డిజాస్టర్ల రేటింగ్స్ వెనుక రహస్యం

By iDream Post Jun. 05, 2020, 04:29 pm IST
డిజాస్టర్ల రేటింగ్స్ వెనుక రహస్యం

ఏదైనా సినిమా హిట్టా కాదా అనేది తేల్చిచెప్పేది బాక్స్ ఆఫీసే. ఇందులో ఇంకో ఆర్గుమెంట్ కు అవకాశం లేదు. ప్రేక్షకులు తిరస్కరించారు అంటే దానికి వేదిక థియేటరే తప్ప వేరొకటి కాదు. కానీ ఇటీవలి కాలంలో టికెట్ కౌంటర్ల దగ్గర దారుణమైన ఫలితాలు అందుకున్న చిత్రాలు బుల్లితెరపై అదేనండి టీవీలో అదిరిపోయే రేటింగ్స్ తెచ్చుకోవడం అందరికీ షాక్ కలిగిస్తోంది . దానికి ఉదాహరణగా గత ఏడాది విడుదలైన వినయ విధేయ రామను తీసుకొచ్చు. ఇప్పటి దాకా ఇది 8 సార్లు టెలికాస్ట్ అయ్యింది. ఇటీవలి ప్రసారంలో ఏకంగా 7.97 రేటింగ్ తెచ్చుకుని మతులు పోగొట్టింది. ఇది 2020లో వచ్చిన కొత్త సినిమా విశ్వక్ సేన్ హిట్ కంటే ఎక్కువ.

నిజానికి వినయ విధేయ రామ సోషల్ మీడియా అత్యధికంగా ట్రోలింగ్ కు గురైన మూవీ. బోయపాటి శీను టేకింగ్ మీద ఇప్పటికీ కామెడీలు చేసుకుంటూనే ఉంటారు. మరి ఛానల్ లో పదే పదే ప్రసారం చేస్తున్నా దీనికి ఎలా రేటింగ్ వస్తోందనే అనుమానం కలగడం సహజం. నిజానికి ఇందులో ఉన్న ఓవర్ హీరోయిజంతో పాటు అర్థం లేని యాక్షన్ ఎపిసోడ్లు మాస్ కి సైతం నచ్చలేదు. ఇలాగే గతంలో పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సైతం మొదటిసారి ప్రసారమైనప్పుడు 14 పైగా రేటింగ్ తెచ్చుకుని షాక్ ఇచ్చింది. ఇక్కడ రహస్యం ఒకటే. లాక్ డౌన్ వల్ల ఇంట్లోనే ఉన్న ప్రేక్షకులకు కొత్త సినిమాల కొరత వల్ల ఇలాంటివి ఎన్నిసార్లు వేసినా పదే పదే చూసేందుకు మొహమాటపడటం లేదు. అలా అని రేటింగ్స్ వచ్చిన ప్రతి సినిమాను సూపర్ అనడానికి లేదు.

ఆ మాటకొస్తే సంక్రాంతి బ్లాక్ బస్టర్ సరిలేరు నీకెవ్వరు టీవీ రేటింగ్స్ లో ఏకంగా బాహుబలిని దాటేసి టాప్ 1 పొజిషన్ ను అందుకుంది. మరి ఇదీ ప్రామాణికంగా తీసుకుంటే కలెక్షన్లలో కూడా దాన్ని దాటేసి ఉండాలి కదా. అలా జరగలేదు. కేవలం చిన్నితెరపై మాత్రమే ఆ ఘనతను దక్కించుకుంది. కాని బాహుబలి అలా కాదు. అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా అన్ని చోట్లా తన ప్రభంజనం కొనసాగించింది. దాన్ని జెన్యూన్ హిట్ గా పరిగణించవచ్చు. కానీ ఇలా కేవలం టీవీలలో టికెట్ ఖర్చు లేకుండా జనం చూసే సినిమాలకు రేటింగ్ ని బట్టి దాని ఫైనల్ స్టేటస్ ని డిసైడ్ చేయలేం. అందులోనూ ప్రతి డిజాస్టర్ కు ఇలాంటి స్పందనే ఉండదు. కొన్నింటికి అలా కలిసి వస్తాయి.వీటిలో హీరో ఇమేజ్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఏది ఎలా ఉన్నా సదరు హీరోల ఫ్యాన్స్ మాత్రం మాకింత రేటింగ్స్ వచ్చాయంటే మాకింత వచ్చాయని సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp