సాటిలేని వెండితెర అద్భుతాల జంట

By iDream Post Jun. 02, 2020, 04:48 pm IST
సాటిలేని వెండితెర అద్భుతాల జంట

సాధారణంగా ఒక దర్శకుడికి ఒక మ్యూజిక్ డైరెక్టర్ సింక్ అవ్వడం ప్రతి బాషా పరిశ్రమలోనూ చూస్తుంటాం. కాకపోతే అవి కేవలం కొన్ని హిట్లకే పరిమితం కావడం గమనించవచ్చు. అలా కాకుండా దశాబ్దం పైగా ఒక జంట ఇండియన్ సినిమా ఎప్పటికీ మర్చిపోలేని గొప్ప క్లాసిక్స్ ఇవ్వడం అందులోనూ ఆ ఇద్దరి పుట్టినరోజు ఒకే తేదికి రావడం కన్నా మ్యూజిక్ లవర్స్ కు పండగ ఏముంటుంది. వాళ్ళే ది గ్రేట్ మణిరత్నం-ఇళయరాజా. ఈ కాంబినేషన్ లో 10 సినిమాలు వచ్చాయి. మణిరత్నం కెరీర్ ప్రారంభం అయ్యింది కన్నడ సినిమా 'పల్లవి అనుపల్లవి'తో. అనిల్ కపూర్ హీరోగా నటించిన ఈ చిత్రం కమర్షియల్ గా గొప్ప విజయం సాధించలేదు కాని పాటలు మాత్రం అద్భుతం అనిపించుకున్నాయి.

తెలుగులోనూ దీన్ని డబ్బింగ్ చేశారు. ఇందులోని ట్యూనే ఐడియా కంపెనీ తమ అఫీషియల్ కాలర్ ట్యూన్ గా వాడుకుంది. ఆ తర్వాత ఉనరు, పగల్ నిలవు, ఇదయ కోవిల్ అనే మూడు తమిళ చిత్రాలు ఈ జంట ద్వయంలో వచ్చాయి. అందులోనూ మంచి పాటలు ఉన్నాయి కాని అసలు ప్రయాణం మొదలయ్యింది మాత్రం 'మౌన రాగం'తోనే. మణిరత్నంలోని మెజీషియన్ ప్రపంచానికి తెలిసింది ఈ సినిమాతోనే. తెలుగు తమిళ్ లో ఘన విజయం సాధించిన మౌనరాగం స్ఫూర్తితో ఇప్పటికీ ఎన్నో సినిమాలు వస్తూనే ఉన్నాయి. కమల్ హాసన్ తో తీసిన 'నాయకుడు'ది ఓ ప్రత్యేక చరిత్ర. మాఫియా కథలో అసమానమైన ఎమోషన్ ని జొప్పించి ఇళయరాజా సంగీతంతో డాన్ కథను తెరకెక్కించిన తీరు ఇప్పటికీ ఒక గ్రామర్ బుక్ లా నిలిచిపోయింది.

ప్రభు, కార్తి కాంబినేషన్ లో రూపొందిన మల్టీ స్టారర్ 'ఘర్షణ' (తమిళ టైటిల్ అగ్ని నచ్చతిరం) సైతం బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ముఖ్యంగా పాటలు అప్పట్లో యూత్ ని వెర్రెక్కేలా చేశాయి. తర్వాత నాగార్జునతో మణిరత్నం తీసిన ఒకే ఒక్క తెలుగు స్ట్రెయిట్ మూవీ 'గీతాంజలి' పాటలు 30 ఏళ్ళ తర్వాత కూడా మెలోడీ లవర్స్ టాప్ లిస్టు లో ఉన్నాయి. తర్వాత హీరో లేకుండా ప్రాణంతకమైన జబ్బుతో బాధ పడుతున్న పసిపాపను టైటిల్ రోల్ పెట్టి తీసిన 'అంజలి'ని చూసి అందరూ అబ్బురపడ్డారు. దాని విజయం విమర్శకులకు నోట మాట రాకుండా చేసింది.

ఇక సూపర్ స్టార్ రజినీకాంత్, మముట్టి కాంబోలో తీసిన అప్పటి సౌత్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ 'దళపతి' రికార్డులను తిరగరాసింది. ఇందులోనే అరవింద్ స్వామి కలెక్టర్ గా అంత పోటీలోనూ ఆకట్టుకుంటాడు. రాజా కంపోజ్ చేసిన చిలకమ్మా చిటికేయంగా, సింగారాల పైరుల్లోనా పాటలు ఊరు వాడా మారుమ్రోగిపోయాయి. మణి-రాజాల కాంబోలో వచ్చిన చివరి సినిమా ఇదే. ఆ తర్వాత ఏవో కారణాల వల్ల మణిరత్నం ఏఆర్ రెహమాన్ అనే ప్రభంజనంతో కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. ఏది ఎలా ఉన్నా మణి-రాజాల కాంబినేషన్ మాత్రం భారతీయ సినిమాలో అత్యంత అదుత్బమైన జంటల్లో ఒకటిగా చెప్పొచ్చు . ఈ ఇద్దరి పుట్టినరోజు ఒకే తేది జూన్ 2 రావడంలోనూ ఎంత విశేషముందో.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp