రజనీకాంత్ చూడగానే ఓకే అన్నారు

By iDream Post Jun. 22, 2020, 07:21 pm IST
రజనీకాంత్ చూడగానే ఓకే అన్నారు

నర్సింగ్ యాదవ్. చేసినవి చిన్న పాత్రలే అయినా, పెద్ద విలన్ వేషాలు వేయకపోయినా ప్రతి ఒక్క మూవీ లవర్ కు బాగా సుపరిచితులు. ఇప్పటిదాకా 300కు పైగా సినిమాల్లో నటించిన నర్సింగ్ యాదవ్ ప్రతినాయక పాత్రలే కాదు కామెడీ తరహా క్యారెక్టర్లతోనూ మెప్పించారు. అయితే ఈయన ఒక్క తెలుగుకు మాత్రమే పరిమితం కాలేదు. వేరే భాషల్లోనూ ఆఫర్స్ వచ్చినప్పుడు కాదనుకుండా ఉపయోగించుకున్నారు. ఒక సందర్భం మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోయేలా జరిగింది. తెలుగులో అప్పుడప్పుడే పైకొస్తున్న దశలో నర్సింగ్ యాదవ్ కు చెన్నై నుంచి కాల్ వచ్చింది. చేసింది గురువు లాంటి ఫైట్ మాస్టర్ రాజు.

బాషా సినిమాలో వేషం ఉందని నీకైతే సూటవుతుందని హీరో డైరెక్టర్ కు చెప్పానని కబురు చేశారు. వెంటనే మదరాసు(చెన్నై ముందు పేరు)చేరుకున్నారు నర్సింగ్ యాదవ్. నేరుగా రాజుతో కలిసి దర్శకుడు సురేష్ కృష్ణ ఇంటికి వెళ్లిపోయారు. సూపర్ స్టార్ దర్శనం అప్పుడే అయ్యింది. చూడగానే రొంబ పర్సనాలిటీ వేషం ఫిక్స్ అని అక్కడికక్కడే స్పాట్ లో చెప్పేశారు. సురేష్ కృష్ణకు సైతం నర్సింగ్ నచ్చేశారు. కట్ చేస్తే విలన్ గా నటించిన రఘువరన్ పక్కన ముఖ్య అనుచరుడిగా ఇచ్చారు. అలా అని గుంపులో గోవిందా లాగా కాకుండా క్లైమాక్స్ లో కొద్దినిమిషాల పాటు వచ్చే సెపరేట్ ఫైట్ సీక్వెన్స్ రజనికాంత్ నర్సింగ్ యాదవ్ మధ్య షూట్ చేశారు సురేష్ కృష్ణ.

అప్పట్లో ఇలా రజనితో సోలో ఫైట్ ఉండటం అంటే దానికి పెద్ద అదృష్టం ఉండాలని మాట్లాడుకునేవాళ్ళు. దెబ్బకు నర్సింగ్ పేరు అందరికి తెలిసిపోయింది. అలా అక్కడా అవకాశాలు రావడం మొదలయ్యాయి. చిన్నా పెద్ద తేడా లేకుండా అందరు దర్శకులు హీరోలతో కలిసి నటించిన నర్సింగ్ యాదవ్ ఇటీవలే స్వల్ప అస్వస్థతకు గురయ్యి కొద్దిరోజులు చికిత్స తీసుకుని కోలుకున్నారు. ఏజ్ తో సంబంధం లేకుండా ఎప్పుడూ ఒకేరకమైన ఎనర్జీని చూపించే నర్సింగ్ యాదవ్ బాలీవుడ్ లోనూ బాబీ డియోల్ లాంటి హీరోల సరసన అవకాశాలు దక్కించుకున్నారు. చిరంజీవి ఖైదీ నెంబర్ 150 తర్వాత నర్సింగ్ యాదవ్ మళ్ళీ తెరపై ఎక్కువగా కనిపించలేదు. లాక్ డౌన్ అయ్యాక మళ్ళీ వేగం అందుకోవాలని ఆశిస్తున్నారు అభిమానులు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp