ఐకాన్ స్టార్ ప్లానింగ్ మారుతోందట

By iDream Post Oct. 26, 2021, 03:03 pm IST
ఐకాన్ స్టార్ ప్లానింగ్ మారుతోందట

ప్రస్తుతం పుష్ప 1ని పూర్తి చేసే పనిలో ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎలాగైనా సరే రిలీజ్ డేట్ ఫిక్స్ అయిన డిసెంబర్ 17ని మిస్ కాకూడదనే లక్ష్యంతో ఉన్నాడు. అయితే ఇంకో షెడ్యూల్ తో పాటు పాట బ్యాలన్స్ ఉన్న నేపథ్యంలో కేవలం నెల రోజులు చేతిలో ఉంచుకుని దర్శకుడు సుకుమార్ పూర్తి చేయగలరా అనే అనుమానాలు లేకపోలేదు. ఎందుకంటే నవంబర్ చివరి వారానికి షూట్ ఫినిష్ చేసి ఫస్ట్ కాపీ చేతిలో పెట్టుకుని డిసెంబర్ మొదటి రెండు వారాలు విస్తృతంగా ప్రమోషన్లు ఈవెంట్లు చేయాల్సి ఉంటుంది. జనవరిలో రిలీజయ్యే ఆర్ఆర్ఆరే చాలా అడ్వాన్స్ గా పబ్లిసిటీ చేస్తున్నప్పుడు దానికి ఇరవై రోజుల ముందు వచ్చే పుష్ప ఇంకెంత చేయాలో వేరే చెప్పాలా.


మరి అన్నమాటకు కట్టుబడతారో లేదో కాలమే నిర్ణయిస్తుంది. ఒకవేళ బన్నీ కనక ఆ తేదీని వదులుకునే పరిస్థితి వస్తే అఖండ లేదా ఆచార్యలో ఎవరో ఒకరు ముందుకు రావొచ్చు. ఇవన్నీ ప్రస్తుతం గాల్లో చక్కర్లు కొడుతున్న పుకార్లు. ఇదిలా ఉండగా పుష్ప 2 కన్నా ముందు అల్లు అర్జున్ మరో సినిమా చేస్తాడని అది కూడా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ అని ఆ మధ్య బన్నీ వాసు ఓ ఇంటర్వ్యూలో చెప్పడం గుర్తే. కానీ ఇప్పుడు సిచువేషన్ ని బట్టి చూస్తే బన్నీ దానికి బదులు బోయపాటి శీనుతో సరైనోడు లాంటి మరో మాస్ ప్రాజెక్ట్ ని ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. అఖండ ఫలితం తెలిశాక దీనికి సంబంధించిన అడుగులు పడొచ్చు.


పుష్ప తర్వాత నెక్స్ట్ ఏంటి అనే విషయంలో అల్లు అర్జున్ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నాడు. అల వైకుంఠపురములో మించి పుష్ప పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం తనకు గట్టిగానే ఉంది. ఆర్ఆర్ఆర్ కన్నా మ్యూజికల్ గా తన సినిమాకే ఎక్కువ బజ్ వచ్చిన అవకాశాన్ని కూడా పూర్తిగా వాడుకునేందుకు రెడీ అయ్యాడు. ఒకవేళ ఐకాన్ పెండింగ్ లో పెడితే అప్పుడు వేణు శ్రీరామ్ ఎవరికి కమిట్ అవుతాడో చూడాలి. వకీల్ సాబ్ 2 అని ఏదో ప్రచారం జరుగుతోంది కానీ అదీ అబద్దమే. మొత్తానికి తన మనసులో మాట, చేయాలనుకుంటున్న సినిమాల గురించి బన్నీ మైంటైన్ చేస్తున్న సైలెన్స్ ఎప్పుడు బ్రేక్ అవుతుందో.


ALSO READ - బుల్లితెరపై అన్ స్టాపబుల్ హంగామా

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp