కృష్ణ అండ్ హిజ్ గోల‌

By G.R Maharshi Jun. 30, 2020, 05:15 pm IST
కృష్ణ అండ్ హిజ్ గోల‌

ఈ మ‌ధ్య OTTలో వ‌స్తున్న సినిమాల్ని చూస్తే థియేట‌ర్‌లో రెండు రోజులు కూడా ఆడ‌ని మెటీరియ‌ల్‌ని తెచ్చి మ‌న మీద‌కి వ‌దులుతున్నారా అనిపిస్తుంది. కృష్ణ అండ్ హిజ్ లీల కూడా అలాంటిదే. ఆల్రెడీ వ‌చ్చేసిన అల్ల‌రి మొగుడు, కార్తీక దీపం, ఇంట్లో ఇల్లాలు -వంటింట్లో ప్రియురాలు క‌థ‌ల‌కి మాడ్ర‌న్ వెర్ష‌న్ ఇది. ఆ క‌థ‌ల్లోలా కొంచెం వినోదం, డ్రామా, ఎమోష‌న్స్ వుండ‌వు. కృష్ణ అనేవాడి గోల ఇది.

వాస్త‌వానికి ఈ సినిమా టార్గెట్ ఆడియ‌న్స్ వేరు. న‌గ‌రాల్లోని మ‌ల్టిప్లెక్స్ సినిమా ఇది. ఇప్ప‌టి యూత్ ఇలాగే ఉన్నారు. ఇది అంద‌రికీ అర్థం కాదు, యూత్‌కి న‌చ్చుతుంది అనే వాద‌న కూడా ఉంది. కానీ ఇది వాస్త‌వం కాదు. సినిమా అన్న త‌ర్వాత దాంట్లో ఏదో మ్యాజిక్ వుండాలి. ప‌థేర్‌పాంచాలి అంద‌రికీ న‌చ్చ‌క పోవ‌చ్చు , కానీ అది గొప్ప సినిమా. తాగ‌డం ఇష్టం లేని వాళ్లకు కూడా దేవ‌దాసు న‌చ్చుతుంది. టైటానిక్ ప్రేమ‌క‌థ‌ని అన్ని వ‌య‌సుల వాళ్లు చూసారు.
కృష్ణ‌గా సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ బాగా న‌టించాడు. క‌రెక్ట్ సినిమా ప‌డితే మొత్తం బ‌రువు మోస్తాడు. ఈ సినిమాలో కూడా మోసాడు కానీ క‌థ‌లో విష‌యం లేక చ‌తికిల‌ప‌డ్డాడు. చూసిన సీన్లే మ‌ళ్లీ చూస్తున్న ఫీల్ క‌లుగుతుంది. నెట్‌ప్లిక్స్‌లో రెండు గంట‌లు కంటిన్యూగా చూడ‌లేక ప‌దేప‌దే విశ్రాంతి కోరుకుంటే అది మ‌న త‌ప్పు కాదు.

ఎలాంటి వ్యక్తిత్వం లేని హీరో, త‌ల్లీతండ్రి వేరుగా వుండ‌డంతో ఫ‌స్ట్రేష‌న్‌. సిగ‌రెట్లు, మందు తాగుతుంటాడు. స‌త్య‌ (శ్ర‌ద్ధా శ్రీ‌నాథ్‌) అనే అమ్మాయితో ల‌వ్ . వీడి Over Attention వ‌ల్ల త‌న‌కు Space వుండ‌డం లేద‌ని బ్రేక‌ప్ చెబుతుంది. త‌ర్వాత రాధ అనే అమ్మాయితో ల‌వ్‌. బెంగ‌ళూరులో ఉద్యోగం వ‌స్తుంది. అక్క‌డ మ‌ళ్లీ స‌త్య ప‌రిచ‌యం.మ‌ళ్లీ ఆమెతో ల‌వ్‌. ఇపుడు రాధ‌తో బ్రేక‌ప్‌. స‌త్య కంటిన్యూ. రాధ ప్రెగ్నెంట్ అని చెబుతుంది. మ‌ళ్లీ రాధ‌తో ల‌వ్‌. ఇద్ద‌ర్నీ కావాల‌నుకుంటే ఇద్ద‌రూ వ‌ద్దంటారు. వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌లో విజయ్‌లా చివ‌రికి కృష్ణ అండ్ హీజ్ లీలా అని బుక్ రాస్తాడు. రెండు గంట‌లు చెప్పిందే చెబుతూ , తాగిందే తాగుతూ మాట్లాడిందే మాట్లాడుతూ వుంటాడు.

ఇపుడు యూత్ ఇలాగే వున్నారు క‌దా, ఏ నిర్ణ‌యం తీసుకోలేక‌, రిలేష‌న్‌షిప్ కంటిన్యూ చేయ‌లేక‌, క‌న్ఫ్యూజ‌న్‌తో వున్నారు క‌దా , అదే క‌దా సినిమాలో చూపించింది అని ద‌ర్శ‌కుడు ర‌వికాంత్ అనొచ్చు. కానీ నువ్వు జ‌రిగేది చెప్పు, ఎన్న‌టికీ జ‌రిగే అవ‌కాశం లేనిది చెప్పు (జ‌గ‌దేక‌వీరుడు-అతిలోక‌సుంద‌రి). గ‌తంలో జ‌రిగి వుండొచ్చు అనే క‌థ చెప్పు (బాహుబ‌లి). నువ్వేమి చెప్పినా Story Tellingలో ప్ర‌పంచంలో వున్న ఏక‌సూత్రం ఒక‌టే. బాగా చెప్తావా? లేదా? ర‌వికాంత్ ప్ర‌తిభావంతుడే కానీ, చికెన్ లేని చికెన్ బిరియాని వండి వ‌డ్డించాడు. క‌థ‌లో ఆస‌క్తి, గ్రిప్పింగ్‌, ఎమోష‌న్స్ ఏమీ లేవు. మ‌లుపులు లేక‌పోతే రోడ్డ‌యినా, క‌థ‌యినా బోర్ కొడుతుంది. చిన్న‌చిన్న యూ ట‌ర్న్స్ థ్రిల్‌ని ఇవ్వ‌వు.
ఝాన్సీ, సంప‌త్‌, సీర‌త్‌ క‌పూర్ ఉన్నా కూడా వాళ్ల‌ని పూర్తిగా ప‌క్క‌న పెట్టేసి , హీరో, ఇద్ద‌రు హీరోయిన్లే క‌నిపిస్తూ వుంటే ఎలా? డైలాగ్‌లు బావున్నాయి. కానీ ఏమీ గుర్తుండ‌వు.

ఇద్ద‌రు హీరోయిన్ల‌తో బ్రేక‌ప్ త‌ర్వాత , ఈ క‌థ‌ని హిమాల‌యాల్లో వున్న హీరో ప్లాష్ బ్యాక్‌లో చెబుతాడు. సినిమాలో హిమాల‌యాల‌కి ఎలాంటి స్కోప్ లేన‌ప్పుడు, అక్క‌డ స్టార్ట్ చేసినా ఒక‌టే, క‌థ‌ని KBR పార్క్ ద‌గ్గ‌ర స్టార్ట్ చేసినా ఒక‌టే. నిర్మాత‌ల‌కి డ‌బ్బు దండ‌గ త‌ప్ప‌.

ప్ర‌పంచ‌మంత‌టా రాజ‌కీయ భావ‌జాలం కుప్ప కూలిపోయి కెరిరీజం, డ‌బ్బు ఫ్రంట్ లైన్‌లోకి రావ‌డంతో ఇప్ప‌టి యూత్‌కి ఉద్యోగం, ల‌వ్‌, మందు ఇవే కీల‌కాంశాలు. ఉద్యోగంలో ఎక్కువ రోజులు ఉండ‌లేరు. రిలేష‌న్‌షిప్‌లో వుండ‌లేరు. వీళ్లు ఇలా వుండ‌డ‌మే మ‌న రాజ‌కీయ నాయ‌కుల‌కు కావాల్సింది. ప్ర‌శ్నించ‌డం వుండ‌నే వుండ‌దు. ప్ర‌శ్నించ‌డం యూత్ ల‌క్ష‌ణం. వాళ్లు అది మ‌రిచిపోయి చాలా కాల‌మైంది.

ఈ సినిమాలో కృష్ణ మ‌న‌కు న‌చ్చ‌క‌పోవ‌చ్చు. అత‌నే యూత్ ICON అని చాలా మంది న‌మ్ముతున్నారు. అదే విషాదం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp