నా మేనేజర్ వల్ల ఇబ్బంది పడ్డాను

By iDream Post May. 22, 2020, 03:06 pm IST
నా మేనేజర్ వల్ల ఇబ్బంది పడ్డాను

ఇంద్రజ . 90 దశకంలో సినిమాలు చూసే అలవాటున్న ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన పేరు. ఆలి హీరోగా ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందిన యమలీల బ్లాక్ బస్టర్ తో గుర్తింపు తెచ్చుకున్న ఇంద్రజ అప్పట్లో మంచి డిమాండ్ తో ఉండేవారు. సీనియర్ స్టార్ బాలకృష్ణతో పెద్దన్నయ్య లాంటి బ్లాక్ బస్టర్స్ తన ఖాతాలో ఉన్నాయి. హీరొయిన్ గా కాకపోయినా నాగార్జున సరసన స్పెషల్ సాంగ్స్ చేసిన హలో బ్రదర్, వజ్రం కూడా చక్కని గుర్తింపు ఇచ్చాయి. రాజేంద్ర ప్రసాద్, జగపతి బాబు, సుమన్, శ్రీకాంత్, నరేష్, కృష్ణలతో కూడా తనకు మెమొరబుల్ మూవీస్ ఉన్నాయి.

వెంకటేష్ చిన్నబ్బాయిలో కూడా అలా తళుక్కున మెరుస్తారు. కాని ఒక్క మెగా స్టార్ చిరంజీవితోనే చేయలేని లోటు ఇంద్రజకు అలా మిగిలిపోయింది. చిన్న చిన్న గ్యాప్స్ తో ఇండస్ట్రీలో రెగ్యులర్ టచ్ లో ఉన్న ఇంద్రజ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాక బాగానే అవకాశాలు దక్కించుకుంటున్నారు. దిక్కులు చూడకు రామయ్యతో మళ్ళీ స్పీడ్ పెంచిన ఇంద్రజ గతంలో తన మేనేజర్ వల్ల పడ్డ ఇబ్బందిని ఓ సందర్భంలో షేర్ చేసుకున్నారు. హీరొయిన్ గా పీక్స్ లో ఉన్న టైంలో శోభన్ బాబు గారి సినిమాలో ఓ సాంగ్ కోసం ఆవిడను సంప్రదించకుండా మేనేజర్ నేరుగా అడ్వాన్సు తీసుకున్నాడు. కాని ఇంద్రజకు అలా చేయడం ఇష్టం లేదు. పదే పదే ఇలాంటి పాటలు చేయడం వల్ల హీరొయిన్ ఇమేజ్ కి ఇబ్బంది ఏర్పడుతుందనే ఉద్దేశంతో అప్పటిదాకా నో చెప్పుకుంటూ వచ్చారు.

కాని మేనేజర్ స్వంత నిర్ణయం తీసుకుని డబ్బులు కూడా అందుకోవడంతో వేరే ఆప్షన్ లేకుండా పోయింది. తప్పనిసరి పరిస్థితిలో ఆ పాట చేశారు. ఆ సినిమా కోడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఆస్తి మూరెడు ఆశ బారెడు. ఇక అక్కడి నుంచి నిర్ణయాలు గుడ్డిగా మేనేజర్ల మీద వదలకూడదని ఇంద్రజకు అర్థమైపోయింది. అక్కడితో అతనికి అలాంటి సాంగ్స్ కి ఓకే చెప్పడం మానేశారు. ఆలి లాంటి కమెడియన్ సరసన నటించడం ఏమిటని తొలుత కామెంట్లు వినిపించినప్పటికీ సబ్జెక్టు మీద నమ్మకంతో యమలీల చేయడం ఎంత ప్లస్సయ్యిందో చెప్పే ఇంద్రజ న్యూ జనరేషన్ హీరో హీరొయిన్లకు తల్లిగా కనిపించడం వల్ల ఇప్పటి తరానికి కూడా కనెక్ట్ అవ్వగలుగుతున్నారు. మొత్తానికి మధ్యవర్తుల మీద పూర్తిగా ఆధారపడటం వల్ల ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయో చెప్పడానికి ఇదే చక్కని ఉదాహరణ

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp