హిట్టు ఫ్లాపులకు చలించను

By iDream Post Aug. 10, 2020, 08:57 pm IST
హిట్టు ఫ్లాపులకు చలించను

చేసింది 7 సినిమాలే. కానీ స్టార్ డైరెక్టర్ గా ఎనలేని గుర్తింపు. సాధారణంగా డెబ్యు మూవీ రవితేజ లాంటి స్టార్ హీరోతో వచ్చినప్పుడు ఏ దర్శకుడైనా కసితో పని చేస్తాడు. హరీష్ కూడా అంతే. కానీ షాక్ రూపంలో ఫలితం అనూహ్యంగా నెగటివ్ వచ్చింది. అయినా చలించకుండ తన మీద నమ్మకంతో మాస్ మహారాజా రెండో అవకాశం మిరపకాయ్ గా ఇచ్చినప్పుడు ఈసారి మాత్రం గురి తప్పలేదు. నేరుగా తగిలింది. సినిమా సూపర్ డూపర్ హిట్. అతని ప్రతిభ గుర్తించిన పవన్ కళ్యాణ్ పిలిచి మరీ గబ్బర్ సింగ్ ఆఫర్ ఇచ్చాడు. తాను దేవుడిలా భావించి అభిమానించే హీరోని డైరెక్ట్ చేసే అవకాశం వస్తే ఎంత ఒత్తిడి ఉంటుందో వేరే చెప్పాలా.

దబాంగ్ రీమేక్ అనే ఫీలింగ్ రాకుండా అద్భుతమైన మార్పులు చేసి బాక్సాఫీస్ దిమ్మదిరిగిపోయే ఇండస్ట్రీ హిట్ ఇచ్చి హరీష్ శంకర్ అనే పేరు మారుమ్రోగిపోయేలా చేసుకున్నాడు. అయితే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మనసుపడి మరీ చేసిన రామయ్య వస్తావయ్యా ఊహించని విధంగా డిజాస్టర్ కావడం మాత్రం ఎలాంటి డైరెక్టర్ కైనా నిరాశ కలిగించేదే. కాని ఇతను అలా తొణకలేదు. ఓడిన చోటే గెలవలన్నా సూత్రాన్ని బాగా ఒంటబట్టించుకున్నాడు. అందుకే అప్ కమింగ్ మెగా హీరో సాయి ధరం తేజ్ తో చేసిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ తిరిగి మళ్ళీ రేస్ లో నిలబెట్టింది.

ఆ తర్వాత అల్లు అర్జున్ డిజే దువ్వాడ జగన్నాధం అద్బుతాలు చేయకపోయినా కమర్షియల్ గా సేఫ్ అయ్యింది. మళ్ళీ కొంత గ్యాప్ తీసుకుని చేసిన గద్దలకొండ గణేష్ మరోసారి హరీష్ స్టామినాని ఋజువు చేసింది. తాజాగా తను దేవుడిలా భావించే పవన్ కళ్యాణ్ తో మరోసారి చేసే అవకాశం రావడం కూడా తన టాలెంట్ కి నిదర్శనం. హిట్ వచ్చినప్పుడు తలకెక్కించుకుని ఫ్లాప్ వచ్చినప్పుడు తల దించుకునే టైపు కాదు కాబట్టే హరీష్ శంకర్ సక్సెస్ కాగలుగుతున్నాడు. తన ఆటిట్యూడ్ గురించి కామెంట్స్ వచ్చినా ఆయన పెద్దగా పట్టించుకోడు. అదే లేకపోతే గబ్బర్ సింగ్ వచ్చేదే కాదట. తనతో ఉండెవాళ్ళకు తాను ఎలాంటి వాడినో తెలుసనీ బయటి నుంచి రాళ్ళు వేసే వాళ్ళకు సమాధానం చెబుతూ కూర్చోలేమని చెప్పే హరీష్ శంకర్ మాటలు నిజంగానే ఇప్పటి యూత్ కు రాబోయే దర్శకులకు అనుసరణీయమే.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp