నో డౌట్ - సంక్రాంతి విజేత క్రాకే

By iDream Post Jan. 15, 2021, 06:04 pm IST
నో డౌట్ - సంక్రాంతి విజేత క్రాకే

కరోనా లాక్ డౌన్ తర్వాత యాభై శాతం సీట్లతో థియేటర్లు తెరుచుకున్న తర్వాత నువ్వా నేనా అనే స్థాయిలో తలపడిన నాలుగు సినిమాలు నిన్నటితో తమ విడుదలలు పూర్తి చేసుకున్నాయి. రిలీజ్ కు ముందు వరకు అన్నింటి మీద సమానమైన అంచనాలు నెలకొన్నాయి. ఫలానాది ఖచ్చితంగా హిట్ అవుతుందని చెప్పలేని పరిస్థితి. అందుకే ట్రేడ్ కూడా పోటీ పడి మరీ హక్కులను సొంతం చేసుకుని భారీ ఎత్తున ప్రేక్షకుల ముందు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఈ పండగ సీజన్ లో ఎవరు విజేతగా నిలిచారనే ఆసక్తి కలగడం సహజం. ఈ రోజు కనుమ కాబట్టి కలెక్షన్లు అందరికీ వస్తాయి కానీ విన్నర్ ఎవరన్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.

నాలుగు డిజాస్టర్ల తర్వాత పెద్దగా అంచనాలు లేకుండా బరిలో దిగిన రవితేజ క్రాక్ ఫైనల్ విజేతగా నిలిచిందని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. 9న విడుదలైన రోజే అన్ని వర్గాల నుంచి స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ అని పేరు తెచ్చుకున్న క్రాక్ ఆ టాక్ ని నిలబెట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. 13న మాస్టర్ అత్యధిక స్క్రీన్లలో రిలీజ్ చేయడం చాలా ప్రభావం చూపించినా దానికి వచ్చిన నెగటివ్ టాక్ క్రాక్ కి చాలా హెల్ప్ అయ్యింది. నైజాం డిస్ట్రిబ్యూటర్ తనకు జరిగిన అన్యాయం గురించి దిల్ రాజు మీద తీవ్ర నిరసన వ్యక్తం చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారడం చూస్తున్నాం.

మాస్టర్ సంగతి పక్కన పెడితే నిన్న వచ్చిన రెడ్, అల్లుడు అదుర్స్ కూడా సోసో ఫలితాలనే అందుకునేలా కనిపిస్తున్నాయి. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ మూవీని ప్రేక్షకులు నిర్మొహమాటంగా తిరస్కరించగా రెడ్ విషయంలో రామ్ కోసం తప్ప థియేటర్లో చూసేందుకు ఇంకే కారణం కనిపించడం లేదు. దీంతో అనూహ్యంగా మొన్నటి నుంచే క్రాక్ వసూళ్లలో మళ్ళీ పెరుగుదల కనిపిస్తోంది. బుకింగ్స్ వేగంగా జరుగుతున్నాయి. స్క్రీన్ కౌంట్ లో ప్రస్తుతానికి క్రాక్ కింది స్థానంలో ఉన్నప్పటికీ రేపటి నుంచి చాలా ఏరియాలలో థియేటర్లను పెంచబోతున్నారని తెలిసింది. మొత్తానికి మాస్ మహారాజా తన సక్సెస్ ట్రాక్ లోకి మళ్ళీ వచ్చేశాడు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp