లాక్ డౌన్ రివ్యూ 27 - హత్య వెనుక రాజకీయం

By iDream Post Jul. 13, 2020, 04:16 pm IST
లాక్ డౌన్ రివ్యూ 27 - హత్య వెనుక రాజకీయం

హిందీలో ఈ మధ్య మంచి క్రైమ్ థ్రిల్లర్స్ విస్తృతంగా వస్తున్నాయి. గంటల తరబడి ఎపిసోడ్ల వారీగా సాగే వీటి మీద ప్రేక్షకులు బాగానే ఆసక్తి చూపిస్తున్నారు. అందులోనూ క్యాస్టింగ్ విషయంలో మేకర్స్ తీసుకుంటున్న శ్రద్ధ కూడా హైప్ పెంచడానికి ఉపయోగపడుతోంది. ఇండియాలో పేరొందిన యాప్స్ సుమారు పదిహేను దాకా ఉండటం చూస్తే ఇందులో అవకాశాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది. ఇటీవలే సోనీ లివ్ ద్వారా విడుదలైన వెబ్ సిరీస్ అన్ దేఖీ. కొద్దిరోజుల క్రితం రిలీజైన ట్రైలర్ అంచనాలు రేపింది. గట్టి పోటీని తట్టుకోవాలని ప్రయత్నిస్తున్న సోనీ సంస్థ క్వాలిటీ కంటెంట్ మీద ఎక్కువ దృష్టి పెట్టిందని ఈ మధ్యకాలంలో వచ్చిన వెబ్ సిరీస్ లను బట్టి చెప్పొచ్చు. మరి ఈ అన్ దేఖీ ఎలా ఉందో, కథాకమామీషు వగైరా రివ్యూలో చూసేద్దాం

కథ

బెంగాల్ దట్టమైన అడవుల్లో ఓ పోలీస్ ఆఫీసర్ హత్య జరుగుతుంది. అది చేసింది గిరిజన తండాకు చెందిన ఇద్దరు యువతులని గుర్తించిన డిఎస్పి బారున్ ఘోష్(దిబ్యెందు భట్టాచార్య)వాళ్ళను పట్టుకోవడం కోసం మధ్యప్రదేశ్ లోని మనాలికి వెళ్తాడు. ఆ అమ్మాయిలు అక్కడో ధనవంతుల ఇంటి పెళ్లిలో డాన్స్ చేసేందుకు ఓ బృందం తరఫున హాజరవుతారు. రాత్రి పూట ప్రోగ్రాం జరుగుతుండగా పెళ్లికొడుకు తండ్రి అత్వాల్(హర్ష్ ఛాయా) తాగిన మత్తులో అందులో ఒకరిని కాల్చి చంపేస్తాడు. దీంతో ఈ వ్యవహారమంతా చూసుకుంటున్న రింకు(సూర్య శర్మ)వెంటనే ఆ రెండో అమ్మాయి కోయల్(అపేక్ష పోర్వాల్)ని అక్కడి నుంచి మాయం చేస్తాడు. ఇదంతా పెళ్లి కూతురు తేజీ(ఆంచల్ సింగ్)కు తెలియకుండా జాగ్రత్త పడతారు.

అయితే ఆ హత్యను అనుకోకుండా వీడియోలో షూట్ చేస్తాడు ఫోటోగ్రాఫర్ రిషి(అభిషేక్ చౌహాన్). ఇది రింకుకు తెలిసిపోతుంది. రిషి కోసం వేట మొదలుపెడతాడు. అక్కడికి విచారణ కోసం వచ్చిన ఘోష్ ని స్థానిక పోలీసుల సహకారంతో ఏమారుస్తాడు రింకు. నేరాన్ని దాచి పెట్టే క్రమంలో తప్పుల మీద తప్పులు జరిగిపోతాయి. వెడ్డింగ్ రిసార్ట్ కాస్తా క్రైమ్ ప్లేస్ గా మారిపోతుంది. రిషి బాస్ గా వచ్చిన సలోని(ఆయాన్ జోయా)తన స్వార్థానికి పరిస్థితులను వాడుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈలోగా అనూహ్యమైన పరిణామాలు జరిగి రిషి, కోయల్ కలిసి అక్కడి నుంచి పారిపోతారు. ఒకవైపు రింకు మరోవైపు ఘోష్ అందరూ కలిసి వీళ్ళ వెంటపడతారు. తర్వాత ఏమైంది. రింకు కోయల్ ని పట్టుకున్నాడా, రిషి తీసిన వీడియో సాక్ష్యం ఏమయ్యింది లాంటి ప్రశ్నలకు సమాధానం తెరమీద చూడాలి.

నటీనటులు

ఇందులో చాలా పెద్ద క్యాస్టింగ్ ఉంది. ప్రధానంగా ఒకే పాత్ర చుట్టూ తిరుగుతుందని చెప్పడానికి లేకుండా దర్శకుడు చాలా తెలివిగా అందరిని సంపూర్ణంగా వాడుకున్నాడు. ఇందులో హీరో అంటూ ఎవరు లేరు. ఇంకా చెప్పాలంటే విలన్ పాత్ర రింకుగా నటించిన సూర్య శర్మని స్టీలర్ అఫ్ ది షో అని చెప్పొచ్చు. ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నా కూడా ఏ మాత్రం తొణక్కుండా కుటుంబం పరువు పోకూడదని ఎంతకైనా తెగించే పాత్రం జీవించేశాడు. పొట్టిగా నల్లగా ఉండే డిఎస్పి ఘోష్ గా నటించిన దివ్యెందు భట్టాచార్య మంచి టైమింగ్ తో ఆకట్టుకున్నారు.

మొదట్లో ఏంటీయన అనే ఫీలింగ్ కలిగించినా క్రమంగా తన పెర్ఫార్మన్స్ తో నిలబెట్టేశారు. కథలో సెంటర్ పాయింట్ గా నిలిచిన ఫొటోగ్రాఫర్ గా చేసిన అభిషేక్ చౌహాన్ సైతం వీళ్ళకు ధీటుగా నటించాడు. పొద్దస్తమానం తాగుతూ వాగే పెళ్లికొడుకు తండ్రిగా హర్ష ఛాయా అక్కడక్కడా కొంచెం ఓవర్ గా అనిపించినా ఆ మాత్రం లేనిదే పాత్ర పండదనే చెప్పొచ్చు. కోయల్ పాత్రధారిణి ఆపేక్ష ఆకట్టుకుంది. వీడియో టీమ్ హెడ్ గా అయాన్ జోయా కూడా షో అయ్యాక గుర్తుండిపోతుంది. వీళ్ళు కాకుండా ఇంకా చాలా పాత్రలు ఉన్నాయి కానీ హైలైట్ గా నిలిచింది మాత్రం పైన చెప్పినవాళ్ళే.

డైరెక్టర్ అండ్ టీమ్

దర్శకుడు ఆశిష్ ఆర్ శుక్లా తీసుకున్న కథలో మరీ కొత్తదనం లేకపోయినప్పటికీ దీన్ని ఇంటెన్స్ డ్రామాగా మార్చడంలో రచయిత సిద్దార్థ్ సేన్ గుప్తా సహకారం తీసుకుని చేసిన ప్రయత్నం మంచి ఫలితాన్ని ఇచ్చింది. ఎలాంటి ఉపోద్ఘాతాలు లేకుండా ఫస్ట్ ఎపిసోడ్ మొదలైన కాసేపటికె స్ట్రెయిట్ నెరేషన్ లోకి వెళ్లిపోయిన ఆశిష్ అన్ దేఖీని బెస్ట్ థ్రిల్లర్ గా మార్చడానికి కావాల్సిన వనరులన్నీ చక్కగా సమకూర్చుకున్నారు. ఒక హత్య చుట్టూ కథ తిరగడంలో కొత్త పాయింట్ ఏమి లేదు . చాలా సినిమాల్లో సిరీసులలో చూసిందే. అయితే ఆశిష్ తీసుకున్న నేపధ్యం, క్యారెక్టరైజేషన్స్ చాలా బాగా కుదిరాయి.

చిక్కుమడులను విప్పకుండా పైపెచ్చు దాన్ని ఇంకా టైట్ చేసేలా స్క్రీన్ ప్లే రాసుకోవడంతో అన్ దేఖీ ఎక్కడా టూ మచ్ ల్యాగ్ అనిపించదు. అక్కడక్కడా లాజిక్స్ ని వదిలేసిన తీరు ఎన్నో ప్రశ్నలను రేపుతుంది కాని కథనం పరుగులు పెట్టడంతో ఆ లోపం అంతగా హై లైట్ అవ్వలేదు. పోలీసు వ్యవస్థ రౌడీయిజానికి ;లొంగిపోతే దాన్ని డబ్బున్న కిరాతక కుటుంబాలు ఏ విధంగా దుర్వినియోగం చేస్తాయో ఇందులో చక్కగా చూపించారు. ఈ మధ్యే ఎన్ కౌంటర్ అయిన వికాస్ దుబే తరహాలోనే ఇందులో రింకు పాత్ర అనిపించడం కాకతాళీయం.

అనుజ్-శివం సంగీతం కథకు తగ్గ మూడ్ ని చక్కగా క్యారీ చేసింది. ఓవర్ సౌండ్ లేకుండా జాగ్రత్త పడి శబ్దకాలుష్యాన్ని తగ్గించారు. ముర్జీ పగిడివాలా ఛాయాగ్రహణం చాలా బాగుంది. ముఖ్యంగా మనాలి హిల్ స్టేషన్ అందాలలో ఇంత కోల్డ్ బ్లడెడ్ మర్డర్ మిస్టరీని చూపించిన తీరు ఫుల్ మార్క్స్ తెచ్చేసుకుంది. రాజేష్ పాండే ఎడిటింగ్ పర్వాలేదు. పెళ్లి కూతురు తేజీ ట్రాక్ ని కొంచెం ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. ప్రొడక్షన్ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. రియల్ లొకేషన్స్ తీసుకోవడంతో చాలా సహజమైన ఫీల్ వచ్చింది. ఇంత పెద్ద క్యాస్టింగ్ తో మనాలి లాంటి ఖరీదైన ప్రదేశంలో తీయడం అంటే బడ్జెట్ లెక్కలకు రెక్కలు వస్తాయి. అయినా లెక్క చేయకపోవడంతో వాళ్ళ అంచనాలకు తగ్గని అవుట్ పుట్ అయితే వచ్చింది

చివరి మాట

కనీసం అయిదు నుంచి ఏడెనిమిది గంటలు ఖర్చు పెడితేనే వెబ్ సిరీస్ లను ఆస్వాదించగలం. అలా సాధ్యం కాకపోతే ఎపిసోడ్ల వారిగా మన టైంకు తగ్గట్టు చూసే వెసులుబాటు ఎలాగూ ఉంటుంది. అన్ దేఖీ ఇలా టైంని తన కోసం ఖర్చు పెట్టిన వాళ్ళను నిరాశపరచకుండా సాగింది. మెయిన్ క్రైమ్ పాయింట్ పాతదే అయినప్పటికీ పాత్రల మధ్య అల్లుకున్న లింక్స్, ప్లాట్ ని ఆసక్తికరంగా ప్రెజెంట్ చేయడంలో టీం పడిన శ్రమ వల్ల సమయం వృధా అయ్యిందన్న ఫీలింగ్ కలగదు. ఒకటి రెండు బోల్డ్ సీన్స్, డబల్ మీనింగ్ డైలాగులు మినహాయిస్తే అన్ దేఖీ ఓవరాల్ గా డీసెంట్ వాచ్ గా నిలిచింది. తమ అవసరాల కోసం పరువు కోసం డబ్బనే అహంకారపు అస్త్రాన్ని సామాన్యులపై ప్రయోగించే వ్యవస్థలో రాజకీయ నాయకులు, పోలీసులు వాళ్ళకు అండగా నిలిస్తే న్యాయం ఎంత దూరంలో నిలిచిపోతుందో ఆసక్తికరంగా చెప్పేలా తీసిన అన్ దేఖీని నిస్సందేహంగా చూసేయోచ్చు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp