నెపోటిజం - ముదురుతున్న వివాదం

By iDream Post Jun. 18, 2020, 02:09 pm IST
నెపోటిజం - ముదురుతున్న వివాదం

అనూహ్య రీతిలో ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ జ్ఞాపకాలను అభిమానులే కాదు సినీ ప్రేమికులు కూడా మర్చిపోలేకపోతున్నారు. సోషల్ మీడియాలో ఇంకా ఆ ఘటనకు సంబంధించిన చర్చలు జరుగుతూనే ఉన్నాయి. యష్ రాజ్ ఫిలిమ్స్, కరణ్ జోహార్, సల్మాన్ ఖాన్ తదితరుల మీద నెటిజెన్లు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. అంతే కాదు సుశాంత్ కు మద్దతుగా పైన చెప్పిన వాళ్ళ సినిమాలను, ఓటిటి రిలీజులను బ్యాన్ చేయాల్సిందిగా 2.5 మిలియన్ల మూవీ లవర్స్ ఒక పిటీషన్ కు సైన్ చేశారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నెపోటిజం అంటే వారసత్వం మీద అందరూ దుమ్మేతిపోస్తున్నారు. సుశాంత్ ఎదుగుదలను ఓర్వలేక ఎక్కడ తమ బిడ్డలకు పోటీ అవుతాడో అని భయపడి అతన్ని తోక్కేశారని అందుకే అంత తీవ్రమైన నిర్ణయం తీసుకున్నాడని రకరకాల కథనాలు వెలువడుతున్నాయి.

ఇప్పటికే రవీనాటాండన్, మనోజ్ వాజ్ పేయ్, శేఖర్ కపూర్, నిఖితా పటేల్, కంగనా రౌనత్, ప్రకాష్ రాజ్ తదితరులు ఈ పోకడ వల్లే తాము గతంలో బాధితులుగా ఉన్నామని అయితే ఎదురు నిలిచి పోరాడటం వల్లే నిలదొక్కుకున్నామని కాని సుశాంత్ లాంటి సున్నిత మనస్కులు ఇలా చేయడం బాధాకరం అంటూ విచారం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కరణ్ జోహార్ తన సోషల్ మీడియాలో తాను వ్యక్తిగతంగా ఫాలో అవుతున్న సెలెబ్రిటీలు, ఫ్యాన్స్ సంఖ్యని క్రమంగా తగ్గించుకుంటూ పోతున్నారు. ఇప్పుడు అందరి చూపు తన వైపే ఉండటంతో ఒకరకమైన ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అందరికంటే భిన్నంగా కరణ్ జోహార్ కు మద్దతు పలుకుతూ ట్వీట్లు చేయడం గమానార్హం.

ఇక్కడ ఎవరూ ఎవరిని తొక్కే సీన్ లేదని అలాంటివి వచ్చినప్పుడు ధీటుగా పోరాడి నెగ్గాలని అలాంటివాళ్ళే ఇక్కడ ఉండగలరని చెప్పడం మరో చర్చకు దారి తీస్తోంది. నటన అంతంత మాత్రంగా ఉన్న కొందరు వారసులను అదే పనిగా రుద్ది ప్రేక్షకులకు అలవాటు చేశారని ఇకపై ఇలాంటి పోకడ ఉండకూడదని పలువురు బహిరంగంగానే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తమ మీద ఆరోపణలు చేసిన దబాంగ్ దర్శకుడు అభినవ్ కశ్యప్ మీద లీగల్ చర్యలు తీసుకుంటామని సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ స్టేట్ మెంట్ ఇవ్వడం వాతావరణాన్ని వేడెక్కిస్తోంది. మొత్తానికి సుశాంత్ సింగ్ మరణం నెపోటిజంతో పాటు ఎన్నో ప్రశ్నలను సవాళ్ళను రేపుతోంది. నీటి మీదబుడగ తరహాలో ఇది కొద్దిరోజులు మాత్రమే ఉండి మీ టూ ఉద్యమం లాగా నీరుగారి పోతుందా లేక ఏదైనా కొత్త మలుపు తీసుకుంటుందా వేచి చూడాలి .

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp