కారులో కూర్చుని ఏడిపించిన సినిమా

By iDream Post Jun. 02, 2020, 07:35 pm IST
కారులో కూర్చుని ఏడిపించిన సినిమా

కమర్షియల్ పంథాలో వెళ్లకుండా విభిన్న శైలిలో సినిమాలు తీస్తూ సామాజికంగా ఆలోచింపజేసేలా తనకంటూ ప్రత్యేకమైన ముద్ర ఏర్పరుచుకున్న దర్శకులు క్రిష్ జాగర్లమూడి. స్టార్ అయినా చిన్న హీరో అయినా తన స్కూల్ నుంచి బయటికి రాకుండా విలువలకు కట్టుబడి ప్రేక్షకుల మెప్పు పొందటం ఈయనకే చెల్లింది. మొదటి సినిమా గమ్యంతోనే ఇండస్ట్రీతో పాటు సామాన్యుల దృష్టిని ఆకర్షించిన క్రిష్ దాని షూటింగ్ సందర్భంలో విపరీతమైన ఒత్తిళ్లు పనుల మధ్య ఓసారి కారులో కూర్చుని ఒంటరిగా ఏడవాల్సి వచ్చిందట. శర్వానంద్, అల్లరి నరేష్, కమలిని ముఖర్జీ కాంబోలో రూపొందిన ఆ మూవీలో క్రిష్ కాంటెంపరరి ఇష్యూ ని తీసుకున్నారు.

టేకింగ్,సంగీతం, సంభాషణలు ఇలా ప్రతి విభాగంలోనూ ప్రత్యేకత చూపించి దాన్నో వ్యక్తిత్వ వికాస పుస్తకంలా తీర్చిదిద్దారు. విడుదలయ్యాక ఓ థియేటర్ నుంచి బయటికి వస్తుండగా ఒక ప్రేక్షకుడు ఏం తీశాడ్రా సినిమా, ఎన్ని పుస్తకాలు చదివి రాసుకున్నాడో, అచ్చం ఒక అద్భుతాన్ని చదువుతున్నట్టు ఉంది అని చెప్పుకుంటూ పోయాడట. అతని వెనుకే క్రిష్ ఉన్నారు. అదే తనకు గొప్ప కాంప్లిమెంట్ అని భావించిన క్రిష్ కు ఆ తర్వాత గమ్యం విజయం నిజంగానే ఆ ఆడియన్స్ మాటని ఋజువు చేసింది. అలా గమ్యంతోనే సక్సెస్ ఫుల్ డెబ్యూ అందుకున్న క్రిష్ దాని రూపంలో ఎన్నో అవార్డులు, పురస్కారాలు కూడా దక్కించుకున్నారు. ఉత్తమ చిత్రం, దర్శకుడితో పాటు సపోర్టింగ్ యాక్టర్ గా నరేష్, గీత రచయితగా సిరివెన్నెల గారు నంది గౌరవాలు అందుకున్నారు.

ఫిలిం ఫేర్ లోనూ ఇదే రీతిలో సన్మానం అందుకున్న క్రిష్ కు గమ్యం ఎప్పటికీ మర్చిపోలేని ఫస్ట్ మూవీ మెమరీగా అతి గొప్పగా నిలిచిపోయింది. ఆ తర్వాత వేదంతోనూ అంతే పేరు తెచ్చుకున్న క్రిష్ అల్లు అర్జున్ లాంటి స్టార్ ని అలాంటి సబ్జెక్టులో చూపించడం అందరికి షాక్ కు గురి చేసింది. యాంటీ క్లైమాక్స్ ఉన్నా వేదం ఆదరణ దక్కించుకుంది. ఆపై కృష్ణం వందే జగద్గురుమ్, కంచె, గౌతమి పుత్ర శాతకర్ణి, మణికర్ణికలతో అంచనాలు నిలబెట్టుకుంటూ వచ్చిన క్రిష్ ఒక్క ఎన్టీఆర్ బయోపిక్ విషయంలోనే తడబడ్డారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో పీరియాడిక్ డ్రామా ప్లాన్ చేసిన క్రిష్ వకీల్ సాబ్ పూర్తవ్వగానే తన సినిమాను వేగవంతం చేయబోతున్నారు. ఇప్పటికే దీని మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి సినిమాకు కన్నీళ్లు దిగమింగే పరిస్థితి నుంచి తన చిత్రం కోసం ఎదురుచూసే స్థాయి దాకా చేరుకున్న క్రిష్ ప్రస్తుతం వీటితో పాటు కొన్ని వెబ్ సిరీస్ ల నిర్మాణ పర్యవేక్షణలు కూడా చేస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp