లాక్ డౌన్ రివ్యూ 7 - పోరాటమే జీవితం

By iDream Post Apr. 28, 2020, 12:15 pm IST
లాక్ డౌన్ రివ్యూ 7 - పోరాటమే జీవితం

కరోనా పుణ్యమాని జనం ఇళ్లకే పరిమితమైన సమయంలో డిజిటల్ సంస్థలు ఈ అవకాశాన్ని ఎంత వాడుకోవాలో అంతకంటే ఎక్కువే సద్వినియోగపరుచుకుంటూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు అందిస్తున్నాయి. గతంలో ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ మధ్యే తీవ్రంగా ఉన్న పోటీ ఇప్పుడు మిగిలిన ప్లేయర్స్ కు సైతం పాకింది. వెబ్ మూవీస్ విషయంలో అందరికంటే ఒక అడుగు ముందుండే నెట్ ఫ్లిక్స్ తాజాగా విడుదల చేసిన ఎక్స్ ట్రాక్షన్ (EXTRACTION) మీద ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. మరి వాటిని అందుకునేలా ఈ రెండు గంటల సినిమా సాగిందో లేదో రివ్యూలో చూద్దాం

కథ

ముంబై జైలులో శిక్ష అనుభవిస్తూ ఉంటాడు డాన్ గా చెలామణి అయిన మహాజన్ (పంకజ్ త్రిపాఠి). అతని ఇంటితో పాటు వ్యాపార వ్యవహారాలు చూసుకునే వ్యక్తి మాజీ స్పెషల్ ఫోర్స్ అధికారి పారా(రణదీప్ హుడా). స్కూల్ లో చదువుతున్న మహాజన్ కొడుకు ఓవి(రుద్రాక్ష్ జైస్వాల్)ఓసారి పబ్ లో కిడ్నాప్ కు గురవుతాడు. అది చేసింది బాంగ్లాదేశ్ కు చెందిన మరో డాన్ అమిర్ అసిఫ్(ప్రియాంశు) అని తెలుస్తుంది. ఓవిని డాకా నగరంలో దాచారని సమాచారం వస్తుంది. ఓవిని విడిపించడం కోసం ఆస్ట్రేలియాలో ఉన్న కాంట్రాక్టు కిల్లర్ టైలర్(క్రిస్ హెమ్స్ వర్త్)సహాయం కోరుతుంది మహాజన్ ముఠా. దాంతో అక్కడికి ఒంటరిగా వెళ్తాడు టైలర్. మరి అడుగడుగునా ప్రమాదం పొంచి ఉండే ఈ మిషన్ ని అతను ఎలా పూర్తి చేశాడన్నదే ఎక్స్ ట్రాక్షన్ అసలు స్టోరీ

నటీనటులు

ఇదంతా క్రిస్ హెమ్స్ వర్త్ వన్ మ్యాన్ షో. ఇంట్రో సీన్ తోనే అతని పాత్ర మొదలైపోతుంది. ఎంతటి ప్రమాదమైనా లెక్క చేయని వాడిగా మంచి టెంపో చూపించాడు. ఎమోషనల్ గా చిన్న ఫ్లాష్ బ్యాక్ పెట్టడంతో యాక్షన్ పార్ట్ పరంగానే కాకుండా భావోద్వేగాల విషయంలోనూ మెప్పిస్తాడు. ఇతనితో సమానంగా ట్రావెల్ చేసే ఓవి రోల్ లో చైల్డ్ ఆర్టిస్ట్ రుద్రాక్ష్ బాగానే చేశాడు. అనుక్షణంతో భయంతో నటించే ఎక్స్ ప్రెషన్లు చక్కగా పలికించాడు. మనకు పరిచయమున్న రణదీప్ హుడా కూడా గుర్తుండిపోతాడు. పంకజ్ త్రిపాఠి లాంటి సీనియర్ నటుడు కేవలం ఒక్క సీన్ కే పరిమితం కావడం నిరాశ కలిగిస్తుంది. బంగ్లాదేశ్ డాన్ గా చేసిన ప్రియాన్షు అంత ఇంటెన్సిటీని చూపలేకపోయాడు. ఇక ఆర్టిస్టులు చాలానే ఉన్నారు కాని వీళ్ళే కీలకం

డైరెక్టర్ అండ్ టీం

దర్శకుడు సాం హార్గ్రేవ్ తీసుకున్న పాయింట్ చాలా చిన్నది. వేరే దేశంలో ఉన్న ఒక డాన్ కొడుకుని విడిపించుకుని తీసుకుని రావడం అనే పాయింట్ ఆసక్తి రేపేదే అయినా దానికి తగ్గట్టు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే కాని సంఘటనలు కాని ఇందులో పెద్దగా కనిపించవు. యాక్షన్ ఎపిసోడ్స్ మీద పెట్టిన శ్రద్ధ ట్విస్టుల మీద పెట్టకపోవడంతో సినిమా ఒకే టెంపోలో సాగుతూ మరీ ఎగ్జైటింగ్ గా అనిపించదు. క్రిస్ ఫ్యాన్స్ కు నచ్చవచ్చేమో కాని స్టాండర్డ్స్ తో పాటు కథ విషయంలోనూ ఎక్కువ ఆశించే ప్రేక్షకులకు ఎక్స్ ట్రాక్షన్ లో అట్రాక్షన్ తక్కువే అనిపిస్తుంది.

కాకపోతే బంగ్లాదేశ్ లోని డాకా నగరం వాతావరణాన్ని అత్యంత సహజంగా చిత్రీకరించిన తీరు, కొన్ని అద్భుతమైన పోరాట సన్నివేశాలు ఇలాంటి సినిమాలను ఇష్టపడే వాళ్ళను మెప్పిస్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ని చిత్రీకరించిన తీరు బాగుంది. న్యూటన్ థామస్ సీగల్ ఛాయాగ్రహణం అత్యున్నత స్థాయిలో ఉంది. థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో చక్కని అవుట్ పుట్ ఇచ్చాడు. హెన్రీ అలెక్స్ ల సంగీతం కూడా థీమ్ కు తగ్గట్టే సాగింది. మరీ ప్రత్యేకంగా అయితే లేదు. నిర్మాణం మాత్రం చాలా రిచ్ గా ఉంది. ఆర్ట్ డిపార్టుమెంటు దగ్గర నుంచి ప్రొడక్షన్ ఎగ్జిక్యుటివ్స్ వరకు అందరు మెచ్చుకోలుకు అర్హులే

చివరిగా చెప్పాలంటే

విపరీతమైన యాక్షన్ ఎపిసోడ్స్, భీభత్సమైన వయోలెన్స్ ఇష్టపడే మూవీ లవర్స్ ని ఎక్స్ ట్రాక్షన్ నిరాశపరిచే అవకాశాలు తక్కువే. అయితే ఏదో ఆశించి ఏదేదో ఊహించి ఇదో గొప్ప థ్రిల్లర్ లా ఉంటుందని మొదలుపెడితే మాత్రం చివరికి నిట్టూర్పు తప్పదు. వెబ్ మూవీస్ లోనూ సినిమాకు ఏ మాత్రం తీసిపోని క్వాలిటీతో మెప్పిస్తున్న నిర్మాతలను, ఇలాంటి కంటెంట్ అందిస్తున్న నెట్ ఫ్లిక్స్ ని మాత్రం మెచ్చుకోవాల్సిందే. తమ వీడియోలకు ఎందుకు అంత ఖరీదును డిమాండ్ చేస్తామో ఎప్పటికప్పుడు ఇలాంటి కంటెంట్ ద్వారా నెట్ ఫ్లిక్స్ నిరూపిస్తూనే ఉంది. లాక్ డౌన్ టైం పాస్ కు తక్కువ అంచనాలతో ఎక్స్ ట్రాక్షన్ ను ట్రై చేయొచ్చు

ఫైనల్ వర్డ్ : యాక్షన్ లవర్స్ కు మాత్రమే

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp