నాకు హక్కు ఉందంటున్న ఇళయరాజా

By iDream Post Aug. 01, 2020, 06:59 pm IST
నాకు హక్కు ఉందంటున్న ఇళయరాజా

కొన్నేళ్ల క్రితం రాయల్టీ చెల్లించకుండా తాను స్వరపరిచిన పాటలు పాడుకుంటూ లైవ్ కన్సర్ట్స్ చేస్తున్నారని గాయకులు ఎస్పి బాలసుబ్రమణ్యం మీద సంగీత దిగ్గజం ఇళయరాజా నోటీసుల దాకా వెళ్ళిన సంగతి గుర్తేగా. తర్వాత కొంత కాలం ఇద్దరూ ఒకరికొకరు దూరంగా ఉన్నారు. ఏదైనా ప్రోగ్రాం జరిగినప్పుడు బాలు రాజా సాంగ్స్ కాకుండా మిగిలినవి పాడేవాళ్ళు. ఇది జరిగిన టైంలోనే ఇళయరాజా హైదరాబాద్ లో సంగీత కచేరి చేస్తే బాలు లేని ఆ కార్యక్రమం డల్ గా అనిపించింది. అలాగే రాజా పాటలు లేకుండా బాలు చేసినవి కూడా అంతే. అంతగా ఇద్దరి మధ్య అనుబంధం ఉంది. ఆ తర్వాత కొంతకాలానికి ఇద్దరూ రాజీపడిపోయి మళ్ళీ మునుపటిలా స్నేహితులు అయ్యారు.

ఇప్పుడు తాజాగా ఇళయరాజాకు మరో చిక్కు వచ్చి పడింది. చెన్నైలో సుప్రసిద్ధ నటులు దర్శకులు నిర్మాత ఎల్వి ప్రసాద్ కు ఓ రికార్డింగ్ స్టూడియో ఉంది. 1977లో అందులో ఒక భాగాన్ని ఇళయరాజాకు కానుకగా ఇచ్చారు. అప్పటినుంచి తన సినిమాల రికార్డింగులతో పాటు స్వంతంగా ఒక సెటప్ ని అక్కడ రాజా ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ఎల్వి ప్రసాద్ మనవడు సాయి ప్రసాద్ రాజాకు దాని మీద ఎలాంటి హక్కులు లేవని, రాతపూర్వకంగా కానీ గిఫ్ట్ ఇచ్చినట్టుగా ఆధారాలు కానీ ఏవీ లేవని చెబుతూ దాన్ని ఖాళీ చేయవలసిందిగా కోరుతున్నారు. అయితే ఇది తనకే చెందుతుందని 40 ఏళ్ళకు పైగా అందులో రికార్డింగులు చేసుకుంటున్న తనకు అన్ని హక్కులు ఉన్నాయని చెబుతున్నారు ఇళయరాజా.

ఇది మనసులో పెట్టుకునే తన విలువైన సామాగ్రిని ప్రసాద్ మనుషులు ద్వంసం చేశారని రాజా ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి చెన్నై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేశారు. గత ఏడాది సెప్టెంబర్ నుంచి సాయి ప్రసాద్ కు స్టూడియో హక్కు వారసత్వంగా సంక్రమించిందని చెన్నై న్యూస్. రాజాకు మద్దతుగా భాగ్యరాజా, భారతిరాజా లాంటి వాళ్ళు మద్దతు తెలుపుతున్నారు. అయితే సాయి ప్రసాద్ చెబుతున్నట్టు ఇళయరాజా దగ్గర దగ్గర ఎల్వి ప్రసాద్ గారు రాసి ఇచ్చినట్టుగా ఆధారాలు లేకపోతే చట్టపరంగా ఇబ్బందే. ఇప్పుడిది లీగల్ పరిధిలోకి వెళ్ళింది కాబట్టి ఏం జరుగుతుందో వేచి చూడాలి. గత నాలుగు దశాబ్దాలుగా పెద్దగా వివాదాలు లేని ఇళయరాజా కెరీర్లో ఇప్పుడిలాంటివి చోటు చేసుకోవడం విచారకరం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp