నారప్ప రివ్యూ

By iDream Post Jul. 20, 2021, 01:32 am IST
నారప్ప రివ్యూ

తెలుగు సినిమా ప్రదర్శనలో కొత్త శకం మొదలయ్యింది. ఓటిటిలో సినిమాలు డైరెక్ట్ రిలీజ్ రావడం గత ఏడాదే మొదలైనప్పటికీ మూడున్నర దశాబ్దాల నటనానుభవం ఉన్న వెంకటేష్ లాంటి పెద్ద హీరో చిత్రం డిజిటల్ లో రావడం మాత్రం ఇదే ప్రథమం. ఒకవేళ థియేటర్ లో వచ్చి ఉంటే కనీసం ముప్పై కోట్లు బిజినెస్ చేసే కెపాసిటీ ఉన్న మూవీ కావడంతో డిస్ట్రిబ్యూషన్ వర్గాల్లో విమర్శల సంగతి ఎలా ఉన్నా ఇటు అభిమానులు అటు ప్రేక్షకుల్లో దీని మంచి అంచనాలు ఉన్నాయి. రీమేక్ అయినప్పటికీ ఇంత వయొలెంట్ రా స్టోరీని సాఫ్ట్ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఎలా తీసుంటాడన్న ఆసక్తి కూడా ఎక్కువగానే ఉంది. మరి ఇదెలా ఉందో రివ్యూలో చూసేద్దాం

కథ

1980 సంవత్సరం అనంతపురం ప్రాంతం ఓ మారుమూల ఊరవతల చిన్న గుడిసెలో భార్య సుందరమ్మ(ప్రియమణి), ముగ్గురు పిల్లలు, బావ బసవయ్య(రాజీవ్ కనకాల)లతో ప్రశాంతంగా జీవితం గడుపుతూ ఉంటాడు నారప్ప(వెంకటేష్). ఎలాంటి గొడవలకు వెళ్లకుండా ఉండే మనస్తత్వం తనది. మొదటి కొడుకు మునికన్న(కార్తీక్ రత్నం)పొలం సరిహద్దుల విషయంలో పెద్ద కులపోళ్లతో గొడవ పెట్టుకోవడంతో ఓ రాత్రి హత్యకు గురవుతాడు. దీనికంతా కారణమైన పండుస్వామి(ఆడుకాలం నరేన్)మనుషులు తప్పించుకు పారిపోయిన ఈ కుటుంబం వెనుక పడతారు.అప్పుడే శాంతమూర్తిగా కనిపించే నారప్ప తీవ్రమైన గతం బయట పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది తెరమీద చూడాలి

నటీనటులు

సుదీర్ఘమైన కెరీర్లో ఎన్నో విలక్షమైన పాత్రలను చేసిన వెంకటేష్ కు ప్రమోషన్ ఇంటర్వ్యూలలో చెప్పినట్టు ఇది ఛాలెంజింగ్ అనిపించే పాత్రే. ఒరిజినల్ వెర్షన్ లో ధనుష్ పెర్ఫార్మన్స్ తో పోల్చినా పోల్చకపోయినా తన అనుభవాన్ని రంగరించి నారప్ప పాత్రలో వెంకీ విశ్వరూపం చూపించారు. ఫ్లాష్ బ్యాక్ లో యువకుడిగా, వర్తమానంలో వయసు మీద పడిన ముగ్గురు పిల్లల తండ్రిగా చాలా సులువుగా అందులో ఒదిగిపోయారు. అభిమానుల కోణంలో చూసుకుంటే వాళ్ళవరకు ఇది నిజంగా థియేటర్లో చూడాల్సిన ఎక్స్ పీరియన్సే. శత్రువులను నరికేసే సన్నివేశాల్లో ఎంత వయొలెంట్ గా కనిపించాడో బరువెక్కించే ఎమోషనల్ సీన్లో అంతే కంటతడి పెట్టించారు

ప్రియమణికి చాలా రోజుల తర్వాత గట్టిగా చెప్పుకునే క్యారెక్టర్ దక్కింది. గ్లామర్ ఆకర్షణ కొంచెం కూడా అవసరం లేని పాత్ర కావడంతో దానికి తగ్గట్టే ఆవిడా చెలరేగిపోయారు. సీనియర్ల ముందు బెరుకు లేకుండా కార్తీక్ రత్నం ఉన్నంత సేపు తన ఉనికిని చాటుకున్నాడు. సిన్నబ్బగా నటించిన రాఖీ బాగా గుర్తుండిపోతాడు. లాయర్ గా చేసిన రావు రమేష్ రొటీనే. విలన్ గా నటించిన తమిళ నటుడు ఆడుకాలం నరేన్ పాత్రకు తగ్గట్టు చేశారు. శ్రీతేజ, అమ్ము అభిరామి, రాజీవ్ కనకాల, నాజర్, బ్రహ్మాజీ, ఝాన్సీ, ప్రభాకర్, వశిష్ట సింహ తదితరులు సహజంగా చేసుకుంటూ ఆయా పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారు.

డైరెక్టర్ అండ్ టీమ్

పైకి సులభంగా అనిపించినా రీమేకుల్లో చాలా రిస్క్ ఉంటుంది. అందులోనూ నేటివిటీ డామినేషన్ తో సాగే అసురన్ లాంటి కథలను తెలుగు ఆడియన్స్ కి నచ్చేలా తీయడం అంత సులభం కాదు. అందుకే నారప్పను ప్రకటించినప్పుడు ఎన్నో సందేహాలు తలెత్తాయి. పైగా శ్రీకాంత్ అడ్డాల దర్శకుడనగానే అవి రెట్టింపయ్యాయి. నిజానికి తమిళ తెలుగు ఆడియన్స్ సెన్సిబిలిటీస్ లో చాలా తేడాలుంటాయి. వాటిని సరిగ్గా గుర్తించినప్పుడే అసురన్ లాంటి రీమేకులు తెరమీద బాగా పండుతాయి. అయితే ఒరిజినల్ సోల్ మిస్ కాకూడదని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల టీమ్ యధాతథంగా నారప్పను తీయడం ఎంత ప్లస్ అయ్యిందో అంతే మైనస్ అయ్యింది.

వాస్తవానికి అసురన్ దర్శకుడు వెట్రిమారన్ ఆలోచన వేరు. తమిళనాట దశాబ్దాల వెనుక ఊపిరి పోసుకుని ఇప్పటికీ పలు ప్రాంతాల్లో ప్రభావం చూపిస్తున్న కుల వివక్షకు రివెంజ్ డ్రామాని జోడించి ధనుష్ లాంటి స్టార్ హీరోతో చేసిన ప్రయోగం అక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు సాగి గొప్ప విజయం అందుకుంది. కానీ తెలుగుకు వచ్చేటప్పటికీ సగటు తెలుగు ఆడియన్స్ ఆ స్థాయి ఎమోషన్ ని రిసీవ్ చేసుకోలేరు. మన ఆలోచనా విధానం వేరు. దాని వల్లే ఇదో నరికివేతల సగటు ప్రతీకారపు సినిమాగా అనిపిస్తుందే తప్ప విపరీతమైన ఆలోచనలకు గురి చేయదు. అలా అని నారప్ప నిరాశ పరుస్తుందని కాదు.

వెంకటేష్ అనే పవర్ హౌస్, ఇతర ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ తో పాటు సహజమైన గ్రామీణ వాతావరణం నారప్పను చాలా మటుకు కాపాడాయి. మొత్తంగా శ్రీకాంత్ అడ్డాల పనితనం గురించి ఎక్కువగా ప్రస్తావించే అవకాశం ఇందులో దొరకలేదు. కేవలం కలర్స్ మారకుండా అసురన్ ని పర్ఫెక్ట్ గా జిరాక్స్ తీయడంలో మాత్రం నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యాడు. ఆరు పదుల వయసుకి దగ్గరగా ఉన్న వెంకీ ఎనర్జీని ఇందులో పూర్తిగా వాడుకునే అవకాశాన్ని వృధా కానివ్వలేదు. అయితే సీన్ టు సీన్ పెట్టేయడం కాకుండా ల్యాగ్ ని కాస్త పట్టించుకుని స్లో నేరేషన్ ఉన్న చోట కొంత వేగం పెంచి ఉంటే నారప్ప ఇంకా స్పీడ్ గా కదిలేవాడు.

నారప్పలో ఏదైనా కంప్లయింట్ ఉందంటే అది కేవలం ఎంటర్ టైన్మెంట్ గురించే. చంటి, పెదరాయుడు, రంగస్థలం లాంటి ఏ పల్లెటూరి నేపథ్యంలో సాగే సినిమాలు తీసుకున్నా వాటిలో అన్ని అంశాలు ఉంటాయి. పాటలు కావొచ్చు, కామెడీ కావొచ్చు, చెప్పాలనుకున్న మెసేజ్ కావొచ్చు, సీరియస్ యాక్షన్ డ్రామా కావొచ్చు. ఏదీ మిస్ కాదు. కానీ నారప్పలో ఇవి బ్యాలన్స్ కాలేదు. అసురన్ తీసిన వెట్రిమారన్ ఉద్దేశం ఇక్కడి ప్రేక్షకుడికి అనవసరం. మనకు ఇది వెంకటేష్ సినిమా అంతే. ప్రత్యేకమైన అంచనాలు ఉంటాయి. ఆ కోణంలో చూస్తే పైన చెప్పినవి మిస్ అయిన ఫీలింగ్ ఖచ్చితంగా కలుగుతుంది.

ఇది థియేటర్లో అయ్యుంటే గొప్పగా ఆడేదా లేదా అనే ప్రశ్నను వేసుకోవడం అనవసరం. ఓటిటిలో చూస్తున్నాం కదా దానికి తగ్గ సంతృప్తి దొరుకుతుందా అంటే ఏ మాత్రం తడబడకుండా ఔను అని ధైర్యంగా చెప్పొచ్చు. డిజిటల్ లో వచ్చిన నారప్ప మీద బాహుబలి రేంజ్ లో విపరీతమైన అంచనాలు లేవు కాబట్టి ఆటోమేటిక్ గా నిరాశ పరిచే అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ముందే చెప్పినట్టు వెంకటేష్ అనే స్థంభం ఈ రీమేక్ బిల్డింగ్ ని కూలిపోకుండా నిలబెట్టింది. క్యాస్టింగ్ విషయంలో నారప్ప బృందాన్ని మెచ్చుకోవాలి. పర్ఫెక్ట్ టైమింగ్ ఉన్న ఆర్టిస్టులతో సహజత్వం ఎక్కువగా వచ్చేలా ఎంపిక చేసుకోవడం బాగా కలిసి వచ్చింది

సంగీత దర్శకుడు మణిశర్మ ప్రత్యేకంగా దీని కోసం చేసిందంటూ ఏమి లేదు. జివి ప్రకాష్ కుమార్ కంపోజ్ చేసిన ఒరిజినల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని యథాతథంగా వాడటంతో మెలోడీ బ్రహ్మ మార్కు బీజీఎమ్ ఇందులో మిస్ అయ్యింది. ఇది మైనస్ కాకపోయినా ఈ మాత్రం దానికి అంత అనుభవం ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ని ఎందుకు తీసుకున్నారన్న ప్రశ్న తలెత్తుతుంది. ఉన్న కాసిన్ని పాటలు కూడా గొప్పగా లేకపోవడం మాత్రం మైనస్సే. శ్యామ్ కె నాయుడు ఛాయాగ్రహణం సబ్జెక్టు డిమాండ్ చేసిన స్టాండర్డ్ కు తగ్గట్టు ఉంది. ఫ్రేమ్ టు ఫ్రేమ్ కు అసురన్ కు దీనికి పెద్దగా మార్పులు అనిపించవు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ సైతం ఇదే టెంప్లేట్ ని ఫాలో అయిపోయింది. డైలాగులు బాగా కుదిరాయి. కాకపోతే సీమ యాసను అంత పర్ఫెక్ట్ గా సెట్ చేయలేకపోయారు. బడ్జెట్ కోట్లలో డిమాండ్ చేసే స్క్రిప్ట్ కాకపోవడంతో సురేష్ బాబుకు నిర్మాణ పరంగా ఫేస్ చేసిన రిస్క్ పెద్దగా లేదనే చెప్పాలి

ప్లస్ గా అనిపించేవి

వెంకటేష్ పెర్ఫార్మన్స్
లొకేషన్స్
క్యాస్టింగ్
బిజిఎం

మైనస్ గా తోచేవి

వయొలెన్స్
కొంత స్లో నెరేషన్
పాటలు
జీరో ఎంటర్ టైన్మెంట్

కంక్లూజన్

ఓటిటి రిలీజ్ ద్వారా సినీ పరిశ్రమలో పెద్ద చర్చకు దారి తీసిన నారప్ప ఎట్టకేలకు ఇంటి నుంచి బయటికి వెళ్లే అవసరం లేకుండా నేరుగా ప్రేక్షకుల వద్దకే వచ్చేశాడు. ఎంటర్ టైన్ చేసే కమర్షియల్ అంశాలు లేకుండా ఒక సీరియస్ విలేజ్ రివెంజ్ డ్రామాను చూడాలనుకుంటే మాత్రం నారప్పని మిస్ చేయొద్దు. ఏదో రంగస్థలం తరహాలో ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ లాంటి అంచనాలు పెట్టుకుంటే మాత్రం కొంత నిరాశ తప్పకపోవచ్చు. అసురన్ చూసినా చూడకపోయినా దానికే మాత్రం తీసిపోని రీతిలో నారప్పని తీర్చిదిద్దిన తీరు ఫైనల్ గా గుడ్ ఛాయస్ అనిపించింది. వెంకటేష్ నుంచి ఏది ఆశించామో అది సంపూర్ణంగా అందించింది కాబట్టి పైసా వసూల్ గానే చెప్పుకోవచ్చు

ఒక్క మాటలో - పాస్ అయ్యాడప్పా

Also Read: అసుర‌న్‌ని "నార‌ప్ప‌" అందుకున్నాడా?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp