80 లక్షల బడ్జెట్ - 8 కోట్ల వసూళ్లు

By iDream Post Mar. 30, 2020, 06:57 pm IST
80 లక్షల బడ్జెట్ - 8 కోట్ల వసూళ్లు

కొన్నిసార్లు బాక్స్ ఆఫీస్ ఫలితాలు ఊహకందని విధంగా సాగుతాయి. మనం వంద కోట్ల పెట్టుబడి పెట్టినంత మాత్రాన అంతే మొత్తం వెనక్కు వస్తుందన్న గ్యారెంటీ లేదు. మనం కోటి లోపే ఖర్చు పెట్టాం కాబట్టి ఇన్వెస్ట్ మెంట్ వచ్చినా చాలు అనుకునే సందర్భాలూ ఉంటాయి. ఏదీ ఆశించినట్టు జరగకపోవడమే అధిక శాతం పరిశ్రమలో రుజువవుతున్న సత్యం. అలాంటిదే ఈ ఉదాహరణ. 2006లో అల్లరి నరేష్ హీరోగా అతని నాన్న ఈవీవీ సత్యనారాయణ గారి దర్శకత్వంలో కితకితలు అనే సినిమా వచ్చింది. భారీకాయంతో ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇతర అందాల వైపు చూసే ఓ కానిస్టేబుల్ కథతో ఈవీవీ దీన్ని రూపొందించారు.

లావుగా కనిపించే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గీతా సింగ్ ని ఇందులో హీరోయిన్ గా తీసుకున్నారు. బాడీ షేమింగ్ కాన్సెప్ట్ లా అనిపించినా ఈవీవీ తనదైన మార్కు వినోదం జోడించి ఆఖర్లో మంచి సందేశాన్ని కూడా ఇచ్చారు. ఇది అప్పట్లో భారీ హిట్ అందుకుంది. ఎంతలా అంటే కేవలం 80 లక్షల బడ్జెట్ తో తీస్తే 8 కోట్లకు పైగా వసూలు చేసేంత. నిజానికి దీనికి ముందు అనుకున్న బడ్జెట్ 3 కోట్ల పైమాటే. కానీ అప్పటికే నరేష్ ఫ్లాపుల్లో ఉన్నాడు. 2002లో వచ్చిన తొట్టి గ్యాంగ్ తర్వాత సక్సెస్ దూరమయ్యింది. జూనియర్స్, ప్రాణం, నేను, నువ్వంటే నాకిష్టం, డేంజర్, పార్టీ ఇలా అన్ని వరసగా పరాజయం పాలయ్యాయి. మధ్యలో మా అల్లుడు వెరీ గుడ్డు మాత్రమే పర్వాలేదు అనిపించుకుంది.

అందుకే ఆ టైంలో ఇలాంటి కథతో అంత బడ్జెట్ ఎందుకులెమ్మని బాగా కుదించేసి 80 లక్షలకే పూర్తి చేశారట. ఖర్చు విషయంలో రాజీ పడినా కామెడీ పరంగా ఈవీవీ నిరాశపరచలేదు. ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వించేలా చేయడంతో పాటు సినిమా అయ్యాక ఆలోచన చేసే విధంగా శరీరం కంటే మనసు ముఖ్యమనే మెసేజ్ ని కూడా చక్కగా ఇచ్చారు. ఫలితంగా 8 కోట్లకు పైగా కలెక్షన్లతో కితకితలు బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇది స్వయంగా అల్లరి నరేష్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కితకితలు తర్వాతే అల్లరి నరేష్ ట్రాక్ లో పడి మళ్ళీ వరుస సక్సెస్ లు అందుకోవడం మొదలుపెట్టారు. అంతేమరి తలచినదే జరిగినదా దైవం ఎందులకు అని ఓ పాటలో చెప్పినట్టు సినిమా విచిత్రాలు అంటే ఇలాగే ఉంటాయి

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp