లాక్ డౌన్ రివ్యూ 63 - అనగనగా ఓ అతిథి

By iDream Post Nov. 21, 2020, 12:01 pm IST
లాక్ డౌన్ రివ్యూ 63 -  అనగనగా ఓ అతిథి

ఇటీవలి కాలంలో వెబ్ సిరీస్, డైరెక్ట్ రిలీజ్ లతో దూకుడు పెంచిన ఆహా యాప్ నిన్న సాయంత్రం విడుదల చేసిన కొత్త ఇండిపెండెంట్ మూవీ అనగనగా ఓ అతిథి. ఆరెక్స్ 100తో పరిచయమై యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న పాయల్ రాజ్ పూత్ మళ్ళీ ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. అందుకే క్యాస్టింగ్ తో సంబంధం లేకుండా కంటెంట్ మీద ఎక్కువ దృష్టి పెట్టి కథలను ఎంచుకుంటోంది. అసలు హీరోనే లేని ఈ చిత్రం మీద ప్రత్యేక శ్రద్ధ చూపించింది. కేవలం గంటన్నర నిడివితో రూపొందిన ఈ విలేజ్ థ్రిల్లర్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం

కథ

ఇది 1980లో గోదావరి జిల్లాలో జరిగిన యధార్థ సంఘటనగా టైటిల్ కార్డులో వేశారు కానీ కన్నడ రీమేక్ అన్న విషయాన్ని ప్రస్తావించలేదు. ఎక్కడో చిన్న పల్లెటూరికి ఆరేడు మైళ్ళ దూరంలో ఊరవతల ఉండే పేద కుటుంబం మల్లి(పాయల్ రాజ్ పుత్)ది. అప్పులు చేసిన తాగుబోతు తండ్రి(ఆనంద్ చక్రపాణి), పురుళ్ళు పొసే మంత్రసాని తల్లి(వీణా సుందర్)తో నెట్టుకొస్తూ ఉంటుంది. ఓరోజు వీళ్ళింటికి చిన్నికృష్ణ అలియాస్ శీను(చైతన్య కృష్ణ) వస్తాడు. సంచారినని ఓ రాత్రికి ఆశ్రయం ఇమ్మని కోరతాడు. వీళ్ళు సరేనంటారు. అయితే శీను దగ్గర చాలా డబ్బు, నగలు ఉన్నాయని గుర్తించిన మల్లికి దురాశ కలుగుతుంది. అక్కడి నుంచి ఎవరూ ఊహించని మలుపులకు ఆ ఇల్లు వేదికవుతుంది. అదేంటనేది బుల్లితెర మీదే చూడాలి

నటీనటులు

మల్లిగా పాయల్ రాజ్ పుత్ తనకు ఇచ్చిన బాధ్యతను చక్కగా నెరవేర్చింది. పేదరికంతో సతమతమవుతూ డబ్బు కోసం కలలు కంటూ ఎంతకైనా తెగించే పాత్రలో బాగానే చేసింది. కొన్ని సన్నివేశాల్లో మేకప్ వల్ల తన లుక్, స్కిన్ టోన్ బీదపిల్లగా అనిపించకుండా ఇబ్బంది పెట్టినా ఓవరాల్ గా తన ఇమేజ్ వల్ల ఇలాంటి బడ్జెట్ మూవీకి వెయిట్ అయితే పెరిగింది. రూపం, టాలెంట్ రెండూ ఉన్నా అవకాశాలపరంగా వెనుకబడుతున్న చైతన్య కృష్ణ శీనుగా డీసెంట్ గా ఉన్నాడు. అతి లేకుండా మితంగా తన పెర్ఫార్మన్స్ తో నిలబెట్టాడు.

మల్లి తండ్రిగా చేసిన చక్రపాణి చాలా సన్నివేశాల్లో తేలిపోయారు. సహజంగా, బాడీ లాంగ్వేజ్ మీద కమాండ్ ఉన్న నటుడు చేయాల్సిన క్యారెక్టర్ కావడంతో కొన్ని సన్నివేశాల్లో ఆ బరువును మోయలేకపోయారు. పర్వాలేదు కానీ ఇంకా బెటర్ ఆర్టిస్టు చేసుంటే బాగుండేదన్న ఫీలింగ్ కలుగుతుంది. ఒరిజినల్ వెర్షన్ లో చేసిన వీణా సుందర్ నే ఇక్కడా తల్లి పాత్రకు రిపీట్ చేయడం చాలా ప్లస్ అయ్యింది. పాయల్ తర్వాత స్క్రీన్ ని డామినేట్ చేసేది ఈవిడే. ఈ నలుగురు కాకుండా మిగిలిన అందరివీ చాలా చిన్న పాత్రలు. తోటపల్లి మధు, వేణు, అశోక్ కుమార్, అప్పాజీ అంబరీష, నవీన్ కృష్ణ, వాసు ఇంటూరి తదితరులు అలా ఒకటి రెండు సీన్లలో కనిపించి వెళ్లిపోయే వారే తప్ప ప్రత్యేకంగా ముద్రవేసిన వాళ్ళు లేరు.

డైరెక్టర్ అండ్ టీమ్

2018లో కన్నడలో రూపొంది పలు అవార్డులు, రివార్డులతో పాటు ప్రేక్షకుల మెప్పు పొందిన 'ఆ కరాళ రాత్రి'కి అనగనగా ఓ అతిథి అఫీషియల్ రీమేక్. అందులోని సోల్ మిస్ కాకూడదనే ఉద్దేశంతో అదే దర్శకుడు దయాళ్ పద్మనాభన్ కి దీని బాధ్యతలు అప్పగించారు. కన్నడ నేటివిటీకి మన ఆడియన్స్ టేస్ట్ కి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇది తమిళ మలయాళం సినిమాలకూ వర్తిస్తుంది. అందుకే నిర్మాత ఎవరైనా ఒక రీమేక్ ని ఎంచుకున్నప్పుడు అది ఇక్కడ ఎంతమేరకు వర్కవుట్ అవుతుందనేది లోతుగా విశ్లేషించుకోవాలి. కథ పరంగా చూసుకుంటే అనగనగా ఓ అతిథి ఇప్పటిదాకా రాని ఓ మంచి ప్రయత్నం.

కానీ లైన్ కోణంలో చూసుకుంటే చాలా చిన్నది. మొదలుపెట్టిన ముప్పావు గంట దాకా కథ చాలాసేపు ముందుకు సాగదు. పదే పదే ఒకే ఇంట్లో రిపీట్ సీన్స్, సీరియల్ తరహా సన్నివేశాలతో ఎలాంటి ప్రత్యేకత లేకుండా ఆసక్తిని తగ్గిస్తుంది. చివరి అరగంట మాత్రమే పద్మనాభన్ అసలు గుట్టు విప్పడం మొదలుపెడతాడు. క్రైమ్ థ్రిల్లర్ ట్యాగ్ తో ప్రమోషన్ చేసుకున్నప్పుడు చూసేవాళ్ళు దానికి తగ్గ అంచనాలతో ముందే ప్రిపేర్ అవుతారు. కానీ అనగనగా ఓ అతిథి చాలా సేపు ఆర్ట్ ఫిలిం ఫార్మట్ లో సాగుతూ పాత్రల మధ్య సంభాషణలు కూడా అతి మాములుగా అనిపిస్తాయి.

దీని వల్ల ట్రైలర్ లో చూసిన థ్రిల్స్ ఎప్పుడు వస్తాయా అని చాలా సేపు ఎదురు చూడాల్సి వస్తుంది. కన్నడలో దీన్ని కమర్షియల్ యాంగిల్ లో ప్రమోట్ చేయలేదు. కానీ ఇక్కడ పాయల్ రాజ్ పుత్ చేయడంతో వద్దన్నా ఆ ఫ్లేవర్ వచ్చేసింది. ఏ మాత్రం ఊహించడానికి అవకాశం లేని మలుపుని చివరి అరగంట పాటు బిగితో నడిపించిన పద్మనాభన్ స్క్రీన్ ప్లే మాత్రం చాలా నెమ్మదిగా ఉండేలా రాసుకోవడం ఈ సినిమాలోని ప్రధాన మైనస్. థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ కోసం తీసింది కాదు కాబట్టి ఆ కోణంలో చూస్తే పర్సు, టైం రెండింటి పరంగా భారమేదీ పడదు కనక వన్ టైం వాచ్ కాబట్టి జస్ట్ ఓకే అని చెప్పొచ్చు

సంగీతం అందించిన ఆరోల్ కోరెల్లి థీమ్ కు తగ్గ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమాను నిలబెట్టాడు. పాటలకు ఇచ్చిన సందర్భాలు క్లిష్టమైనవి కావడంతో ఉన్నంతలో తెరపై చూస్తూ వినడానికి బాగున్నాయి అనిపించేలా కంపోజ్ చేశాడు. రాకేష్ బి ఛాయాగ్రహణం బాగుంది. సింగల్ లొకేషన్లో అది కూడా చిన్న ఇరుకు ఇంట్లో గంటకు పైగా నడిచే సినిమాని మరీ విసుగు రాకుండా చేయడంలో ఇతని పాత్ర ఉంది. కాశీ నడింపల్లి సంభాషణలు చప్పగా ఉన్నాయి. ఎంత 80ల్లో నడిచే కథ అయినా ఆంత ముతక మాటలు అవసరం లేదనిపిస్తుంది. అక్కడక్కడా కొన్ని పేలాయి. ప్రీతి-బాబు శ్రీవాత్సవ ఎడిటింగ్ తక్కువే అయినా నిడివి మీద ఇంకాదృష్టి పెట్టాల్సింది. నిర్మాణ విలువల గురించి చెప్పాల్సింది ఏమి లేదు

ప్లస్ గా అనిపించేవి

చివరి అరగంట
పాయల్ రాజ్ పుత్
వీణా సుందర్
కెమెరా వర్క్

మైనస్ గా తోచేవి

ఫస్ట్ హాఫ్ సాగతీత
పార్షియల్ థ్రిల్లర్ కావడం
అతి తక్కువ పాత్రలు

కంక్లూజన్

అన్ని క్రైమ్ థ్రిల్లర్లు మొదటి నుంచి చివరిదాకా మెప్పించేలా ఉండవు. కొన్ని మన సహనాన్ని ఓపికను డిమాండ్ చేస్తాయి. అనగనగా ఓ అతిథి ఈ కోవలోకే వస్తుంది. రెగ్యులర్ గా మనం చూసే సైకో కిల్లర్ కథల్లా కాకుండా డిఫరెంట్ గా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో అత్యాశ జీవితాలను ఎంత సర్వనాశనం చేస్తుందో సందేశం ఇచ్చేలా దయాళ్ పద్మనాభన్ రూపొందించిన ఈ సినిమాను అంచనాలను జీరో చేసుకుని చూస్తే ఓ మోస్తరుగా నిరాశపరచకుండా పర్వాలేదు అనిపిస్తుంది. కానీ ట్రైలర్ నో టైటిల్ నో చూసుకుని ఎక్కువ ఊహించేసుకుంటే మాత్రం ఉసూరుమనక తప్పదు

అనగనగా ఓ అతిథి - నెమ్మదిగా సాగే యావరేజ్ థ్రిల్లర్

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp