రెడీ అవుతున్న సామ్ వెబ్ సిరీస్

By iDream Post May. 04, 2021, 01:30 pm IST
రెడీ అవుతున్న సామ్ వెబ్ సిరీస్
అమెజాన్ ప్రైమ్ లో అతి పెద్ద హిట్స్ లో ఒకటిగా నిలిచిన ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ గత కొంత కాలంగా ఊరిస్తూ ఎట్టకేలకు వేసవిలో వినోదం పంచేందుకు ముస్తాబవుతోంది. నిజానికిది ఫిబ్రవరిలోనే రావాల్సింది. అయితే తాండవ్ విషయంలో రేగిన వివాదాలతో వెనక్కు తగ్గిన ప్రైమ్ ఇందులో కూడా ఏమైనా అభ్యంతరం కలిగించే కంటెంట్ ఉందేమోనన్న ఉద్దేశంతో వెనుకడుగు వేసి సెల్ఫ్ సెన్సార్ కు పూనుకుంది. ఇదంతా జరిగి రెండు నెలలు దాటేసింది. అయినా కూడా ఇప్పటిదాకా కొత్త డేట్ ఇవ్వలేదు. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఈ సిరీస్ జూన్ లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరికొద్ది రోజుల్లో డేట్ ప్రకటిస్తారు.

సమంతా మొదటి సారి నటించిన డిజిటల్ డెబ్యూ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. టైటిల్ రోల్ పోషించింది మనోజ్ బాజ్ పాయే అయినప్పటికీ కథ ప్రకారం సామ్ క్యారెక్టర్ చాలా కీలకంగా ఉండబోతున్నట్టు తెలిసింది. భారతదేశంలో విధ్వంసానికి పూనుకునే తీవ్రవాదిగా తన పాత్ర ఊహించని మలుపులతో సాగుతుందట. ప్రియమణి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఫ్యామిలీ మ్యాన్ 2ని సినిమాతో సమానంగా ఇంకా చెప్పాలంటే దాని కంటే ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కించారు. సోషల్ మీడియాలో ట్రెండ్ ని బట్టి దీనికి ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు

థియేటర్లు మూతబడి అధిక శాతం జనం ఇంట్లోనే టైం పాస్ చేస్తున్న తరుణంలో మరోసారి ఓటిటి రంగానికి టైం కలిసి వస్తోంది. దానికి తగ్గట్టే కంటెంట్ ప్లానింగ్ లో సదరు సంస్థలు బిజీగా ఉన్నాయి. కరోనా సెకండ్ వేవ్ ఎప్పటి దాకా ఉంటుందో ఇంకా క్లారిటీ లేదు కాబట్టి ఉన్నన్ని రోజులు వీటికి పండగే. అందులోనూ గత ఏడాది నుంచి సామాన్య ప్రేక్షకులు సైతం వెబ్ సిరీస్ లకు అలవాటు పడ్డారు. యాడ్స్ గోల లేకుండా ఎప్పుడైనా పూర్తి చేసుకునే వెసులుబాటు ఉండటంతో క్రమంగా వీటికి ఆదరణ పెరుగుతోంది. ఫ్యామిలీ మెన్ 2 కనక అంచనాలు చేరుకోగలిగితే మిర్జా పూర్ రికార్డును క్రాస్ చేయడం చాలా ఈజీ
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp