బ్యాంకు ఉద్యోగం వదిలేసి సినిమాల్లోకి

By iDream Post May. 29, 2020, 04:34 pm IST
బ్యాంకు ఉద్యోగం వదిలేసి సినిమాల్లోకి

మాములుగా గవర్నమెంట్ నౌకరి అంటే ఎవరికైనా మక్కువే. అందులోనూ బ్యాంకు ఉద్యోగం అంటే వేరే చెప్పాలా. కాని మనకు ఇష్టమైన రంగం మీద ప్రేమ కసి తపన ఉన్నప్పుడు అది కూడా తక్కువే అనిపిస్తుంది. లైఫ్ ని రిస్క్ లో పెట్టైనా సరే తాడో పేడో తేల్చుకోవాలని ప్రేరేపిస్తుంది. నటులు కోట శ్రీనివాసరావు గారిది అలాంటి కథే. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఈయన పోషించినన్ని పాత్రలు టాలీవుడ్ లో అతి తక్కువ నటులు చేసుంటారనేది వాస్తవం. కోట గారు చదువు పూర్తయ్యాక నాన్న మార్గంలో నడవాలని నిర్ణయించుకుని స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియాలో జాబ్ సంపాదించుకున్నారు.

జీవితం ప్రశాంతంగా గడిచిపోతోంది.అయితే నటన మీద విపరీతమైన మక్కువ ఉన్న కోట గారు నాటకాలు మాత్రం బాగా వేసేవాళ్ళు. వీలు దొరికినప్పుడు అన్నయ్య కోట నరసింహరావు శిక్షణలో మెళకువలు నేర్చుకునేవారు. ఓసారి రవీంద్ర భారతిలో ఓ నాటకం వేస్తున్నప్పుడు దర్శకుడు ముత్యాల సుబ్బయ్య ఈయన నటన చూశారు. అప్పటికే కోట శ్రీనివాసరావు గారు చిరంజీవి ప్రాణం ఖరీదుతో పాటు ఓ రెండు మూడు సినిమాలు చేశారు కాని అంత గుర్తింపు రాలేదు. అప్పుడు వందేమాతరంలో దర్శకులు టి కృష్ణ మొదటి బ్రేక్ ఇచ్చారు. అయినా అవకాశాలు వేగంగా పెరగలేదు. బండి స్లోగానే ఉంది. ఆ తర్వాత ప్రతిఘటనలో చాలా కీలకమైన పాత్ర ఆఫర్ చేశారు టి కృష్ణ. ఇక అక్కడినుంచి వెనక్కు తిరిగి చూడాల్సిన అవసరం పడలేదు.

నిర్మాతలు దర్శకులు వేషాల వర్షం కురిపించారు. కోటగారు సైతం తగ్గకుండా ఒకదాంతో మరొకటి పోలిక లేకుండా తనలో అన్ని షేడ్స్ ని చూపించేసి ఒక్కో సినిమాలో ఒక్కో విశ్వరూపం చూపించడం మొదలుపెట్టారు. అహ నా పెళ్ళంట వేసిన కామెడీ క్యారెక్టర్ తెచ్చిన పేరు అంతా ఇంతా కాదు. రోజులో 24 గంటలు సరిపోలేనంత బిజీగా మారిపోయారు కోట. అదృష్టం కలిసి రాక తమ్ముడు కోట శంకర్ రావు పెద్ద స్థాయికి వెళ్ళలేకపోయారు కాని తెలుగు సినిమా చరిత్రలో కోట శ్రీనివాసరావు గారి పేరు మాత్రం ఒక ప్రత్యేక పేజీని లిఖించుకుంది. వయసు పైబడి పూర్తి సహకారం అందించకపోయిన ఇప్పటికీ ఏదైనా మంచి రోల్ వస్తే మిస్ చేయని కోటగారిని కోరి మరీ తమ సినిమాల్లో ఆఫర్స్ ఇచ్చే న్యూ జెనరేషన్ డైరెక్టర్స్ ఎందరో ఉన్నారు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp