ఆసక్తి రేపుతున్న 'నాంది' పరిచయాలు

By iDream Post Jun. 29, 2020, 02:13 pm IST
ఆసక్తి రేపుతున్న 'నాంది'  పరిచయాలు

అల్లరి నరేష్ హీరోగా రూపొందుతున్న నాంది తాలుకు ప్రమోషన్ వేగమందుకుంది. లాక్ డౌన్ కు ముందే షూటింగ్ లో కీలక భాగం పూర్తి చేసిన యూనిట్ ఇప్పుడు తుది మెరుగులు దిద్దే పనుల్లో బిజీగా ఉంది. గత కొంత కాలంగా హిట్స్ లేక కొంచెం గ్యాప్ తీసుకుని మహేష్ బాబు మహర్షితో మంచి కంబ్యాక్ ఇచ్చిన నరేష్ నాందితో తనలోని కొత్త కోణాన్ని చూస్తారని నమ్మకంగా చెబుతున్నారు. తాజాగా వదిలిన ఇందులోనూ యాక్టర్స్ లుక్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటిదాకా నాందిలో ఎవరెవరు నటిస్తారనే దాని గురించి స్పష్టమైన సమాచారం లేదు. దాన్ని కవర్ చేస్తూ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్న నలుగురిని పోస్టర్ల రూపంలో పరిచయం చేసింది యూనిట్.

లాయర్ ఆద్యాగా ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్ పవర్ ఫుల్ పాత్ర చేస్తోంది. నిందితుడిగా ఉన్న హీరో తరఫున పోరాడే న్యాయవాదిగా కథలో కీలకంగా ఉండబోతోంది. తెనాలి రామకృష్ణ బిఎబిఎల్ తర్వాత ఆమె నటిస్తున్న తెలుగు స్ట్రెయిట్ మూవీ ఇదే. కమెడియన్ కం హీరో ప్రియదర్శి ఇందులో రాధాకృష్ణగా కాస్త సీరియస్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్నాడు. పోలీస్ ఆఫీసర్ గా హరీష్ ఉత్తమన్ నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో కనిపించబోతున్నాడు. సంతోష్ పేరుతో ప్రవీణ్ కూడా చాలా ప్రాధాన్యం ఉన్న రోలే దక్కించుకున్నారు.

ఇలా ఒకేసారి వీళ్ళను రివీల్ చేశారంటే ఖచ్చితంగా కథ వీళ్ళ చుట్టే తిరుగుతుందని అర్థమవుతోంది. అసలైన అల్లరి నరేష్ లుక్ మాత్రం బయట పెట్టలేదు. రేపు టీజర్ రూపంలో బయటికి రాబోతున్నాడు. స్క్రిప్ట్ డిమాండ్ మేరకు ఇందులో నగ్నంగా చేశాడన్న టాక్ ఇప్పటికే ఉంది. విజయ్ కనకమేడల దర్శకుడిగా పరిచయమవుతున్న నాందిని సతీష్ వేగ్నేశ(దర్శకులు కాదు) నిర్మిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూరుస్తున్న నాంది థియేటర్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారా లేక డిజిటల్ వైపు చూస్తున్నారా అనే చర్చ కూడా ఫిలిం నగర్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. నేను, గమ్యం తర్వాత అల్లరి నరేష్ చేస్తున్న సీరియస్ డ్రామా ఇదే. దీంతో పెద్ద బ్రేక్ దొరుకుతుందన్న నమ్మకంతో ఉన్నాడు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp