ఉర్రూతలూగిస్తున్న స్క్విడ్ గేమ్

By iDream Post Oct. 06, 2021, 12:30 pm IST
ఉర్రూతలూగిస్తున్న స్క్విడ్ గేమ్

సృజనాత్మకత, ప్రేక్షకులను ఎంగేజ్ చేయించే కంటెంట్ ఉండాలే కానీ భాషతో సంబంధం లేకుండా మరీ ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ బ్రహ్మరధం పడతారని ఇటీవలి కాలంలో ఎన్నో వెబ్ సిరీస్ లు ఋజువు చేశాయి. స్ట్రేంజర్ థింగ్స్, మనీ హీస్ట్, డార్క్ లాంటివి ఇండియాలోనూ బ్రహ్మాండమైన ఆదరణ దక్కించుకున్నాయి. వీటికి డిమాండ్ ఏ స్థాయిలో ఉందంటే వరల్డ్ వైడ్ ఒకేసారి తెలుగు తమిళ భాషల్లోనూ రిలీజ్ చేసేలా సదరు ఓటిటి సంస్థలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇటీవలే రిలీజైన కొరియన్ వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్ ట్రెండింగ్ లో దూసుకుపోతూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అసలు అంతగా ఇందులో ఏముంది.

అనగనగా ఒక నగరం. విపరీతమైన ఆర్ధిక ఇబ్బందులతో చావలేక బ్రతుకుతున్న 456 అభాగ్యులను ఒక ముఠా గేమ్స్ ఆడితే బిలియన్ల కొద్ది డబ్బు ఇస్తామని ఆశ చూపించి ఓ దీవికి తీసుకెళ్తుంది. అది బయటి ప్రపంచానికి తెలియని రహస్య చోటు. మొత్తం ఆరు రౌండ్లు పెడతారు. ఒక్కో రౌండ్ లో ఎలిమినేట్ అయ్యేవాళ్ళకు దారుణమైన చావు తప్ప వేరే ఆప్షన్ ఉండదు. చనిపోయిన వాళ్ళ శవాలను అక్కడే కాల్చేస్తారు. ఆటలన్నీ చిన్నపిల్లలవే. కానీ ఓడిపోతేనే పరిస్థితి ఘోరంగా మారుతుంది. అలా అందరూ పోగా చివరికి పదుల సంఖ్యలో మిగులుతారు. చివరికి ఎవరు గెలిచారు, ఆ డబ్బు ఎవరు దక్కించుకున్నారు అనేదే అసలు కథ

సుమారు తొమ్మిది గంటల దాకా నిడివి ఉన్న ఈ వెబ్ సిరీస్ ఆద్యంతం అరెస్టింగ్ స్క్రీన్ ప్లే తో కట్టిపడేస్తుంది. ముఖ్యంగా ఆ ద్వీపాన్ని డిజైన్ చేసిన విధానం, పాత్రల మధ్య ఎస్టాబ్లిషమెంట్లు, టెంపో తగ్గకుండా థ్రిల్ ని కొనసాగించడం, అక్కడక్కడా తప్ప ఎక్కడా బోర్ కి అవకాశాన్ని ఇవ్వవు. దర్శకుడు వాంగ్ డాంగ్ యుక్ కు ఇది రాసుకున్న పదేళ్ల తర్వాత తీసే అవకాశం దక్కింది. అప్పటిదాకా ఈ స్క్రిప్ట్ ని తిరస్కరించిన వాళ్ళు వందల్లో ఉంటారు. పర్ఫెక్ట్ క్యాస్టింగ్ కి అత్యుత్తమ ఉదాహరణగా ఈ సిరీస్ గురించి చెప్పుకోవచ్చు. నెట్ ఫ్లిక్స్ లో కొద్దిరోజుల క్రితం రిలీజైన ఈ థ్రిల్లర్ నెంబర్ వన్ పొజిషన్ వైపు దూసుకుపోతోంది. ఇంకెందుకు ఆలస్యం. చూసేయండి

Also Read : రెహమాన్ గౌతమ్ మీద విమర్శలు సబబేనా

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp