పీపుల్స్ స్టార్ తో గొడవ అందుకే

By iDream Post Jun. 07, 2020, 06:03 pm IST
పీపుల్స్ స్టార్ తో గొడవ అందుకే

కమర్షియల్ ఫార్ములాకు దూరంగా సినిమాలు తీస్తారని పేరున్న పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి సాధారణంగా వివాదాలకు దూరంగా ఉంటారు. అందులోనూ సమాజం మీద చైతన్యం కలిగేలా చిత్రాలు రూపొందిస్తారు కాబట్టే ఆయనకా గౌరవం ఉంది. అయితే కొన్నిసార్లు ఎంత పెద్ద నటుడైనా దర్శకుడైనా ఈగోల మీద కంట్రోల్ లేకపోతే నిందలు పడాల్సి వస్తుంది. అలాంటిదే ఈ ఉదంతం. కొన్నేళ్ళ క్రితం మూర్తి గారు తన స్వంత బ్యానర్ లో తీస్తున్న ఓ సినిమా కోసం యాంకర్ ఝాన్సీని చెల్లి పాత్రకు సెలెక్ట్ చేసుకున్నారు. ముందు చెప్పిన కథ ప్రకారం హీరో పాత్ర చనిపోతే ఆ బాధ్యత చెల్లెలు తీసుకుని క్లైమాక్స్ లో ఒక హై వోల్టేజ్ సాంగ్ తో పాటు యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది. ఝాన్సీ ఒప్పుకోవడానికి కారణం కూడా అదే.

షూటింగ్ మొదలయ్యాక సెట్ లో ఝాన్సీ నవ్వుతూ అందరితో కలివిడిగా ఉండటం నారాయణ మూర్తి గారికి నచ్చలేదు. కొద్దిరోజుల తర్వాత ఝాన్సీకి చెప్పిన ఎపిసోడ్ తాలూకు షూట్ మొదలయ్యింది. తనను పిలవడం లేదు. లోపల చూస్తేనేమో తెలంగాణ శకుంతలతో పాటు ఇతర తారాగణం ఉన్నారు. చనిపోతాడని చెప్పిన హీరో పాత్ర మళ్ళీ బ్రతికొచ్చి ఉద్యమాన్ని నడుపుతోంది. అంటే కథ మార్చారని ఝాన్సీకి అర్థమైపోయింది. దీంతో అక్కడితో వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి రానే లేదు. నారాయరావు గారు సైతం ఎందుకమ్మా అని అడగలేదు. దీంతో డబ్బింగ్ తో పాటు ప్రమోషన్ కు సైతం ఝాన్సీ దూరంగా ఉండిపోయింది. సాఫ్ట్ నేచర్ కు పేరున్న ఆయన ఇలా చేయడం నిజంగా ఆశ్చర్యమే.

ఒకవేళ పాత్ర మార్చాలి అనుకున్నప్పుడు ముందుగా ఆ ఆర్టిస్ట్ కు తెలియపరచాలి. ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో కారణాలు వివరించాలి. అంతే తప్ప వ్యక్తిగతంగా సెట్ లో ప్రవర్తన నచ్చలేదన్న కారణంగా ఇలా చేయడం మాత్రం ఆమోదయోగ్యం కాదు. అయితే ఇదంతా ఝాన్సీ గారి వెర్షన్.నారాయణమూర్తి గారు దీని గురించి స్పందించిన దాఖలాలు తర్వాత లేవు. అయితే ఆ సినిమా ఏది అన్నది మాత్రం బయటికి చెప్పలేదు ఝాన్సీ. ఇలాంటివి ఇండస్ట్రీలో సహజమే అయినా ఫలానా నటుడికి ప్రత్యేకమైన ఇమేజ్ ఉన్నప్పుడు ఈ రకమైన సంఘటనలు వేరే సంకేతాలు ఇచ్చే అవకాశం ఉంది. అందులోనూ ఝాన్సీ లాంటి ముక్కుసూటిగా వెళ్లేవాళ్ళతో వ్యవహరించే తీరు అందరిలాగా ఉండకూడదు. లేకపోతే ఇలాంటి అపార్థాలే కలుగుతాయి. ఈ విషయాన్నీ స్వయంగా ఝాన్సీనే పంచుకోవడంతో వెలుగులోకి వచ్చింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp