భర్తనే హత్య చేసిన అందమైన క్రైమ్

By iDream Post Jun. 11, 2021, 12:50 pm IST
భర్తనే హత్య చేసిన అందమైన క్రైమ్
కెరీర్ మొదలుపెట్టింది తెలుగులోనే అయినప్పటికీ హిందీలో సోలో పెర్ఫార్మన్స్ స్కోప్ ఉన్న పాత్రలతో దూసుకుపోతున్న తాప్సీ కొత్త సినిమా హసీన్ దిల్ రుబా. వినీల్ మాతివ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ కొన్ని నెలల క్రితమే థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు. అయితే కరోనా పరిస్థితులు ఏ మాత్రం అనుకూలంగా లేకపోవడంతో కమర్షియల్ గా ఇలాంటి హీరోయిన్ సెంట్రిక్ చిత్రాలకు వసూళ్లు రావడం కష్టం కావడంతో నిర్మాతలు ఓటిటి బాట పడుతున్నారు. అందులో భాగంగానే ఈ హసీన్ దిల్ రుబాని నేరుగా నెట్ ఫ్లిక్స్ ద్వారా జులై 2న విడుదల చేయబోతున్నారు. ఇందాకా ట్రైలర్ ని ఆన్ లైన్ వేదికగా వదిలారు.

చాలా స్ట్రెయిట్ ఫార్వార్డ్ గా అనిపించే రాణి(తాప్సీ)లో గొప్ప అందంతో పాటు పుష్కలమైన తెలివితేటలు ఉంటాయి. తనను బాగా ఇష్టపడి ప్రేమించిన అబ్బాయి(విక్రాంత్ మస్సే)ను పెళ్లి చేసుకుంటుంది. అత్త మామలకు ఈమె నచ్చకపోయినా తన ధోరణిలో తానుంటుంది. ఈలోగా ఓ అగ్ని ప్రమాదం జరిగి రాణి భర్త చనిపోతాడు. హత్యగా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేస్తారు. అనుమానం రాణి మీదకే వెళ్తుంది. విచారణ చేస్తే ఆమెకు మరో యువకుడితో(హర్షవర్ధన్ రానే)తో ఉన్న సంబంధం బయట పడుతుంది. ఈలోగా ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి. అవేంటో తెలియాలంటే ఇంకో ఇరవై రోజులు ఆగాల్సిందే.

ట్రైలర్ ని బట్టి చూస్తే అప్పుడెప్పుడో తెలుగులో వచ్చిన రాజశేఖర్ యమపాశం ఛాయలు కనిపిస్తున్నాయి. అందులో తాను చనిపోయినట్టుగా నటించిన హీరో భార్య గుట్టు కనిపెట్టడానికి రహస్యంగా నిఘా పెడతాడు. ఇందులో కూడా ఆ పాయింట్ కనిపిస్తోంది. మొదట్లో విక్రాంత్ చనిపోయినట్టు చూపించినా ఆ తర్వాత కూడా ఆ పాత్ర ఉన్నట్టు అనిపిస్తోంది. మొత్తానికి ఆసక్తి రేగేలా క్రైమ్ థ్రిల్లర్ ని రూపొందించినట్టు కనిపిస్తోంది. టైటిల్ రోల్ ని మోస్తున్న తాప్సీ మీదే స్టోరీ మొత్తం తిరుగుతోంది. జూలై 2న హిందీతో పాటు తెలుగు డబ్బింగ్ వెర్షన్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. అంచనాలు రేపడంలో ట్రైలర్ సక్సెస్ అయ్యింది
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp