లాక్ డౌన్ రివ్యూ 61 - మిడిల్ క్లాస్ మెలోడీస్

By iDream Post Nov. 20, 2020, 01:34 am IST
లాక్ డౌన్ రివ్యూ 61 - మిడిల్ క్లాస్ మెలోడీస్

రౌడీ ట్యాగ్ ని ఒక బ్రాండ్ గా మార్చిన విజయ్ దేవరకొండ తమ్ముడిగా తెరంగేట్రం చేసిన ఆనంద్ దేవరకొండ మొదటి సినిమా దొరసాని నిరాశపరిచినా రెండో చిత్రం మిడిల్ క్లాస్ మెలోడీస్ మీద మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రమోషన్ లో తీసుకున్న శ్రద్ధతో పాటు టైటిల్ కనెక్ట్ అయ్యేలా ఉండటంతో ఫామిలీ ఆడియన్స్ కు దీని పట్ల ఆసక్తి నెలకొంది. ట్రైలర్ కూడా దానికి తగ్గట్టే అనిపించింది. థియేటర్లకు దగ్గర్లో అవకాశం లేకపోవడంతో అమెజాన్ ప్రైమ్ ద్వారా నేరుగా విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం

కథ

గుంటూరుకు దగ్గర ఉండే ఓ చిన్న ఊళ్ళో హోటల్ నడిపే కొండల్ రావు(గోపరాజు రమణ)మహా కోపిష్టి. ఒక్కగానొక్క కొడుకు రాఘవ(ఆనంద్ దేవరకొండ)బొంబాయి చట్నీని అద్భుతంగా చేస్తాడు. ఎలాగైనా పట్నం వెళ్లి అక్కడ గొప్ప పేరు తెచ్చుకోవాలని రాఘవ లక్ష్యం. మరదలి వరసయ్యే సంధ్య(వర్ష బొల్లమ)ను ప్రేమిస్తాడు. ఉన్న కొద్ది ఆస్తినమ్మి రాఘవతో హోటల్ పెట్టిస్తాడు కొండల్ రావు. కానీ అనుకున్నంత సులభంగా వ్యాపారం జరగదు. చాలా చికాకులు అడ్డంకులు ఎదురవుతాయి. మరోవైపు సంధ్యకు ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెడతారు. గోల్ ని ప్రేమని రెండింటిని రాఘవ ఎలా గెలుచుకున్నాడు అనేదే అసలు స్టోరీ

నటీనటులు

ఇందులో ప్రత్యేకంగా హీరో హీరోయిన్లంటూ ఎవరూ లేరు. ప్రతి పాత్రకు ప్రాధాన్యం దక్కింది. అయినా కూడా ఫోకస్ పాయింట్ ఆనంద్ కాబట్టి అతని గురించి చెప్పుకోవాలి. దొరసాని మిస్ ఫైర్ అయినా రెండో సినిమాకే ఇతనికి ఇలాంటి సబ్జెక్టు దొరకడం అదృష్టమనే చెప్పాలి. యాక్టింగ్ పరంగా బెస్ట్ అనిపించుకోవడానికి ఇంకా వేల మైళ్ళ దూరంలో ఉన్నప్పటికీ సాధ్యమైనంత వరకు తన బలహీనతలు కవర్ చేసుకుంటూ బాగానే చేశాడు. కొంచెం ఎమోషన్ ఎక్కువ డిమాండ్ చేసే సీన్స్ లో మాత్రం తేలిపోయినట్టు అనిపిస్తుంది. ఈ కోణంలో ఆనంద్ చేయాల్సిన హోమ్ వర్క్ చాలా ఉంది.

వర్ష బొల్లమలో సహజమైన అందంతో మెచ్చుకోదగిన నటన చాలా ఉంది. మిడిల్ క్లాస్ అమ్మాయిగా చక్కగా ఒదిగిపోయింది. ఆనంద్ కంటే తనే బెటర్ పెర్ఫార్మర్ అని చెప్పడానికి సంశయించనక్కర్లేదు. హీరోతో సమానంగా దాదాపుగా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ దాకా కనిపించే కోపిష్టి తండ్రిగా గోపరాజు రమణ మొదట్లో కొంచెం ఓవర్ చేసినట్టు కనిపించినా క్రమంగా కథ జరిగే కొద్ది తనే బెస్ట్ ఛాయస్ అనిపించాడు.

పరిశ్రమలో చాలా కాలం నుంచి ఉంటున్నా ఇలాంటి రోల్స్ అరుదుగా దొరినప్పుడు ఆర్టిస్టులు వాటితో ఎలా ఆడుకోవాలో నిరూపించారు రమణ. ఆనంద్ స్నేహితుడిగా నటించిన చైతన్య గరికపాటి న్యాచురల్ గా నటించాడు . ఇది అతనికి ఖచ్చితంగా బ్రేక్ ఇస్తుంది. ప్రేమ్ సాగర్, దివ్యశ్రీపాద, ప్రభావతి వర్మ, సురభి ప్రభావతి, చాణక్య తేజస్, నాని రెడ్డి తదితరుల్లో అధిక శాతం కొత్త ఆర్టిస్టులు ఉన్నప్పటికీ అత్యంత సహజంగా అలవోకగా చేసుకుంటూ పోయి దర్శకుడి భారం తగ్గించారు. తరుణ్ భాస్కర్ జస్ట్ కొన్ని నిమిషాలకే పరిమితం అయ్యాడు.

డైరెక్టర్ అండ్ టీం

ఎంతసేపు లీడ్ క్యారెక్టర్ ని బేవార్స్ గానో లేదా మల్టీ మిలియనీర్ గానో చూసి స్టార్ హీరోల వల్ల ఒక రకమైన మొనాటనీ వచ్చేసిన తెలుగు తెరకు ఇప్పటి తరం దర్శకులు చేస్తున్న ఆలోచనలు కొత్త ఊపిరినిస్తున్నాయి. ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే నేల విడిచి సాము చేయనక్కర్లేదు, వాళ్ళ నిజ జీవితంలో చుట్టూ జరిగే కథలనే జనరంజకంగా చెబితే ఖచ్చితంగా ఆదరిస్తారని శేఖర్ కమ్ముల, తరుణ్ భాస్కర్ లాంటి వాళ్ళు పలుమార్లు ఋజువు చేశారు. మిడిల్ క్లాస్ మెలోడీస్ లో వినోద్ చేసింది కూడా అదే. సింపుల్ కామెడీ, క్లీన్ ఎమోషన్స్ తో మాడర్న్ కంటెంట్ పేరుతో అవసరానికి మించి బోల్డ్ నెస్ తో సినిమాలు తీసేవారికి ఒక చెంపపెట్టుగా దీన్ని తీర్చిదిద్దాడు.

ఇందులో అసాధారణమైన కథేమీ లేదు. ఒక మధ్యతరగతి కుర్రాడు హోటల్ పెట్టుకుని తనను తాను రుజువు చేసుకునే క్రమంలో ఎదురయ్యే సంఘటనల సమాహారమే మిడిల్ క్లాస్ మెలోడీస్. ఈ చిన్న పాయింట్ ని ఎంటర్ టైనింగ్ గా తీర్చిదిద్ది ఇదంతా మన పక్కింట్లోనే జరుగుతున్నంత సహజంగా చిత్రీకరించిన తీరు ఆకట్టుకుంది. ఏదీ ఓవర్ ది బోర్డ్ అనిపించకుండా వినోద్ సన్నివేశాలను అల్లుకున్న తీరు మెప్పిస్తుంది. ఉదాహరణకు రాఘవ, కొండల్ రావు రిజిస్టర్ ఆఫీసర్ కు వెళ్లే సీన్ ని చిన్నపాటి థ్రిల్లర్ ఎపిసోడ్ తరహాలో వినోద్ రాసుకున్న విధానాన్ని మెచ్చుకుని తీరాల్సిందే.

అలా అని ఇందులో ఎంచడానికి లోపాలేమి లేవా అంటే ఉన్నాయి. తలలు పండిన దిగ్గజ దర్శకులతో మొదలుకుని అందరి సినిమాల్లోనూ ఇవి ఉంటాయి. కాకపోతే వాటిని ఎంత తెలివిగా వినోదం చాటున దాచి పెట్టాం అన్నదే సక్సెస్ ని నిర్దేశిస్తుంది. వినోద్ విజయం సాధించింది ఇక్కడే. చివరి ఇరవై నిముషాలు కొంత హడావిడిగా పరిగెత్తించినట్టు అనిపించినా మొత్తం అయిపోయాక ఇంత కన్నా బెటర్ గా ఎలా చేయొచ్చనే ఆలోచన పెద్దగా మెదడులోకి రాకుండా ఇతను తీసుకున్న శ్రద్ధ మంచి ఫలితాన్ని ఇచ్చింది. సున్నితమైన భావోద్వేగాలను సాగతీత సన్నివేశాలు, స్లో మోషన్ షాట్స్, ఆర్టిస్టుల క్లోజప్ లు లాంటి పడికట్టు సూత్రాల ద్వారా చెప్పాలనే పడికట్టు సూత్రాన్ని వినోద్ తేలికగా బ్రేక్ చేశాడు. క్యాస్టింగ్ విషయంలో తీసుకున్న శ్రద్ధ వల్ల నటీనటులు ఫ్రెష్ గా అనిపించి డిఫరెంట్ ఫీల్ కలుగుతుంది.

స్వీకర్ అగస్తి పాటలు సందర్భానికి తగ్గట్టు చక్కగా సింక్ అయ్యాయి. వినగా వినగా ఓ రెండు రిపీట్ మోడ్ కు ఛాన్స్ ఇస్తాయి. ఇంతే స్థాయిలో ఆర్ హెచ్ విక్రమ్ కంపోజ్ చేసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మిడిల్ క్లాస్ మెలోడీస్ కి అద్భుతంగా కుదిరింది. డైరెక్టర్ కోరుకున్న ఫీల్ ని ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా చేయడంలో ఇతని పాత్ర చాలా ప్రత్యేమైనది. సన్నీ కుర్రపాటి ఛాయాగ్రహణం గుంటూరు అందాలని, అరమరికలు లేని అక్కడ వాతావరణాన్ని చక్కగా బంధించింది. రవితేజ గిరజాల ఎడిటింగ్ గురించి కంప్లయింట్ చేయడానికి ఏమి లేదు. భవ్య క్రియేషన్స్ నిర్మాణ విలువలకు రిస్క్ లేకుండా వినోద్ చాలా తక్కువ బడ్జెట్ లో మంచి క్వాలిటీ ఇచ్చాడు.

ప్లస్ గా అనిపించేవి

సహజమైన పాత్రలు, వాటి నటన
సంగీతం
ఛాయాగ్రహణం
సున్నితమైన వినోదం
క్లీన్ ఎమోషన్స్

మైనస్ గా తోచేవి

చివర్లో కొంత హడావిడి
అక్కడక్కడా రెండు మూడు బూతుపదాలు

చివరి మాట

ఎనిమిది నెలల కాలంలో ఓటిటిలో డైరెక్ట్ గా విడుదలైన సినిమాల్లో అందరిని మెప్పించినవిగా ఒకటో రెండో మాత్రమే నిలిచాయి. ఆశ్చర్యకరంగా పెద్ద అంచనాలు లేకుండా రిలీజైన మిడిల్ క్లాస్ మెలోడీస్ వాటి సరసన స్థానం సంపాదించుకునే కంటెంట్ తో వచ్చి స్వీట్ షాక్ ఇచ్చింది. కమర్షియల్ ఫార్ములా, స్టీరియోటైప్ క్యారెక్టరైజేషన్స్ కు స్వస్తి చెబుతూ కొత్త దర్శకుడు వినోద్ చేసిన ప్రయత్నం కాసేపు నవ్వించింది, ఆ తర్వాత ఆలోచింపజేసింది, పాత్రలతో సమాంతరంగా ప్రయాణం చేయించింది, ఫైనల్ గా చెప్పాలంటే డీసెంట్ ఎంటర్ టైన్మెంట్ తో చెవులకు, కనులకు వినువిందైన మెలోడీస్ ని అందించింది

మిడిల్ క్లాస్ మెలోడీస్ - మెప్పించే మధ్యతరగతి వినోదం

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp