Puneeth Rajkumar : వెలకట్టలేని కన్నడ పవర్ స్టార్ అభిమానుల ప్రేమ

By iDream Post Dec. 07, 2021, 10:44 am IST
Puneeth Rajkumar : వెలకట్టలేని కన్నడ పవర్ స్టార్ అభిమానుల ప్రేమ

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చనిపోయి నెల దాటేసింది. ఇవాళ ముప్పై తొమ్మిదో రోజు. మాములుగా ఇప్పుడున్న మెకానికల్ ప్రపంచంలో స్వంత వాళ్ళు పోతేనే పది రోజుల తర్వాత ఎవరి జీవితంలో వాళ్ళు బిజీ అయిపోతున్నారు. అలాంటిది ఒక సినిమా స్టార్ కోసం అభిమానులు ఇంకా అదే జ్ఞాపకాలలో ఉండటం మాత్రం అరుదు. ఆ అదృష్టం పునీత్ కు దక్కింది. తనను సమాధి చేసిన కంఠీరవ స్టేడియంకు జనం వస్తూనే ఉన్నారు. మొన్న ఆదివారం ఒక్క రోజే కాస్త అటుఇటుగా 40 వేల మంది సందర్శన కోసం వచ్చారని పోలీసుల అంచనా. ఇన్ని రోజులు దాటుతున్నా అక్కడ బందోబస్తు ఏర్పాటు చేయాల్సి రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

కారణం ఏదైనా పునీత్ మరణాన్ని కన్నడిగులు ఇంకా మర్చిపోవడం లేదని చెప్పడానికి ఇంత కన్నా సాక్ష్యం అక్కర్లేదు. ఇతని చివరి సినిమా జేమ్స్ ని విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మార్చిలో రానున్న పుట్టినరోజును పురస్కరించుకుని రిలీజ్ అయ్యేలా ప్లానింగ్ చేసుకుంటున్నారు. చనిపోయేనాటికి ఇంకా డబ్బింగ్ కాకపోవడంతో పునీత్ కు బదులు అన్నయ్య శివ రాజ్ కుమార్ తో చెప్పించేందుకు రంగం సిద్ధమయ్యింది. శాండల్ వుడ్ చరిత్రలో ఏ సినిమాకూ దక్కని గౌరవం జేమ్స్ కు ఉంటుందని పరిశీలకుల అంచనా. మూవీ ఎలా ఉన్నా ప్రతిఒక్కరు చూస్తారని బల్లగుద్ది చెబుతున్నారు.

మొత్తానికి తాను లేకపోయినా చిరంజీవినే అని ఋజువు చేసుకుంటున్నారు పునీత్. ఇతని డ్రీమ్ ప్రాజెక్ట్ గా భావించిన గంధద గుడి టీజర్ కూడా నిన్న వచ్చేసింది. ఈ ప్రాజెక్ట్ ని పునీత్ పూర్తి చేశారా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. గతంలో రాజ్ కుమార్, విష్ణువర్ధన్, శంకర్ నాగ్ లాంటి ఉద్దండులు కాలం చేసినప్పుడు కూడా జనం తీవ్ర భావోద్వేగాలకు గురయ్యారు కానీ పునీత్ మాత్రం వాళ్లకు భిన్నంగా నిలుస్తున్నాడు. చిన్న వయసులోనే కాలం చేయాల్సి రావడం అన్న సానుభూతి కన్నా సమాజానికి ఎంతో మేలు చేస్తున్న ఒక మంచి వ్యక్తిని దేవుడు ఇలా అన్యాయంగా తీసుకుపోవడం గురించే ప్రతి ఒక్క హృదయం తల్లడిల్లుతోంది

Also Read : Pushpa Trailer : ఎర్రచందనం దోపిడీలో దొంగల దందా

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp