5 ఏళ్ళ తర్వాత జై కొట్టించుకున్న 'ఐ'

By iDream Post Aug. 07, 2020, 01:53 pm IST
5 ఏళ్ళ తర్వాత జై కొట్టించుకున్న 'ఐ'

శంకర్ దర్శకత్వంలో చియాన్ విక్రమ్ నటించిన ఐ మనోహరుడు 2015లో ఎంత భారీ అంచనాల మధ్య విడుదలయ్యిందో ఎవరూ అంత సులభంగా మర్చిపోలేరు. ప్రాణాల మీదకు తెచ్చుకునే స్థాయిలో విక్రమ్ దీని కోసం కష్టపడిన తీరు అభిమానులతో ఏకంగా కన్నీళ్లు పెట్టించింది. ఓపెనింగ్స్ కూడా కనివిని ఎరుగని స్థాయిలో భారీగా వచ్చాయి. రిలీజ్ కు ముందు వచ్చిన హైప్, ట్రైలర్, ప్రమోషన్లు, మ్యూజిక్ ఇవన్ని ఓ రేంజ్ లో వసూళ్ళకు దారినిచ్చాయి. అయితే అదంతా రెండునాళ్ళ ముచ్చటే అయ్యింది. ఊహించని విధంగా శంకర్ కథా కథనాలతో నిరాశపరిచాడు. హీరోతో సహా అతను ప్రతీకారం తీర్చుకునే పాత్రలన్నీ మరీ మొహం పక్కకు తిప్పుకునేంత వికృతంగా చూపించడంతో ఫ్యామిలీ ఆడియన్స్ బొత్తిగా దూరమయ్యారు.

మాస్ కి కూడా అందులో వ్యవహారమంతా మరీ అతిగా అనిపించింది. దీంతో ఫైనల్ గా డిజాస్టర్ తప్పలేదు. ఉన్నంతలో తమిళ్ కంటే తెలుగులోనే డీసెంట్ కలెక్షన్స్ వచ్చాయి. అమీ జాక్సన్ అందాలు, సురేష్ గోపి ఫస్ట్ టైం విలనిజం ఇవేవి పనిచేయలేదు. కట్ చేస్తే ఇది ఇప్పటిదాకా టెలికాస్ట్ కాలేదు. ఐదేళ్ళు గడిచాయి. మొన్నే ఆదివారం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం చేశారు. అనూహ్యంగా ఐ 11.1 రేటింగ్ తెచ్చుకుని షాక్ ఇచ్చింది. ఆ మధ్యే వచ్చిన కెజిఎఫ్ ఛాప్టర్ 1కు కూడా ఇంచుమించు ఇదే ఫిగర్ రావడం గమనార్హం. కెజిఎఫ్ థియేటర్స్ లోనే బ్లాక్ బస్టర్ అనిపించుకున్న బొమ్మ. ఐ చూస్తేనేమో దానికి రివర్స్. కాని ఒకే రెస్పాన్స్ వచ్చింది. కారణాలు లేకపోలేదు.

ఐ చూడని వాళ్ళు చాలానే ఉన్నారు. ఆన్ లైన్లో, స్ట్రీమింగ్ యాప్స్ లో ఇప్పటిదాకా అందుబాటులో లేకపోయింది. చూద్దామన్నా యుట్యూబ్ లో తమిళ్ వెర్షన్ ఉంది తప్ప తెలుగు దొరకలేదు. దీంతో ఫస్ట్ టైం వచ్చేసరికి అప్పుడు మిస్ అయినవాళ్ళు హ్యాపీగా చూసేశారు. ఐ హక్కుల కోసం సుమారు 5 కోట్ల రూపాయలు చెల్లించారని టివి సర్కిల్స్ టాక్. ఇప్పుడీ స్థాయిలో స్పందన కంటిన్యూ అయితే పెట్టుబడి ఈజీగా వచ్చేస్తుంది. నిజానికి రిలీజ్ టైంలోనే ఐకు మంచి డీల్స్ వచ్చినప్పుడు భారీ మొత్తాన్ని ఆశించిన నిర్మాతలు అప్పుడు అమ్మలేదు. ఆలస్యం అయిపోయింది కాబట్టి ఇప్పుడు దాని స్థాయికి తగని చిన్న మొత్తంతోనే సర్దుకోవాల్సి వచ్చింది. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి తరహాలో మరీ ఎక్కువ ఆశకు వెళ్ళినప్పుడు ఐ లాంటి సినిమాల విషయంలో ఇలాంటి ఫలితాలే చవిచూడాల్సి వస్తుంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp