వర్మ రాజ్యంలో' శాంతిదూత'

By Kiran.G 21-11-2019 03:42 PM
వర్మ రాజ్యంలో' శాంతిదూత'

హవ్వా ఇది విన్నారా..!! KA పాల్ కి వర్మ తీస్తున్న సినిమాపై కోపం వచ్చి హైకోర్టులో కేస్ వేసారట. తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా సినిమా ఉన్నదని ఎలాగైనా ఆ సినిమాని ఆపాలని హైకోర్టుకు వెళ్లారట. నిత్యం వివాదాలతో కాపురం చేసే వర్మని కాసేపు పక్కన పెడదాం. నిజానికి వర్మ, పాల్ ని కించపరిచాడా లేదా పాల్ తనని తానే కించపరచుకున్నాడా అనే ఆలోచన సామాన్య ప్రజలందరి మనసుల్లోనూ కలుగుతుంది.

KA పాల్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పరిచయం అవసరం లేని పేరు. క్రైస్తవ మత బోధకుడిగా ఆకాశమంత పేరు సంపాదించుకుని నేడు రాజకీయ నాయకుడిగా మారి అథఃపాతాళానికి పడిపోయారు. రాజకీయ పార్టీ పెట్టడంలో తప్పు లేదు కానీ తన సెల్ఫ్ డబ్బా ఇంటర్వూలతో, పార్టీ ప్రచారంలో చేసిన పిచ్చి చేష్టలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఒక కమెడియన్ లా కనిపించారు. అందుకే ప్రజలు KA పాల్ ని లైట్ తీసుకున్నారు. నూటికి 90% సీట్లు మావే అని బీరాలు పలికి ఎన్నో సమస్యలతో అలసిపోయి వచ్చిన ప్రజలకు నవ్వులు పంచారు కేఏ పాల్. ఒకానొక దశలో ఒక స్టార్ కమెడియన్ తెలుగు తెరకు దూరమయ్యాడు. ఆ కమెడియన్ లేని లోటు కేఏ పాల్ తీర్చాడంటూ సోషల్ మీడియా కామెంట్స్ ఎక్కువగా కనిపించేవి. వాటిని చూసి కూడా అదంతా తనకున్న ఫాలోయింగే అనుకుని మురిసిపోయారు కేఏ పాల్.

ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలను ఇతివృత్తంగా చేసుకుని, రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న "కడప రాజ్యంలో కమ్మ రెడ్లు" సినిమాని సిద్దార్ధ తాతోలు రూపొందిస్తున్నారు. ఆ సినిమాలో తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పాత్రని రూపొందించారని ఆ సినిమాను ఆపాలంటూ హైకోర్టులో కేస్ వేశారు. అంతవరకూ బానే ఉంది. కానీ వర్మతో పాటు, ప్రతివాదులుగా కేంద్ర మంత్రిత్వ శాఖ మీద, సెన్సార్ బోర్డుమీద, తన పాత్రని పోషించాడని జబర్దస్త్ రాము పైన కేస్ ఫైల్ చేసారు. ఈ కేస్ కోర్టులో ఎంత వరకూ బలంగా నిలబడుతుందో అనేది కేఏ పాల్ కే తెలియాలి. వర్మ వివాదాల్లో చిక్కుకోవడం ఇది మొదటిసారి కాదు. గతంలో వర్మ రూపొందించిన, రక్త చరిత్ర, కిల్లింగ్ వీరప్పన్, వంగవీటి, లక్ష్మీస్ ఎన్టీఆర్,కూడా అనేక వివాదాల్లో చిక్కుకున్నాయి. ముఖ్యంగా దేశ చట్టాల్లోని లొసుగులను ఉపయోగించుకుని వర్మ పోర్న్ ఫిల్మ్ రూపొందించడం దేశ వ్యాప్తంగా వివాదాస్పదమైంది.

గతంలో వర్మ ఇచ్చిన పలు ఇంటర్వ్యూలలో కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా పూర్తి కల్పిత పాత్రలతో రూపొందించబడిందని ఒకవేళ అలాంటి పాత్రలు బయట ఉంటే అది కేవలం యాధృచ్చికంగా జరిగి ఉంటుందేమో కానీ కావాలని చేసింది కాదని వివరణ ఇవ్వడం తెలిసిందే. ఎవరెన్ని ఎత్తులు వేసినా తన సినిమాలకి ఎలా పుబ్లిసిటీ ఇచ్చుకోవాలో, ఎన్ని వివాదాలు జరిగినా తన సినిమాలను ఎలా రిలీజ్ చేసుకోవాలో వర్మకి బాగా తెలుసు. మీడియాని వర్మ వాడినంత తెలివిగా ఎవరూ వాడుకోలేరు అన్నది జగమెరిగిన సత్యం.

వర్మ తన కాళ్లు పట్టుకున్నాడని, సినిమా కోసం కోటిరూపాయలు అడిగాడని గతంలో కేఏ పాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి నవ్వుల పాలవ్వడం తెలిసిందే. బురదలో రాయేస్తే మన బట్టలపైనే పడుతుందని తెలిసి, అతి తెలివితో బట్టలన్నీ విప్పేసి బురదలో రాయి వెయ్యాలని ఆలోచిస్తున్నట్లుగా అనిపిస్తుంది కేఏ పాల్ పరిస్థితి. ఈ హైకోర్టు కేసు వల్ల వర్మకి అదనపు పబ్లిసిటీ ఇవ్వడం మినహా మరే ఉపయోగం ఉండదని కొందరి న్యాయ నిపుణుల అభిప్రాయం..

idreampost.com idreampost.com

Click Here and join us on WhatsApp to get latest updates.

Related News