిగిలిన కథాకథనాలు చాలా సార్లు చూసిన ఫీలింగ్ కలిగిస్తాయి. అక్కడక్కడా కొన్ని గ్రిప్పింగ్ ఎపిసోడ్స్ ఉన్నప్పటికీ సినిమా మొత్తంగా బాగుందని చెప్పడానికి అవి సరిపోలేదు. పైగా క్లైమాక్స్ తో సహా చాలా చోట్ల అవసరానికి మించి ల్యాగ్ ఉండటం ప్రధాన మైనస్.

తమిళంలో రట్ససన్ వచ్చాక ఇలాంటి థ్రిల్లర్స్ కి ఒక బెంచ్ మార్క్ సెట్ అయిపోయింది. దానికి ఏ మాత్రం తక్కువ స్థాయిలో ఉన్నా ఆడియన్స్ డిస్ కనెక్ట్ అయిపోతారు. నేత్రికన్ లో జరిగింది ఇదే. దానికి తోడు చాలా చోట్ల లాజిక్స్ మిస్ కావడం ఔచిత్యాన్ని దెబ్బ తీసింది. ఎంత చివరి ట్రైన్ అయినా మెట్రో స్టేషన్ లో రాత్రి పూట అసలు సిబ్బందే లేకుండా పోరు. కేవలం ఏదో ట్విస్ట్ కోసం అన్నట్టు నయనతారను అజ్మల్ అంతసేపు తరుముతూ ఉన్నా స్టేషన్ లో ఒక్కరు కూడా కనిపించకపోవడం వింతే. ఇలాంటివి ఇంకా ఉన్నాయి. జేమ్స్ ని వెంటాడే క్రమం కూడా ఓ పద్ధతి లేకుండా సాగుతుంది.

ఒరిజినల్ వెర్షన్ లో డ్రామా ఎలా ఉన్నా ఇక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు కొన్ని కీలక మార్పులు చేసి ఉంటే నేత్రికన్ బెటర్ ఛాయస్ గా నిలిచేది. టెక్నికల్ అంశాల మీద పెట్టిన దృష్టి స్క్రీన్ ప్లే మీద పెట్టకపోవడం వల్లే రెండున్నర గంటల నిడివి బోర్ కి కారణమయ్యింది. చివరి ఇరవై నిమిషాలుల్ దుర్గ ఇంట్లో అంత డ్రామా నడపాల్సిన అవసరం లేదు. ఎలాగూ ఓటిటి కదా ఎడిటింగ్ ఎందుకు అనుకున్నారో ఏమో కానీ గృహంతో ఇచ్చిన ఇంపాక్ట్ ని మిలింద్ రావు ఇందులో కొనసాగించలేకపోయారు. ఒక మొనాటనీ ఫార్ములాగా మారిపోతున్న ఈ సైకో ఛేజింగ్ కథలను ఇకపై మేకర్స్ ఇంకా జాగ్రత్తగా రాసుకోకపోతే కష్టమే

ఒక డాక్టర్ సైకో కావడం దానికి కారణం సెక్సువల్ ఫీలింగ్స్ అనే అంశం అచ్చంగా నాగశౌర్య హీరోగా చేసిన అశ్వద్ధామలో ఆల్రెడీ వచ్చేసింది. అందులో హీరో ఇందులో హీరోయిన్ విలన్ ని పట్టుకుంటారు. అంతే తేడా. మిస్కిన్ తీసిన సైకోలోని మెయిన్ లీడ్ కి కళ్ళు లేకపోవడం అనే ట్విస్ట్ ని ఇక్కడ జోడించారు అంతే తేడా. పదే పదే ఇవే కథలను ఎన్ని సార్లు చూపిస్తారనే ఫీలింగ్ మాత్రం కలుగుతుంది. జేమ్స్ జైలు నుంచి తప్పించుకునే సన్నివేశం కూడా పాత స్టైల్ లో సాగుతుంది. మొత్తానికి కిల్లర్ ని మొదటి అయిదు నిమిషాల్లో చూపడం తప్ప మిగిలిన వ్యవహారమంతా రొటీన్ గా సాగింది

సాంకేతిక నిపుణుల్లో గిరీష్ గోపాలకృష్ణన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్లేదు. విలన్ కి సెట్ చేసిన టోన్ ఒక్కటే ప్రత్యేకంగా బాగుందనిపిస్తుంది. పెట్టిన రెండు పాటలు కూడా అనవసరం. ఫార్వార్డ్ కు తప్ప ఎందుకూ ఉపయోగపడలేదు. రాజశేఖర్ ఛాయాగ్రహణం బాగుంది. ఎడిటర్ లారెన్స్ కిషోర్ మాత్రం తన పనితనానికి న్యాయం చేయలేకపోయారు. కరెక్ట్ గా కత్తెర వేసి ఉంటే అరగంట తగ్గేది. నిర్మాణ విలువలు పర్లేదు. రియల్ లొకేషన్స్ లో సబ్జెక్టుకు తగ్గట్టు ఖర్చు పెట్టారు.

ప్లస్ గా అనిపించేవి

నయనతార
అజ్మల్ విలనీ
కొన్ని ట్విస్టులు
ఛాయాగ్రహణం

మైనస్ గా తోచేవి

రొటీన్ లైన్
సాగతీత
ఊహించగలిగే కథనం
సెకండ్ హాఫ్

కంక్లూజన్

లాక్ డౌన్ వల్ల థియేటర్లు తాత్కాలికంగా మూతబడి కొన్ని సినిమాలు ఓటిటిలో రావడం ఎంత ప్లస్సయ్యిందో నేత్రికన్ మరో ఉదాహరణగా నిలిచింది. సైకో కిల్లర్ కథలు చూపించి చూపించి వెండితెరను అరగదీసి క్రమంలో వచ్చిన మరో యావరేజ్ రొటీన్ థ్రిల్లర్ ఇది. బోలెడు ట్విస్టులు, ఉక్కిరిబిక్కరి చేసే స్క్రీన్ ప్లేలతో అరచేతుల్లోకి వరల్డ్ సినిమా వచ్చిన ప్రస్తుత తరుణంలో ఇప్పటి తరం ప్రేక్షకులను మెప్పించాలంటే ఇలాంటి కంటెంట్ సరిపోదు. ఇంకా బలంగా ఉండాలి. పదే పదే మాట్లాడుకునేలా టేకింగ్ మేజిక్ చేయాలి. అప్పుడే రెండున్నర గంటల సినిమాని ఫార్వార్డ్ చేసే అవసరం లేకుండా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు

ఒక్క మాటలో - కొత్త సైకోతో రొటీన్ థ్రిల్లర్

Also Read : గుణశేఖర్ ఇలా - కృష్ణవంశీ ఇలా

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp