లాక్ డౌన్ రివ్యూ 35 - కామెడీ పండ‌ని లూట్ కేస్

By G.R Maharshi Aug. 01, 2020, 03:39 pm IST
లాక్ డౌన్ రివ్యూ 35 - కామెడీ పండ‌ని లూట్ కేస్

డ‌బ్బు కోసం ఇబ్బంది ప‌డే సామాన్యుడికి హ‌ఠాత్తుగా కోట్ల రూపాయలు దొరికితే? ఆ డ‌బ్బు కూడా క్రైం డ‌బ్బులైతే? ఏం జ‌రుగుతుంద‌నేదే లూట్‌కేస్ సినిమా. వ‌ద్దంటే డ‌బ్బు, అరుణాచ‌లం సినిమాల్లో హ‌ఠాత్తుగా ఆస్తి వ‌చ్చిప‌డి , దాన్ని ఎలా ఖ‌ర్చు పెట్టాల‌నేది స‌మ‌స్య‌. దీంట్లో ప‌ది కోట్ల సూట్‌కేస్ 30 ఏళ్ల కాంప్లెక్స్‌లో ఒక చిన్న ఇంట్లో నివ‌సించేవాడికి దొరుకుతుంది. ఆ డ‌బ్బు కోసం ఒక రాజ‌కీయ నాయ‌కుడి గూండాలు, పోలీసు అధికారి వెతుకుతూ ఉంటారు. క్రైం కామెడీకి ఈ మాత్రం లైన్ ఉంటే చాలు. ఈ మ‌ధ్య అనురాగ్‌క‌శ్య‌ప్ తీసిన ఛోక్‌డ్ (CHOKED) క‌థ కూడా ఇదే. దాంట్లో డ్రైనేజీలో డ‌బ్బులు దొరుకుతాయి. దీంట్లో సూట్‌కేస్ దొరుకుతుంది. అంతే తేడా.

ప్ర‌తి వాడికి హ‌ఠాత్తుగా డ‌బ్బు దొరికి క‌ష్టాలు మాయ‌మైతే బాగుంటుంద‌నే ఉంటుంది. కానీ దొర‌కాలిగా? దీంట్లో నంద‌న్‌కుమార్‌కి (కునాల్ కెమూ) దొరుకుతుంది. ఒక ప్రింటింగ్ ప్రెస్‌లో అర్ధ‌రాత్రి డ్యూటీలు చేస్తాడు. 30 కుటుంబాల మ‌ధ్య చిన్న ఇంట్లో ఉంటాడు. రెంట్ కూడా క‌రెక్ట్‌గా ఇవ్వ‌లేడు. అతిథుల‌కి టీ ఇవ్వాలంటే ఒక్కోసారి చ‌క్కెర కూడా ఉండ‌దు. సిమ్లా టూర్ వెళ్లాల‌ని పెళ్లైన‌ప్ప‌టి నుంచి అనుకుంటూ ఉన్నా కొడుక్కి ప‌దేళ్ల వ‌య‌సు వ‌చ్చినా కుద‌ర్లేదు.

ఇత‌నికి ఒక అర్ధ‌రాత్రి ప‌ది కోట్ల సూట్‌కేస్ దొరుకుతుంది. దాన్ని ఎలాగో ఆటోలో ఇంటికి తీసుకెళ్తాడు. ఆటో డ్రైవ‌ర్‌కి త‌న అడ్ర‌స్ తెలియ‌కుండా జాగ్ర‌త ప‌డ‌తాడు. ఇంట్లో పెడితే భార్య‌కు అనుమానం వ‌స్తుంది. ప‌క్కింటాయ‌న ఊరెళ్లాడు. ఆ ఇంటి తాళాలు త‌న ద‌గ్గ‌రే ఉన్నాయి. అక్క‌డ పెడ‌తాడు. త‌ర్వాత డ‌బ్బునేం చేయాలి? ఎలా ఖ‌ర్చు పెట్టాలి?

ఇక్క‌డి వ‌ర‌కు క‌థ OK. ఆ త‌ర్వాత అనేక సంఘ‌ట‌న‌ల‌తో ప‌రుగెత్తాల్సిన క‌థ‌, ఉన్న చోటే చ‌తిక‌ల‌ప‌డుతుంది. త‌క్కువ బ‌డ్జెట్ వ‌ల‌నో, తొంద‌ర‌గా చుట్టేయ‌డ‌మో కార‌ణం తెలియ‌దు కానీ, నాలుగు గోడ‌ల మ‌ధ్య క‌థ ఇరుక్కుపోయి టీవీ సీరియ‌ల్‌లా న‌డుస్తుంది.

అంత డ‌బ్బు దొరికితే , భార్య‌కు ఎలాగో న‌చ్చ‌చెప్ప‌డ‌మో, క‌న్నుగ‌ప్ప‌డ‌మో చేస్తాడు కానీ, ప‌క్కింటి వాడి ఇంట్లో ఎవ‌డూ పెట్ట‌డు. నోట్లు త‌డిచి పోతే డ్ర‌య‌ర్ వాడి ఎండ‌పెడ‌తాడు కానీ, వ‌డియాల లాగా డాబా పైన ఎవ‌డూ పెట్ట‌డు. అది కూడా అన్ని కుటుంబాలు ఉన్న చోట‌.

లాజిక్‌తో సంబంధం లేని విష‌యాల వ‌ల్ల ఉత్కంఠ పోయింది. దీనికి తోడు ఈ డ‌బ్బు కోసం వెతికే వాళ్లు కూడా ఉత్సాహంగా ఉండ‌రు. సినిమా ఇంకా చాలా ఉంది క‌దా అన్న‌ట్టు సోమ‌రిగా ఉంటారు. చివ‌రి 15 నిమిషాలు క్లైమాక్స్ కాస్త బాగుంది.

థియేట‌ర్ల‌లో ప‌నికిరాని చెత్త‌ని OTTలో వ‌దులుతున్నారు. ఖాళీగా ఉన్నాం, డ‌బ్బులు అవ‌స‌రం లేదు క‌దా అని మ‌నం చూసేస్తున్నాం. అందుకే సినిమాకి త‌క్కువ‌, సీరియ‌ల్‌కి ఎక్కువ అన్న‌ట్టు వ‌స్తున్నాయి. కామెడీని కూడా సీరియ‌స్‌గా తీసుకోక‌పోతే పండ‌దు.

హీరోయిన్ ర‌సికా దుగ్గ‌ల్ అద్భుతమైన న‌టి. కానీ ఈ సినిమాలో స్కోప్‌లేదు. నిజానికి ఇలా డ‌బ్బు దొరికితే ప‌డే ఇబ్బందులు, టెన్ష‌న్ క‌థాంశంతో చాలా వ‌చ్చాయి. చూసిన సీన్లే మ‌ళ్లీ చూపిస్తే ఇలా లూట్‌కేస్‌లా త‌యార‌వుతుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp