దూకుడు పెంచుతున్న నెట్ ఫ్లిక్స్

By iDream Post Jun. 30, 2020, 02:37 pm IST
దూకుడు పెంచుతున్న నెట్ ఫ్లిక్స్

నిన్న డిస్నీ హాట్ స్టార్ తన ఓటిటి ద్వారా నేరుగా విడుదల చేయబోయే కొత్త సినిమాల ప్రకటన బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మల్టీ ప్లెక్స్ హోమ్ డెలివరీ పేరుతో మొదలుపెట్టిన ప్రమోషన్ బాగా వైరల్ అవుతోంది. ట్విట్టర్ వేదికగా దీని గురించి మిశ్రమ స్పందన వస్తున్నప్పటికీ మొత్తానికి డిజిటల్ స్ట్రీమింగ్ ఏ స్థాయిలో చొచ్చుకుపోతోందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు తాజాగా నెట్ ఫ్లిక్స్ కూడా రంగంలోకి దిగబోతోంది. థియేటర్లకు వెళ్ళకుండా తమ ద్వారా రిలీజయ్యే చిత్రాలకు గ్రౌండ్ సిద్ధం చేస్తోంది. ఇందులో ప్రధానంగా మూడు సినిమాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

అమితాబ్ బచ్చన్ నటిస్తున్న 'ఝున్డ్' అందులో మొదటిది. మరాఠిలో సైరాత్ రూపంలో ఇండస్ట్రీ హిట్ నమోదు చేసి మొత్తం ఇండస్ట్రీని తనవైపు తిప్పుకునేలా చేసిన నాగరాజ్ మంజులే దీనికి దర్శకుడు. స్లమ్ ఏరియాలో పిల్లలకు ఫుట్ బాల్ నేర్పించి వాళ్ళను సాకర్ స్థాయికి తీసుకెళ్లే కోచ్ గా బిగ్ బి ఇందులో చాలా డిఫరెంట్ పాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం ఇది పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. ఎమోషన్స్ ని అద్భుతంగా చూపిస్తాడని పేరున్న నాగరాజ్ ఝున్డ్ ని సైతం అదే స్థాయిలో తీర్చిదిద్ది ఉంటారన్న అంచనాలు ఉన్నాయి. రెండోది అభిషేక్ బచ్చన్ హీరోగా చేసిన 'లూడో'. ఇది కూడా ఒకరకమైన గేమ్ డ్రామా లాంటిది. విలక్షణ చిత్రాలు తీస్తాడని పేరున్న అనురాగ్ బసు దీనికి డైరెక్టర్. రాజ్ కుమార్ రావు, ఫాతిమా, ఆదిత్య రాయ్, పంజక్ త్రిపాఠి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ది బిగ్ బుల్ తో పాటు ఓటిటికి రెడీ అవుతున్న అభిషేక్ బచ్చన్ రెండో సినిమా ఇది.

ఇక మూడోది కియారా అద్వానీ టైటిల్ రోల్ చేసిన 'ఇందూ కి జవానీ'. అబీర్ సేన్ గుప్తా డైరెక్టర్ గా వ్యవహరించిన ఈ మూవీని న్యూ ఏజ్ రామ్ కామ్ క్యాటగిరీలో రూపొందించారు. వినయ విధేయ రామ-భరత్ అనే నేనులతో తెలుగు వాళ్లకూ పరిచయమున్న బ్యూటీ కావడంతో మనవాళ్ళూ దీని మీద ఓ కన్నేసే అవకాశం లేకపోలేదు. మొత్తానికి స్టార్లు ఉన్న సినిమాలనే నెట్ ఫ్లిక్స్ టార్గెట్ చేస్తూ వీక్షకులను పెంచుకునే పనిలో బిజీగా ఉంది. ఇప్పుడీ పరిణామాలు చూస్తుంటే బాలీవుడ్ పెద్దలు థియేటర్ల మీద ఈ ఏడాది పూర్తిగా ఆశలు వదులుకున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే అధికారికంగా 15 దాకా నేరుగా డిజిటల్ రిలీజ్ కు రెడీ అయిపోయాయి. ఇంత పెద్ద నెంబర్ ఎవరూ ఊహించనిది. ఇది ఇక్కడితో ఆగదని మరిన్ని ప్రకటనలు చూడాల్సి వస్తుందని విశ్లేషకుల అంచనా.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp