సంగీతం నేర్చుకోలేదు కానీ

By iDream Post Jul. 13, 2020, 08:23 pm IST
సంగీతం నేర్చుకోలేదు కానీ

తెలుగు సినిమా ప్రస్థానంలో సంగీత దర్శకులు ఎందరో ఉన్నారు లేడీ మ్యూజిక్ డైరెక్టర్స్ గురించి చెప్పమంటే వెంటనే ఎవరూ చెప్పలేకపోవచ్చు. ఇది ఒకప్పటి పరిస్థితి. కాని ఎంఎం శ్రీలేఖ వచ్చాక ఇందులో మార్పు వచ్చిందనే చెప్పాలి. 12 ఏళ్ళ అతి చిన్న వయసులోనే సోదరుడు వరసయ్యే కీరవాణి దగ్గర పాఠాలు నేర్చుకున్న శ్రీలేఖ 1995లో దాసరి గారి నాన్నగారు సినిమాతో పరిచయమై సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలో అదే సంవత్సరం తాజ్ మహల్ ద్వారా పెద్ద మ్యూజికల్ హిట్ అందుకోవడం చిన్న విషయం కాదు. ఇప్పటికీ అందులో పాటలను మెలోడీ లవర్స్ బాగా ఇష్టపడతారు.

గీత రచయిత చంద్రబోస్ కు బ్రేక్ ఇచ్చింది కూడా ఈ సినిమానే. ముఖ్యంగా మంచు కొండల్లోని చంద్రమా మళ్ళీ మళ్ళీ వచ్చిపో సాంగ్ అప్పట్లో మారుమ్రోగిపోయింది. ఆ తర్వాత దాసరి గారు తీసిన నాన్నగారు, కొండపల్లి రత్తయ్య కూడా శ్రీలేఖకు మంచి పేరు తీసుకొచ్చాయి. చిన్నవే కాకుండా విక్టరీ వెంకటేష్ ధర్మచక్రంతో స్టార్ హీరోలవి కూడా ఎలాంటి ఒత్తిడి లేకుండా డీల్ చేయగలనని రుజువు చేసిన శ్రీలేఖ 75 సినిమాలకు సంగీతం అందించడం గొప్ప ఘనత. ఇక్కడో విశేషం ఉంది. శ్రీలేఖకు ఎలాంటి సంగీత శిక్షణ లేదు. కేవలం ఆసక్తి, అన్నయ్య దగ్గర చేసిన శిష్యరికం, మణిశర్మ లాంటి వాళ్ళను దగ్గర నుంచి చూడటం తనకు ఎంతో దోహద పడ్డాయి.

పాటైనా, నేపధ్య సంగీతమైనా ఆశువుగా కంపోజ్ చేసే శ్రీలేఖ హిందిలోనూ హం ఆప్కే దిల్ మే రేహేతే హై, ఆఘాజ్ లాంటి వాటితో పేరు తెచ్చుకున్నారు. ఇలా ఇంత ప్రభావం చూపించి సినిమా సంగీతంలో తనకంటూ ఒక పేజీను రాసుకున్న వ్యక్తిగా శ్రీలేఖ చాలా స్పెషల్ గా నిలిచిపోయారు. ప్రేమించు, శివయ్య, ప్రేయసి రావే లాంటి మెమొరబుల్ హిట్స్ కూడా తనకే ఉన్నాయి. సురేష్ సంస్థలో ఎక్కువ సక్సెస్ కలిగిన శ్రీలేఖ 2003లో పెళ్లి చేసుకున్నాక బ్రేక్ తీసుకున్నారు. కొంతకాలం తర్వాత మళ్ళీ కొనసాగించారు. నేపధ్య గాయనిగా కూడా ఇతర సంగీత దర్శకత్వంలో మంచి పాటలు పాడిన శ్రీలేఖను ప్రత్యేకంగా అభిమానించే ఫ్యాన్స్ ఎందరో ఉన్నారు. ఆడమగ ఎవరైనా సినిమా సంగీతంలో కష్టం ఒకటే ఉంటుందని చెప్తారు. తన తర్వాత ఇంకెవరు ఆ స్థాయిలో ప్రభావం చేసిన లేడి మ్యూజిక్ డైరెక్టర్ లేకపోవడం గమనార్హం

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp