గౌతమ్ విషయంలో మహేష్ ప్లాన్

By iDream Post May. 26, 2020, 01:14 pm IST
గౌతమ్ విషయంలో మహేష్ ప్లాన్

సూపర్ స్టార్ కృష్ణ గారి వారసుడనే బిరుదుని సార్ధకం చేస్తున్న మహేష్ బాబు లాక్ డౌన్ వల్ల పూర్తిగా ఫ్యామిలీతో ఇంట్లోనే గడుపుతున్నాడు. నమ్రతా రెగ్యులర్ గా వాళ్ళ సరదాల తాలూకు ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంది. ముఖ్యంగా మొన్న మహేష్ గౌతమ్ ల మధ్య సరదాగా సాగే ఒక చిన్న క్లిప్ బాగా వైరల్ అయ్యింది కూడా. 1 నేనొక్కడినేతో గౌతమ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చినా ఆ తర్వాత ఏ సినిమా చేయలేదు. ఇప్పుడు ఇతను ఎదిగిన తీరు చూసి అభిమానులు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తున్నారు. మహేష్ బాబు హీరోగా రాజకుమారుడుతో పరిచయం కాకముందే చైల్డ్ ఆర్టిస్ట్ గా 80వ దశకంలో చెప్పుకోదగ్గ సినిమాలు చేశాడు.

కొడుకు దిద్దిన కాపురం, ముగ్గురు కొడుకులు లాంటివి ఘన విజయాలు సొంతం చేసుకున్నాయి. కేవలం మహేష్ ఇమేజ్ ని ఆధారంగా చేసుకుని బాలచంద్రుడు అనే సోలో మూవీ కూడా అప్పట్లో తీశారు. దాని తర్వాత ప్రిన్స్ బ్రేక్ తీసుకున్నాడు. అప్పుడు కృష్ణ గారు అలా చేయడానికి కారణం ఉంది. 1983లో ఖైదీ నుంచి చిరంజీవి రూపంలో కృష్ణ గారికి ఊహించని పోటీ ఎదురైంది. యూత్ అంతా అతని వైపు టర్న్ అవుతుండటంతో తన ఫ్యాన్ బేస్ ని సంతృప్తి పరచడం కోసం ముందు చైల్డ్ ఆర్టిస్ట్ గా మహేష్ ని ఆ తర్వాత సోలో హీరోగా రమేష్ బాబుని రంగంలోకి దింపారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా రమేష్ బాబు సక్సెస్ కాలేదు. ఒకటి రెండు సినిమాలు హిట్ అయినా మార్కెట్ ని సృష్టించుకోవడానికి అవి సరిపోలేదు.

మహేష్ గూఢచారి 117 లాంటి చిత్రాల్లో మెప్పించినా ఆ టైంలో తనది చాలా చిన్న వయసు. అప్పటికే చిరంజీవి మార్కెట్ ని ఆక్రమించేసి నెంబర్ వన్ స్థానానికి దూసుకుపోతున్నాడు. కానీ కృష్ణ గారు మహేష్ ని సక్సెస్ ఫుల్ ఆర్టిస్ట్ గా పరిచయం చేయడంలో తన అభిమానులకు ఒక భరోసా ఇవ్వడంలో విజయం సాధించారు. తాను క్రమంగా సినిమాలు తగ్గించినా మహేష్ రూపంలో ఒక గ్యారెంటీ అయితే అప్పటికే ఫ్యాన్స్ కు దొరికేసింది. ఇక వర్తమానానికి వస్తే మహేష్ కు అలాంటి సిచువేషన్ ఏమి లేదు. సో గౌతమ్ ని నింపాదిగా ఒక ఏడెనిమిదేళ్ల తర్వాత లాంచ్ చేయొచ్చు. తనలా చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రూవ్ చేయించే అవసరమూ లేదు. కాబట్టి ప్రిన్స్ వారసుడి డెబ్యూకి ఇంకా చాలా సమయం ఉంది. మహేషే ఫుల్ ఫామ్ లో ఉన్న టైంలో ఇలాంటి ఆలోచనలు కూడా అవసరం లేదనే చెప్పాలి

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp