అడ‌వి రాముడు నుంచే ఫ్యాన్స్ గోల‌

By G.R Maharshi Apr. 02, 2021, 11:32 am IST
అడ‌వి రాముడు నుంచే ఫ్యాన్స్ గోల‌

క‌ర్నాట‌క‌లో యువ‌ర‌త్న థియేట‌ర్‌లో ట‌పాసులు కాల్చిన వీడియో చూసి భ‌య‌మేసింది. సీట్ల‌కి తొంద‌ర‌గా మండే (రెగ్జిన్ వ‌ల్ల‌) స్వ‌భావం వుంటుంది. తేడా వ‌స్తే ప్రాణ న‌ష్టం జ‌రిగేది. నిజానికి వాళ్లంద‌ర్నీ జైల్లో పెట్టాలి. పునీత్‌రాజ్‌కుమార్ ఫ్యాన్స్ ఓట్లు కూడా ముఖ్యం కాబ‌ట్టి ఆ ప‌ని చేయ‌రు. చ‌ట్టాల్ని ప‌నిచేయ‌కుండా చూడ‌డ‌మే నాయ‌కుల ప‌ని.

సినిమా అభిమానం ఇప్ప‌టిది కాదు. మా చిన్న‌ప్పుడు NTR, ANR అభిమానులు కొట్టుకున్న సంద‌ర్భాలున్నాయి. ఇక థియేట‌ర్‌లో అల్ల‌రి మామూలే. అయితే హాల్లో ఈల‌లు, చ‌ప్ప‌ట్లు , క‌టౌట్స్‌కి పూల దండ‌లు ఇక్క‌డితో ఆగేది. 1977లో అడ‌విరాముడు సినిమాతో పిచ్చి ప‌రాకాష్ట‌కు చేరింది. బుడ‌గ‌లు వ‌ద‌ల‌డం, స్క్రీన్ మీద‌కి చిల్ల‌ర నాణాలు విస‌ర‌డం మొద‌లైంది. ఆరేసుకోబోయి పారేసుకున్నాను పాట వ‌స్తే కాయిన్స్ ఘ‌ల్ల‌ని మోగేవి. ముంద‌రి క్లాస్‌లో ఏరుకోడానికి తొక్కిస‌లాట జ‌రిగేది. అవి త‌గిలి కొంద‌రి త‌ల‌ల‌కి బొప్పె క‌ట్టేది. జేబులోంచి రూపాయి తీసే అల‌వాటు లేని మా మిత్రుడు గౌస్ NTR క‌నిపిస్తే చిల్ల‌ర విసిరేవాడు. వాడిప్పుడు క‌ల్తీ నిరోధ‌క శాఖ‌లో ఉన్నాడు.

ఇంకో మిత్రుడు వుండేవాడు. అత‌నూ NTR పిచ్చోడే. లాయ‌ర్ విశ్వ‌నాథ్ అనే సినిమా అనంత‌పురం త్రివేణి టాకీస్‌లో (1978, న‌వంబ‌ర్‌) వ‌చ్చింది. ఇద్ద‌రం ఉద‌యాన్నే థియేట‌ర్‌కి వెళ్లాం. పెద్ద పూల దండ కొని థియేట‌ర్ వ‌ర్క‌ర్‌కి ఇస్తే వాడు చ‌చ్చి చెడి NTR క‌టౌట్‌కి త‌గిలించాడు. అంత‌టితో అత‌ని అభిమానం చ‌ల్లార‌లేదు. నీలం టాకీస్ ద‌గ్గ‌రికి వెళ్లి ఒక క్యాన్‌లో 10 లీట‌ర్ల పాలు తెచ్చాడు. ఈ సారి తానే స్వ‌యంగా రూప్ ఎక్కి క‌టౌట్‌కి పాలాభిషేకం చేశాడు. కాంపౌండ్ అంతా ఒక‌టే పాల వాస‌న‌. ఆ జిడ్డులో జారి న‌లుగురైదుగురు ప‌ల్టీలు కూడా కొట్టారు. అదో కామెడీ. NTR వీరాభిమానిగా ఉన్న ఆయ‌న త‌ర్వాతి రోజుల్లో కాంగ్రెస్ త‌ర‌పున మున్సిప‌ల్ చైర్మ‌న్ కూడా అయ్యారు. అభిమానం వేరు, రాజ‌కీయం వేరు.

ANR అభిమానులు కూడా ఇదే రేంజ్‌లో ఉండేవారు. శాంతి టాకీస్ బ‌య‌ట నిల‌బ‌డి ప్రేమాభిషేకం టికెట్లు తామే కొని House full బోర్డు పెట్టించేవాళ్లు. అభిమానులు ప‌ర‌స్ప‌రం తొడ‌లు కొట్టుకుంటున్న‌ప్పుడు హీరోలిద్ద‌రూ క‌లిసి చాణ‌క్య చంద్ర‌గుప్త‌, రామ‌కృష్ణుడు అనే సినిమాలు తీశారు. ఇరు వ‌ర్గాలు వేర్వేరుగా అభిమానం చాటుకునే వాళ్లు. NTR క‌నిపిస్తే వాళ్లు , ANR వ‌స్తే వీళ్లు ఈల‌లు వేసేవాళ్లు. కృష్ణ‌, శోభ‌న్‌ల‌కి అంత లేదు కానీ, చిరంజీవితో ఇది పూర్తిగా ముదిరింది. ఇంత కాలం థియేట‌ర్ బ‌య‌ట కాల్చేవాళ్లు. ఇప్పుడు లోప‌లే ట‌పాసులు కాలుస్తున్నారు. కొత్త సంస్కృతి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp