బాలు ఇక లేరు : స్వర్గానికేగిన స్వర సాగరం

By iDream Post Sep. 25, 2020, 01:27 pm IST
బాలు ఇక లేరు : స్వర్గానికేగిన స్వర సాగరం

కోట్లాది సినీ సంగీతాభిమానుల ప్రార్ధనలు ఫలించలేదు. గాన గంధర్వుడిని తమ దగ్గరకు పిలిపించుకోవాలని నిశ్చయించుకున్న దేవతలు ఏ మొరను వినలేదు. ఏ పూజను స్వీకరించలేదు. యావత్ భారతావనిని విషాదంలో ముంచెత్తుతూ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం(74) ఈ రోజు మధ్యాన్నం 1.04 నిమిషాలకు స్వర్గానికేగారు. ఈ దుర్వార్తను కుమారుడు చరణ్ మీడియా ముందు ప్రకటించారు. గత యాభై రోజులకు పైగా చెన్నై ఎంజిఎం ఆసుపత్రిలో ఎక్మో చికిత్స తీసుకుంటున్న బాలుని కాపాడేందుకు అక్కడి వైద్యులు చేసిన ప్రయత్నాలు ఆయన ఊపిరిని నిలబెట్టలేకపోయాయి. జూలై చివరి వారంలో కరోనా సోకిన తర్వాత ఆగస్ట్ 5 నుంచి బాలసుబ్రమణ్యం ఆసుపత్రిలోనే ఉన్నారు. ఒకదశలో వైరస్ నుంచి కోలుకుని నెగటివ్ రిపోర్ట్ వచ్చినప్పటికీ ఫలితం లేకపోయింది. వినకూడదని ఏదైతే కోరుకున్నారో ఆ వార్త చెవిన చేరిన వేళ పరిశ్రమ వర్గాలతో పాటు ప్రతి ఒక్కరి హృదయం ద్రవించిపోతోంది. నిన్న సాయంత్రం నుంచే బాలు పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని ప్రెస్ నోట్ విడుదల చేశాక హుటాహుటిన కమల్ హాసన్ ఆసుపత్రికి రావడం తదితర పరిణామాలు విపరీతమైన భయాలు కలుగజేశాయి. ఆఖరికి అవే నిజమయ్యాయి.

కొన్ని వేల పాటలతో కులమత భేదాలు లేకుండా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న కళాకుబేరుడు అతను. 1967లో గురువుగా భావించే ఎస్పి కోదండపాణి సంగీత దర్శకత్వంలో శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న కోసం 'ఏమి ఈ వింత మోహము'తో తన తొలి గీతాన్ని పిబి శ్రీనివాస్, పి సుశీల, ఈలపాట రఘురామయ్య లాంటి దిగ్గజాలతో కలిసి తన ప్రస్థానాన్ని ఆరంభించిన బాలు నిర్విరామంగా దశాబ్దాల తరబడి తన గానామృతాన్ని పంచుతూనే ఉన్నారు. బాలసుబ్రమణ్యంని స్ఫూర్తిగా తీసుకుని పరిశ్రమకు వచ్చి గొప్ప స్థాయికి వచ్చిన వారు వేలల్లో ఉన్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, ఒరియా, తుళు, బెంగాలి, అస్సామీ, పంజాబీ, మరాఠి, ఇంగ్లీష్, సంస్కృతం, సింహళం, కొంకణి, బడగ తదితర భాషల్లో నలభై వేలకు పైగా పాటలు పాడి ఉంటారని అంచనా. నిరంతరం కళామతల్లి సేవలో తరించిన బాలసుబ్రమణ్యం గాయకుడిగానే పరిమితం కాలేదు. సంగీత దర్శకుడిగా, నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఇలా ఎన్నో రూపాల్లో బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించి తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. సంగీత దర్శకుడిగానూ బాలు సాధించిన ఘనతలు ఎన్నో.

చిరంజీవి మగధీరుడు, బాలకృష్ణ రాము, నాగార్జున జైత్రయాత్ర, జంధ్యాల పడమటి సంధ్యారాగం, ఏఎన్ఆర్-కృష్ణల ఊరంతా సంక్రాంతి, ఉషాకిరణ్ మూవీస్ మౌనపోరాటం, శోభన్ బాబు జాకీ మ్యూజిక్ డైరెక్టర్ గా బాలు ప్రయాణంలో కొన్ని మచ్చుతునకలు మాత్రమే. నాలుగు తమిళం, రెండు హిందీ, తొమ్మిది కన్నడ చిత్రాలకు ట్యూన్స్ అందించారు. ఘంటసాలతో కలిసి అయిదు పాటలు పాడే అదృష్టం దక్కించుకున్నారు. నటుడిగానూ ఎన్నో చిరస్మరణీయ పాత్రలను పోషించారు. తన శ్రీమతి సావిత్రి గారిని బాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అమ్మాయి పల్లవి, అబ్బాయి చరణ్ ఇద్దరు సంతానం. కమల్ హాసన్, మోహన్ లాల్, రఘువరన్, అనిల్ కపూర్, కార్తీక్, నాగార్జున, సుమన్, జగపతిబాబు లాంటి ఎందరో స్టార్లకు డబ్బింగ్ తో గాత్రదానం అందించిన ఘనత బాలుగారిది. భౌతికంగా కన్ను మూసినా నిత్యం మన జనజీవనంలో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రూపంలో వినిపించే పాటల్లో ఆయన సజీవంగా మన మధ్యే తిరుగుతూ పాడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ స్వరానికి మరణం లేదు. ఉండదు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp