ఛాయస్ మార్చుకున్న యూత్ హీరో ?

By iDream Post Apr. 07, 2021, 03:30 pm IST
ఛాయస్ మార్చుకున్న యూత్ హీరో ?
సురేందర్ రెడ్డి లాంటి అగ్ర దర్శకులకు ఎన్నో కథలు ఇచ్చి అవి బ్లాక్ బస్టర్స్ కావడంలో కీలక పాత్ర పోషించిన వక్కంతం వంశీ 2018లో అల్లు అర్జున్ హీరోగా నా పేరు సూర్యతో దర్శకుడిగా డెబ్యూ చేసిన సంగతి తెలిసిందే. అది ఎంత పెద్ద డిజాస్టర్ అంటే బన్నీ ఏకంగా ఏడాది గ్యాప్ తీసుకోవాల్సి వస్తే వంశీకి రెండో ఛాన్స్ ఇచ్చే సాహసం ఎవరూ చేయలేకపోయారు. అయినా కూడా స్టోరీ రైటర్ గా తన డిమాండ్ ని ఎప్పటిలాగే కొనసాగిస్తున్న వక్కంతం వంశీ తన రెండో సినిమాను మాస్ మహారాజా రవితేజతో చేయాలని గట్టి ప్రయత్నమే చేశాడు. కిక్ రచయితగా ఇతని మీద రవితేజకు మంచి గురి ఉంది. కానీ ఎందుకనో కదలిక మాత్రం రాలేదు.

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఇప్పుడు వక్కంతం వంశీ తన ఆప్షన్ ని నితిన్ కు షిఫ్ట్ చేసుకున్నట్టుగా తెలిసింది. ఇటీవలే కలిసి వినిపించిన కథ నచ్చడంతో ఫైనల్ స్క్రిప్ట్ అయ్యాక లాక్ చేద్దామని అనుకున్నట్టు సమాచారం. అయితే అధికారిక ప్రకటన మాత్రం ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు. ఈ ఏడాది నితిన్ ఇప్పటికే రెండు సినిమాలతో పలకరించాడు. చెక్ ఘోరంగా దెబ్బ తినగా రంగ్ దే సైతం అంచనాలను పూర్తి స్థాయిలో అందుకోలేకపోయింది. అందుకే ఇప్పుడు ఆశలన్నీ మ్యాస్ట్రో మీదే పెట్టుకున్నాడు. జూన్ 11న ఇది రిలీజ్ కాబోతోంది. సాధ్యమైతే 2021లోనే నాలుగో సినిమా కూడా తేవాలని నితిన్ ప్లాన్ గా కనిపిస్తోంది.

అయితే వీటికన్నా ముందు ప్రకటించిన పవర్ పేట గురించి మాత్రం ఎందుకో ఎలాంటి న్యూస్ రావడం లేదు. రౌడీ ఫెలో- చల్ మోహనరంగా ఫేమ్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందబోయే రెండు భాగాల భారీ బడ్జెట్ సినిమాని టెంపరరీగా పక్కపెట్టినట్టు ఫిలిం నగర్ టాక్. నిజమా కాదా అనేది తెలియాల్సి ఉంది. స్పీడ్ గా మూవీస్ అయితే చేస్తున్నాడు కానీ నితిన్ కు భీష్మ తర్వాత మళ్ళీ బ్రేకులు పడ్డాయి. సరైన కథ దర్శకుడి కాంబినేషన్ సెట్ కావడం లేదు. ఈ నేపధ్యంలో వక్కంతం వంశీ ఎలాంటి కథతో మెప్పించాడో వేచి చూడాలి. పూర్తి వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది.
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp