అభిమాని వద్దన్నందుకు మానేశాను

By iDream Post Jun. 29, 2020, 07:22 pm IST
అభిమాని వద్దన్నందుకు మానేశాను

తెలుగు టీవీనే కాదు సినిమాలకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లు , ఆడియో వేడుకలు చూసే అలవాటున్న ప్రతిఒక్కరికి సుపరిచితమైన పేరు సుమ. ప్రతిఇంట్లో అందరి హృదయాల్లో తను అలా చొచ్చుకువచ్చిన తీరు అమోఘం. పుట్టింది కేరళనే అయినప్పటికీ స్వచ్చమైన తెలుగుతనానికి ప్రతీకగా ఉండే సుమ ఇప్పటిదాకా ఎన్ని ప్రోగ్రాములు చేసిందో ఎన్ని రికార్డులు సృష్టించిందో తనకు కూడా ఖచ్చితంగా తెలియకపోవచ్చు. అంతదాకా ఎందుకు రోజులో కనీసం రెండుసార్లైనా సుమని చూడకుండా టీవీ ఛానల్స్ ని దాటడం కష్టం. అయితే సుమ యాంకరే కాదు మంచి నటి కూడా. దాసరి నారాయణరావు గారు తీసిన కళ్యాణ ప్రాప్తిరాస్తు ద్వారా హీరొయిన్ గా పరిచయమైనా ఎక్కువ కాలం తెరమీద కొనసాగలేకపోయారు.

మలయాళంలో కొన్ని సినిమాలు చేసి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అడపాదడపా తెలుగు మూవీస్ చేసినా వ్యాఖ్యతగా వచ్చిన పేరు ఇంకేది ఇవ్వలేదు. రాజీవ్ కనకాలను పెళ్లి చేసుకోవడం ద్వారా కళాకారుల కుటుంబంలోకి వెళ్ళిపోయిన సుమ ఆ తర్వాత అత్తయ్య లక్ష్మీదేవి, మావయ్య దేవదాస్ కనకాల ఆద్వర్యంలో తనను తాను ఇంకా గొప్పగా మలుచుకుంది. స్వచ్చమైన ఉచ్చారణ కోసం పద్యాలు ప్రాక్టీసు చేయడం, స్వయానా శిక్షకుడైన దేవదాస్ దగ్గర తరగతులు హాజరవడం లాంటివి చాలా మేలు చేశాయి. ఓసారి సుమ చేపలు కొనడానికి మార్కెట్ కు వెళ్ళింది. రోడ్డు మీద నిలబడి ఉండగా ఓ పెద్దాయన అటుగా వెళ్తూ వెనక్కు తిరిగి వచ్చాడు.

సుమతో మాట్లాడుతూ నువ్వు మా బ్రాహ్మల అమ్మాయిలా భావిస్తామని చేపలు తిన్నా పర్లేదు కాని కొనేందుకు మాత్రం రాకని రిక్వెస్ట్ చేశారు. దీంతో దెబ్బకు తనను ఇంతగా అభిమానించే వాళ్ళు ఉన్నారని గుర్తించిన సుమ ఇకపై అటుపై చేపల మార్కెట్ జోలికి వెళ్ళనేలేదట. అభిమానుల ప్రభావం తారల మీద ఉంటుందని చెప్పడానికి ఇంత కన్నా మంచి ఉదాహరణ అక్కర్లేదేమో. లాక్ డౌన్ వల్ల షూటింగులు తగ్గిపోయి, సినిమాల వేడుకలు ఆగిపోయిన వేళ సుమ కనిపించడం తగ్గింది కానీ లేదంటే తన సందడి లేని రోజు ఉంటుందా. వందల కొద్ది షోలు , వేల కొద్ది ఎపిసోడ్లతో రికార్డులు సైతం ఖాతాలో వేసుకున్న సుమకు లేడీస్ లో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అయినా ఇలా తమకు ఇష్టమైన వాళ్ళు ఫలానా పనులు చేయడం నచ్చని అభిమానులు ఉండటం కొంత విచిత్రంగా అనిపించినా అది వాళ్ళ ప్రేమే తప్ప మరొకటి కాదు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp