ఆదిత్య మేజిక్ రిపీట్ చేయగలరా

By iDream Post Jun. 11, 2021, 02:00 pm IST
ఆదిత్య మేజిక్ రిపీట్ చేయగలరా
నందమూరి బాలకృష్ణ కెరీర్ లో అత్యుత్తమ చిత్రాల్లో ఎంచుకోదగ్గ సినిమా ఆదిత్య 369. విడుదలై ముప్పై ఏళ్ళవుతున్నా టీవీలో వచ్చిన ప్రతిసారి అభిమానులే కాక సాధారణ ప్రేక్షకులు సైతం ఆ మేజిక్ ని ఆస్వాదిస్తూ ఉంటారు. బాలయ్య నటన-సింగీతం దర్శకత్వం-ఇళయరాజా సంగీతం ఇలా ఓ అపూర్వ కలయికకు వేదికగా నిలిచిన ఈ ఆణిముత్యం తర్వాత ఆ స్థాయిలో ఇంకే సైన్స్ ఫిక్షన్ రాలేదన్నది వాస్తవం. అయితే సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూనే ఉన్నారు. కొన్నేళ్ల క్రితం సింగీతం శ్రీనివాసరావు గారు ఆసక్తి చూపించారు కానీ వయసు దృష్ట్యా ఇప్పుడు ఆయన ఫుల్ లెన్త్ డైరెక్టర్ గా సినిమా తీయడం ఇబ్బందే.

తర్వాత ఆ ప్రస్తావన ఆగిపోయింది. నిన్న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఓ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూలో మరోసారి ఇది చర్చకు వచ్చింది. అయితే ఆశ్చర్యకరంగా బాలయ్య ఆదిత్య 369 కొనసాగింపుని తానే దర్శకత్వం వహించి తీస్తానని అందరూ ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీ కూడా ఇందులోనే ఉంటుందని చెప్పి ఆశ్చర్యపరిచాడు. ఇది అభిమానులకు ఎంత ఆనందాన్ని కలిగిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంతకు మించి వివరాలు చెప్పకపోయినా సీక్వెల్ ని కన్ఫర్మ్ చేశారు కాబట్టి బ్యాక్ గ్రౌండ్ స్క్రిప్ట్ వర్క్ జరిగే ఉంటుంది. దీనికి టైటిల్ గా ఆదిత్య 999 అనుకున్నారని అప్పట్లో టాక్ కూడా వచ్చింది.

ఇదంతా బాగానే ఉంది కానీ ముప్పై ఏళ్ళ క్రితం అరుదైన కలయిక రూపొందిన ఈ మాయాజాలాన్ని అంతకు మించి అనే స్థాయిలో రూపొందించడం సాధ్యమేనా అనేదే అసలు ప్రశ్న. ఆ సినిమాకు పనిచేసిన జంధ్యాల, గొల్లపూడి, అమ్రిష్ పూరి, సుత్తివేలు, సిల్క్ స్మిత, సోమయాజులు, రావికొండల్ రావు, పొట్టి ప్రసాద్ తదితరులు ఈ లోకంలో లేరు. కొందరు టెక్నీషియన్లు కూడా కాలం చేశారు. ఇదేమి సమస్య కానప్పటికీ ఇంత పెద్ద క్వాలిటీ క్యాస్టింగ్ ని సెట్ చేసుకోవడం పెద్ద సవాల్. అందులోనూ అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి కాబట్టి మొదటిసారి దర్శకత్వపు ఒత్తిడిని బాలయ్య తట్టుకోవాలి. చూద్దాం మరి.
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp