ఇది భావ్యమా బాలూ…? - TNR

ఎస్.పి.బాలు గారి గురించి రాయడానికి నాకు ఇన్నిరోజులు పట్టింది…
రాయలేక కాదూ….
సమయం లేక కాదు...
కాగితం మీద కలం కదలక...
ఆ కాగితం మీద పెట్టడానికి పదాలు దొరక్క…
బాలు గారు మన మధ్య నుండి భౌతికంగా దూరమయ్యి రెండు నెలలయ్యింది.
అసలు విషయం చెప్పాలంటే…. ఈ రెండు నెలలూ బాలుగారి గురించి ఓ పోస్ట్ పెడదామన్న ఆలోచనే రాలేదు నాకు.
కారణం…...
రోజూ సోఫాలో కూచుని పాటలు వింటూ ఆయన ధ్యాసే..
కార్లో వెళ్తూ తన ఉపన్యాసాలు వింటూ ఆయన ధ్యాసే..
భోజనం చేస్తూ తన ఇంటర్వ్యూలు చూస్తూ ఆయన ధ్యాసే..
రోజంతా ఇన్ని ధ్యాసలతో ఉండి రాత్రి నిద్రపోయినప్పుడు కలలో కూడా ఆయనే...
గతంలో ఎంతో మంది ప్రముఖులు చనిపోయినప్పుడు ఇలా కొన్నిసార్లు జరిగిన మాట వాస్తవం..
మొదటిరోజు షాక్ అయ్యా..
రెండో రోజు బాధపడ్డా..
మూడో రోజు వాళ్ళ జ్ఞాపకాల్ని తలుచుకున్నా...
నాలుగోరోజు నుండి మెల్లమెల్లగా మర్చిపోయా…
నేను ఎక్కువగా షాక్ అయ్యింది రాజీవ్ గాంధీ, ఎన్.టి.రామారావు,వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి,శోభన్ బాబు,శ్రీదేవి మరణాల విషయం లో...
మిగతా వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళందరి విషయంలో కొంచెం ఎక్కువ షాక్ అయ్యా...
ఇంకొంచెం ఎక్కువ బాధ పడ్డా..
మరిన్ని ఎక్కువ జ్ఞాపకాల్ని తలుచుకున్నా...
కానీ...వీళ్ళనూ మర్చిపోయా...
కాకపోతే కొంచెం ఆలస్యంగా మర్చిపోయా…
ఏదో ఒక సందర్భం వస్తే తప్ప వీళ్ళెవరూ గుర్తు రారు నాకు.
కానీ బాలుగారు మాత్రం నన్ను వదలడం లేదు...
ఇప్పట్లో ఆయన నన్ను వదిలి వెళ్ళేలా లేరు.
కాదు...ఎప్పటికీ వదిలి వెళ్ళరు..
ఆలోచిస్తే ఆయనేం నా బావో,బాబాయో,మామయ్యో కాదు.
ఆమాటకొస్తే నాకు బాలుగారు అస్సలు పరిచయమే లేదు...
ఎప్పుడూ కలవలేదూ….ఫోన్ మాట్లాడ లేదు.
కనీసం దూరం నుండి చూసిన అనుభవం కూడా లేదు..
మరి ఏంటిదీ.…?
ఒక మనిషి ఏమాత్రం పరిచయం లేని నాలాంటి వ్యక్తిని మరణించాక కూడా ఇంతలా ప్రభావితం చేయగలడా...?
బాగా ఆలోచిస్తే నాకే ఒక కారణం తట్టింది…
అదేంటంటే….
నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఆయన గొంతు నాతో ప్రయాణం చేసింది...
నాలా కొన్ని కోట్ల మంది భారతీయులతో ప్రయాణం చేసింది…
మన అందరి జీవితం లో ఆయనొక భాగమయ్యారు...
ఆయన పాటతో మన రోజు ప్రారంభమవుతుంది..
ఆయన పాటే రోజుచివర్లో మనల్ని నిద్ర పుచ్చుతుంది…
పరిచయం లేని ఎంతో మందికి ఆయన ఇంటి మనిషయ్యాడు.
మీరు నమ్ముతారో లేదో....
బాలుగారు మరణించినప్పటి నుండి ప్రతీరోజూ స్వరాభిషేకం ప్రోగ్రాం ఓ అర్ధగంటో, పావుగంటో ఖచ్చితంగా చూస్తున్నాను.
ఆయన నా కళ్ళ ముందు బ్రతికున్నట్టే నా ఫీలింగ్.
ఎవరు అనగలరు మీరు మరణించారని..?
ఎఫ్.ఎం లో,టీవీలో,యూట్యూబ్ లో మీ పాట మేము వినని రోజున...మిమ్మల్ని చూడని రోజున చెప్పండి ఆ మాట.
కట్టే బ్యానర్ బట్టకి,పెట్టే హోర్డింగ్ కట్టెకి జేబులో సరిపడా డబ్బులుంటే చాలు "మరణించినా జనాల హృదయాల్లో నిలిచిపోయిన వ్యక్తి" అని పెద్దపెద్దక్షరాలతో రాయించుకోవడం అతి సులువైన ఈరోజుల్లో ఆ వాక్యానికి పరిపూర్ణమైన అర్థం తీసుకొచ్చే మహానుభావుడు బాలు గారు….
భారతీయ చలనచిత్ర చరిత్ర మీద ఓ పుస్తకం రాస్తే దేశంలోనే అందరికన్నా అతి ఎక్కువ సినిమాలకు వర్క్ చేసిన ఏకైక వ్యక్తిగా బాలుగారి పేరు మాత్రమే ఉంటుందేమో...
చలనచిత్ర చరిత్రకి మీదొక మరపురాని పేజీ...
ఏదేమైనా… మనసుకి ఎన్ని సర్ది చెప్పుకున్నా సినిమాని ఆరాధించే ప్రతీ మనిషికి మీదొక మిoగుడుపడని మరణం.
"మీ మరణం సినిమా ఇండస్ట్రీకి తీరని లోటు" అని చనిపోయిన ప్రతీ వ్యక్తికి వాడుతున్న ఈరోజుల్లో మీ మరణం మాత్రం ఇండస్ట్రీకి నిజమైన లోటే…
నిజానికి ఫిబ్రవరిలో ఆయనతో ఓ మంచి ఇంటర్వ్యూ చేద్దామని మంచి కంటెంట్ తో ఓ కాన్సెప్ట్ ప్లాన్ చేశాను.
కలిసి మాట్లాడదాం అనుకున్నాను.
ఈలోగా కరోనా బ్రేక్….
కానీ ఇంత తొందరగా మనల్ని ఆయన వదలి వెళ్ళిపోతారని ఊహించలేదు...
నా జీవితంలో నాకున్న రిగ్రెట్స్ లిస్ట్ లో ఇప్పుడు కొత్తగా చేరిన విషయం "బాలు గారిని ఇంటర్వ్యూ చేయలేకపోయానే" అని …
ఈ సందర్భంగా స్వరాభిషేకం,పాడుతాతీయగా లాంటి గొప్ప కార్యక్రమాలు చేసి జీవితాంతం బాలుగారిని మన కళ్ళముందు సజీవంగా ఉండేటట్టు చేసిన రామోజీరావు గారికి కొన్ని వేల ధన్యవాదాలు.
బాలు గారి మీద పోస్ట్ పెట్టడానికి నా ఈ ఆలస్యం కావాలని చేసింది కాదు కలం కదలకే అని మరొక్కసారి తెలియజేసుకుంటూ.…
love you all...😍 - TNR


Click Here and join us to get our latest updates through WhatsApp