లాక్ డౌన్ రివ్యూ 40 - భార్య కోసం యుద్ధం

By iDream Post Aug. 14, 2020, 10:15 pm IST
లాక్ డౌన్ రివ్యూ 40 - భార్య కోసం యుద్ధం

బాలీవుడ్ ప్రేక్షకులు వరసగా డైరెక్ట్ ఓటిటి రిలీజులతో పండగ చేసుకుంటున్నారు. ఎక్కడికి కదలనవసరం లేకుండా ఇంట్లోనే కూర్చుని తాపీగా కొత్త సినిమాలు చూసే సౌలభ్యానికి భేషుగ్గా అలవాటు పడిపోతున్నారు. దానికి తగ్గట్టే డిజిటల్ సంస్థలు పోటీపడి మరీ హక్కుల కోసం కోట్లాది రూపాయలను మంచి నీళ్లలా ఖర్చు పెట్టి హక్కులు కొంటున్నాయి. ఇప్పటికే చెప్పుకోదగ్గ స్థాయిలో చిత్రాలు వచ్చేశాయి కూడా. తాజాగా వచ్చిన మూవీ ఖుదా హఫీజ్. తుపాకీ, సికందర్ ద్వారా మనకూ పరిచయమున్న విద్యుత్ జమాల్ హీరోగా రూపొందిన ఈ సెర్చింగ్ థ్రిల్లర్ మీద ట్రైలర్ వచ్చాక అంచనాలు పెరిగాయి. మరి వాటికి తగ్గట్టు ఖుదా హఫీజ్ ఉందో లేదో రివ్యూలో చూద్దాం

కథ

సమీర్ చౌదరి(విద్యుత్ జమాల్)2008లో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం వల్ల తన సాఫ్ట్ వేర్ సర్వీస్ షాప్ ని మూసేస్తాడు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇష్టం లేకపోయినా మంచి అవకాశం రావడంతో ప్రాణంగా ప్రేమించే భార్య నర్గిస్(శివలీల ఒబెరాయ్)ను తనకన్నాముందే జాబ్ కోసం ఒంటరిగా నోమన్ దేశానికి పంపిస్తాడు. మరుసటిరోజే సమీర్ కు నర్గిస్ నుంచి ఫోన్ వస్తుంది. ఆమె తీవ్రమైన ప్రమాదంలో ఇరుక్కున్నట్టు తెలుసుకుంటాడు. వెంటనే నోమన్ వెళ్తాడు.

అక్కడ పరిచయమైన ట్యాక్సి డ్రైవర్ ఉస్మాన్ అలీ మురాద్(అన్నూ కపూర్)సహాయంతో వేట మొదలుపెడతాడు. కానీ తాను ఊహించినదాని కన్నా పెద్ద ఉచ్చులో నర్గిస్ ఉన్నట్టు అర్థమవుతుంది. తెగించి మరీ పద్మవ్యూహాన్ని చేధిస్తాడు. మరి తన గమ్యాన్ని ఎలా చేరుకున్నాడు, నర్గిస్ ఎవరి కబంధహస్తాల్లో చిక్కుకుంది తదితర ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటులు

విద్యుత్ జమాల్ లో మంచి నటుడున్నాడని రెగ్యులర్ హిందీ సినిమాలు చూసేవాళ్ళు ఎవరైనా ఒప్పుకుంటారు. మనం విలన్ గానే చూసాం కానీ కమాండో లాంటి మూవీస్ తో తాను సోలో హీరోగానూ మెప్పించగలనని గతంలోనే ఋజువు చేసుకున్నాడు. ఒకరకమైన ఇంటెన్సిటీ ఇతని మొహంలో కనిపిస్తూ ఉంటుంది. రామ్ కామ్ ప్రేమకథలకు తను సూట్ కాడు. ఇధి గుర్తించే దర్శకులు జమాల్ ను సీరియస్ కథల్లోనే చూపిస్తున్నారు. ఖుదా హఫీజ్ కూడా అదే కోవలోకి వస్తుంది. ఎక్కడో దూరంగా విదేశాల్లో ప్రమాదంలో చిక్కుకున్న భార్యను కాపాడుకునేందుకు తపించే భర్తగా జమాల్ తనకిచ్చిన సమీర్ చౌదరి పాత్రలో పరకాయప్రవేశం చేసేశాడు. సరైన యాక్షన్ డ్రామాలు కనక పడితే తను ఖచ్చితంగా పెద్ద రేంజ్ కు వెళ్లగలడు. కానీ ఇది దానికి మెట్టుగా నిలవలేకపోయింది

హీరోయిన్ శివలీలా ఒబెరాయ్ అచ్చమైన ముస్లింగా నర్గిస్ పాత్రలో బాగుంది. గ్లామరస్ రోల్ కాకపోవడంతో ఎలాంటి స్కిన్ షోకు ఛాన్స్ లేదు. ఉన్నంతలో డీసెంట్ గానే నెట్టుకొచ్చింది. కొన్ని కీలకమైన సన్నివేశాలలో అనుభవలేమి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. లుక్స్ పరంగా మాత్రం ఆకట్టుకునే రూపం తనది.నటుడిగా దశాబ్దాల అనుభవం ఉన్న అన్నూ కపూర్ చాలా కాలం తర్వాత బాగా గుర్తుండిపోయే తన స్థాయికి తగ్గ పాత్రలో చెలరేగిపోయారు. హీరోతో చాలా సేపు జర్నీ చేసే విధంగా డిజైన్ చేయడంతో స్క్రీన్ స్పేస్ దొరికింది. మిగిలిన యాక్టర్స్ లో విపిన్ శర్మ, శివ్ పండిట్, అహనా కుమ్రా ఓకే అనిపించేశారు.

డైరెక్టర్ అండ్ టీమ్

ఆ మధ్య టైగర్ ష్రాఫ్ హీరోగా భాగీ 3 వచ్చింది. అందులో ఫారిన్ కు వెళ్లిన అన్నయ్య ప్రమాదంలో ఉన్నాడని తెలిసి హీరో ప్రాణాలకు తెగించి అక్కడ నానా అరాచకం చేసి సోదరుడిని తెచ్చుకుంటాడు. బాగా ఓవర్ మసాలా వేసి దట్టించి తీయడం వల్ల మాస్ బాగానే ఆదరించారు. ఇంతా చేసి ఇది మన తడాఖా(తమిళ్ వెట్టై)రీమేకే. దీని సంగతలా ఉంచితే ఖుదా హఫీజ్ లోనూ ఇంచుమించు ఇదే పాయింట్ ఉంది. కాకపోతే అన్నయ్య స్థానంలో ఇందులో కథానాయకుడికి భార్య ఉంటుంది. పోలిక విషయంలో చూసుకుంటే ఇదొక్కటేనా అంటే ఇంకా చాలా అంశాల్లో ట్రీట్మెంట్ ఒకటే అనిపిస్తుంది.

దర్శకుడు ఫరూక్ కబీర్ తీసుకున్న కథలో ఎలాంటి కొత్తదనం లేదు. ఫస్ట్ హాఫ్ లో ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఒక పాట పూర్తి కాగానే అసలు స్టోరీలో వెళ్ళిపోయినప్పటికీ చేతిలో సరైన మెటీరియల్ లేక ఏదో ట్విస్టులతో నెట్టుకొద్దామనే ప్రయత్నం గట్టిగానే చేశాడు. నోమన్ వాతావరణాన్ని అద్భుతంగా చిత్రీకరించిన ఇతను అందులో సగం శ్రద్ధ కథనం మీద పెట్టి ఉంటే ఇంకా బాగుండేది. స్క్రీన్ ప్లే ఎక్కడా ఊహాతీతంగా సాగదు. దేశంకానీ దేశంలో అక్కడి పరిస్థితులు, మనుషులు అన్నీ హీరోకు అనుకూలంగా మారిపోవడం లాజిక్ కు దూరంగా నిలుస్తుంది.

ఒకదశకు వెళ్ళాక అంత పెద్ద అరబ్ దేశంలో మరీ బుర్ర లేని పోలీసులు ఉంటారా అనే స్థాయిలో చూపించారంటేనే అర్థం చేసుకోవచ్చు ఫరూక్ కబీర్ ఎన్ని పొరపాట్లు చేశారో. సమీర్ వెతుకులాట మొదలుపెట్టాక సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ మూమెంట్స్ ఆశిస్తాం. కానీ దానికి భిన్నంగా ఒకటి రెండు తప్ప ఈజీగా గెస్ చేయగలిగిగే సిల్లీ పాయింట్స్ తో ఎటుబడితే అటు తీసుకెళ్లిపోయాడు . ప్రీ క్లైమాక్స్ ముందు చేతులెత్తేసి ఏదో హడావిడిగా ముగించడంతో ఉన్న కొత్త ఇంప్రెషన్ కూడా పోతుంది. కాకపోతే యక్షన్ ఎపిసోడ్స్ ని డీల్ చేసిన విషయంలో ఫరూక్ కబీర్ పనితనం గొప్పగా ఉంది .

మిథున్ పాటలు సోసోనే. అవి లేకపోయినా నష్టం లేకపోయేది కానీ ఉన్న రెండు మూడు కూడా ఏదో ఇరికించినట్టే ఉన్నాయి. నేనేం తక్కువ తిన్నానా అనేలా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన అమీర్ మొహిలే సైతం యావరేజ్ అనిపించుకున్నాడు. చాలా సార్లు విన్నట్టే కలిగే ఫీలింగ్ తో ఎక్కడా ప్రత్యేకత చూపించలేకపోయాడు. జితన్ హర్మీత్ సింగ్ ఛాయాగ్రహణం మాత్రం ది బెస్ట్ అనిపించేలా సాగింది. నోమన్ దేశాన్ని తన కెమెరా కన్నుతో అద్భుతంగా చూపించాడు. ఖుదా హఫీజ్ చూడడానికి ఒకే ఒక్క కారణం ఉందంటే అది ఇతనే. నిర్మాతలు మాత్రం హీరో ఇమేజ్ కి పదింతలు బడ్జెట్ తో చాలా భారీగా ఖర్చు పెట్టారు. ఏదో సల్మాన్ ఖాన్ రేంజ్ విజువల్ ఫీస్ట్ ని ఇందులో చూపించారు. వాళ్ళను మెచ్చుకోవచ్చు

ప్లస్ గా అనిపించేవి

అద్భుతమైన నోమన్ లొకేషన్స్
కెమెరా వర్క్
విద్యుత్ జమాల్
అన్నూ కపూర్
రిచ్ ప్రొడక్షన్

మైనస్ గా తోచేవి

చప్పగా సాగే ట్విస్టులు
హీరోయిన్
మ్యూజిక్
బిగుతుగా లేని స్క్రీన్ ప్లే
ఇంకా చాలానే ఉన్నాయి

కంక్లూజన్

ట్రైలర్ చూసి ఖుదా హఫీజ్ ని ఓ గొప్ప సెర్చింగ్ థ్రిల్లర్ గా ఊహించుకుంటే మాత్రం అంతకు మూడింతలు నిరాశ చెందటం ఖాయం. ట్విస్టులు, గ్రాండ్ ప్రొడక్షన్ ఉంటే చాలు కథ ఎలా నడిపినా పర్వాలేదు అనుకునే దర్శకుడి ఆలోచనలు ఇలాంటి అవుట్ ఫుట్ నే ఇస్తాయి. కాకపోతే థియేటర్లలో చూసే భాగ్యం తప్పింది కాబట్టి మరీ ఎక్కువ తిట్టుకునే అవసరం తప్పింది. ఓ రెండున్నర గంటల సమయాన్ని నోమన్ దేశం(కొన్ని అందాలు), భారీ యాక్షన్ చేజులు చూడడానికి ఫిక్స్ అయితే మాత్రం ఖుదా హఫీజ్ ని నిరభ్యంతరంగా ట్రై చేయొచ్చు. అంతకు మించి ఘాజీలాగానో భాగీలాగానూ ఊహించుకుంటే మాత్రం నిట్టూర్పు తప్పదు.

ఖుదా హఫీజ్ - ఖరీదైన వృథా ప్రయత్నం

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp