ఇంట్లోకి హంతకుడు వస్తే

By iDream Post Jul. 22, 2021, 02:54 pm IST
ఇంట్లోకి హంతకుడు వస్తే

గత ఏడాది ఆహాలో విడుదలైన కలర్ ఫోటోతో పేరు తెచ్చుకున్స్ సుహాస్ ప్రధానపాత్రలో రూపొందిన కొత్త సినిమా ఫ్యామిలీ డ్రామా. మెహెర్ తేజ్ దర్శకత్వంలో ఛస్మా-నూతన భారతి ఫిలిమ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ ట్రైలర్ ని ఇందాక విడుదల చేశారు. షూటింగ్ జరుగుతున్న టైంలో ఎలాంటి సౌండ్ చేయకుండా గుట్టు చప్పుడు కాకుండా పూర్తి చేసుకున్న ఈ చిత్రం టైటిల్ ని బట్టి ఇదేదో సకుటుంబ సమేతంగా చూసే సినిమా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇప్పుడు వదిలిన వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ ఇచ్చేశారు. థ్రిల్లర్ జానర్స్ ని ఇష్టపడేవాళ్ళను టార్గెట్ చేసినట్టు స్పష్టమవుతోంది.

సరదాగా నవ్వుతు పైకి అమాయకంగా కనిపించే ఓ యువకుడు(సుహాస్ ) కూల్ గా మర్డర్లు చేస్తూ అనూహ్యమైన పరిస్థితుల్లో ఓ ఇంట్లో అడుగు పెడతాడు. అక్కడేమో ఆ కుటుంబ సభ్యుల్లో ఒకరికి మరొకరికి మనస్పర్థలు ఉంటాయి. తండ్రి కొడుకులు అమ్మా కూతుళ్లు అత్తా కోడళ్ళు ఇలా ఏ వరస చూసుకున్నా ఏదో సూటిపోటి మాటలతో నిత్యం గొడవ పడుతూనే ఉంటారు. అప్పుడు ప్రవేశిస్తాడు ఈ కిల్లర్. రాబోయే ప్రమాదాన్ని ఊహించని ఆ ఫ్యామిలీ అతని రమ్మంటారు. దీంతో అసలైన క్రైమ్ డ్రామా అప్పుడు మొదలవుతుంది. నరాలు తెగే ఉత్కంఠతో దినదిన గండంగా ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది సినిమాలో చూడాలి

కోల్డ్ బ్లడెడ్ మర్డరర్ గా సుహాస్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. పాత్రను తీర్చిదిద్దిన తీరు కూడా వైవిధ్యంగా ఉంది. ఎప్పుడో పాతికేళ్ల క్రితం ప్రకాష్ రాజ్ ఇలాంటి క్యారెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి తీసిన గన్ షాట్ లో చేశారు కానీ అప్పుడంతగా జనానికి ఇది కనెక్ట్ కాలేదు. కానీ ఫ్యామిలీ డ్రామాలో న్యూ జనరేషన్ కు తగ్గట్టు ట్రీట్మెంట్ ని డిజైన్ చేసి కొత్తగా చూపించారు. అజయ్ సంజయ్ సంగీతం అందించగా వెంకట్ ఆర్ శాఖమూరి ఛాయాగ్రహణం సమకూర్చారు. త్వరలో రిలీజ్ కానున్న ఫ్యామిలీ డ్రామా విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. బడ్జెట్ సినిమాలతో బిజీగా మారిన సుహాస్ లో కొత్త షేడ్ ని ఇందులో చూపించబోతున్నారు

Also Read: సార్పట్ట పరంపర రివ్యూ

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp