భారీ చిత్రాలకు తప్పని లీకుల బెడద

By iDream Post Mar. 04, 2021, 02:31 pm IST
భారీ చిత్రాలకు తప్పని లీకుల బెడద

నిన్న సాయంత్రం హఠాత్తుగా ఆర్ఆర్ఆర్ షూటింగ్ తాలూకు కీలకమైన సన్నివేశాల పిక్స్ లీక్ కావడంతో ఇద్దరు హీరోల అభిమానులు షాక్ తిన్నారు. ఇక యూనిట్ పరిస్థితి ఎలా ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. చాలా ముఖ్యమైనవిగా అనిపించే సీన్స్ లో తీసినట్టుగా అవి కనిపించాయి. రామ్ చరణ్ బ్రిటిష్ సైనికుడి గెటప్, తారక్ నిప్పుతో ఫైట్ చేయడం ఇలా నాలుగైదు షాట్లు అందులో పొందుపరిచారు. వాట్సాప్ తదితర సోషల్ మీడియా గ్రూపుల్లో ఇవి గట్టిగానే తిరిగాయి. మనకే ఇలా అనిపిస్తే నిర్మాత దానయ్య, దర్శకుడు రాజమౌళి, మిగిలిన యూనిట్ సభ్యుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

ఇదే తరహా తలనెప్పి సలార్ కు సైతం వచ్చింది. ఆ మధ్య అవుట్ డోర్ కు వెళ్ళినప్పుడు ప్రభాస్ ఇంట్రో సీన్ తాలూకు బిట్లను ఏకంగా ఎవరో వీడియో తీసి పెట్టారు. అయినా వందల కోట్ల పెట్టుబడులు పెడుతున్న వాళ్ళు షూటింగ్ స్పాట్ లో ఉన్నప్పుడు సెల్ ఫోన్లు అనుమతించకుండా జాగ్రత్తలు తీసుకోలేరా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది కానీ వాస్తవానికి అది మాటల్లో చెప్పుకున్నంత సులువు కాదు. ఎందుకంటే అక్కడ లొకేషన్లో పదుల సంఖ్యలో వందల్లో సభ్యులు ఉంటారు. ఎంత నియంత్రించాలని చూసినా ఆచరణలో అదంత సులభం కాదు. అందుకే ఇలా అప్పుడప్పుడు ఈ లీకుల బారిన పడాల్సి వస్తుంది.

గతంలో బాహుబలి విషయంలోనూ ఇలాగే జరిగింది. అప్పుడు ఏకంగా వీడియోనే బయటికి వచ్చింది. ఓ ముఖ్యమైన ఫైట్ తాలూకు సన్నివేశం డబ్బింగ్ లేకుండా ఆన్ లైన్ లో హల్చల్ చేసింది. వీటిని కట్టడి చేసే ఉద్దేశంతో రాజమౌళి సెల్ ఫోన్స్ ఏవీ అనుమతించకుండా కఠిన చర్యలు తీసుకున్నారనే టాక్ వచ్చింది కానీ ఇప్పుడీ ఆర్ఆర్ఆర్ లీకులు ఎలా బయటికి వచ్చాయనే దాని మీద జక్కన్న టీమ్ అంతర్గతంగా కూడా ఎంక్వయిరీ చేస్తోందట. త్వరలోనే ఇంటి దొంగ దొరికినా ఆశ్చర్యం లేదు. అయినా ఇది నైతిక విలువలకు సంబంధించినది. సదరు టీమ్ సభ్యులే ఇలాంటివి బయటికి పంపుతున్నప్పుడు తప్పా ఒప్పా అని ఆలోచిస్తేనే వీటికి చెక్ పడుతుంది

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp