దృశ్యం 2 సినిమా రిపోర్ట్

By iDream Post Feb. 19, 2021, 10:28 am IST
దృశ్యం 2  సినిమా రిపోర్ట్

ఆరేళ్ళ క్రితం వచ్చిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ దృశ్యంకి కొన్ని నెలల వెనుక సీక్వెల్ ప్రకటించగానే ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఒకరిద్దరు తప్పించి క్యాస్టింగ్ మొత్తం మొదటి భాగం వాళ్లనే రిపీట్ చేయడంతో అంచనాలు పెరిగాయి. అందులోనూ ట్రైలర్ మంచి హైప్ తీసుకొచ్చింది. నిన్న రాత్రి నుంచే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ లోకి వచ్చేసిన దృశ్యం 2 ని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రేక్షకులు చూశారని సోషల్ మీడియా ట్రెండింగ్ ని బట్టి అర్థమవుతోంది. మోహన్ లాల్, మీనా ప్రధాన జంటగా నటించిన దృశ్యంని గతంలో వెంకటేష్ రీమేక్ చేసి సక్సెస్ అందుకోవడం చూశాం. మరి ఈ సీక్వెల్ ఎలా ఉందో సింపుల్ రివ్యూలో చూసేద్దాం

ఇది దృశ్యం ఫస్ట్ పార్ట్ ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే కంటిన్యూ చేశారు. జార్జ్ కుట్టి(మోహన్ లాల్) శవాన్ని పోలీస్ స్టేషన్ లో పాతిపెట్టి నిర్దోషిగా బయట పడ్డాక స్వంతంగా థియేటర్ కట్టుకుని మంచి స్థాయికి చేరుకుంటాడు. ఓ సినిమా తీయాలనే లక్ష్యంతో తనే స్వంతంగా ఒక కథ రాసి స్క్రిప్ట్ తయారు చేయిస్తూ ఉంటాడు. అయితే ఇదంతా భార్య(మీనా)కు ఇష్టం ఉండదు. జార్జ్ కుట్టి మీద ఓ కన్నేసిన పోలీసులకు ఊహించని పరిస్థితుల్లో శవం తమ స్టేషన్ కింద పునాదుల్లోనే ఉందని తెలిసిపోతుంది. దీంతో అతన్ని మళ్ళీ అరెస్ట్ చేస్తారు. అక్కడ నుంచి మొదలవుతుంది అసలు థ్రిల్లింగ్ డ్రామా. జార్జ్ కుట్టి ఈ చక్రవ్యూహం నుంచి ఎలా బయటపడ్డాడు అనేదే కథ.

మొదటి 40 నిముషాలు మినహాయించి దృశ్యం 2 అంచనాలకు తగ్గట్టే సాగింది. ముఖ్యంగా చివరి గంట దర్శకుడు జీతూ జోసెఫ్ కొత్త ట్విస్టులతో ఉక్కిరి బిక్కిరి చేసి చక్కని ముగింపు ఇస్తాడు. ఎక్కువ వివరణ ఇస్తే అసలు ట్విస్టు తెలిసిపోతుంది కాబట్టి విశ్లేషణ లోతుల్లోకి వెళ్లడం లేదు. అయితే అందరికీ తెలిసిన క్యారెక్టర్లను ఫస్ట్ హాఫ్ లో అంతసేపు ఎస్టాబ్లిష్ చేయడం కొంత బోర్ కొట్టిస్తుంది. దృశ్యం మొదటి భాగంలో ఉన్నంత ఇంటెన్సిటీ, థ్రిల్స్ మోతాదు ఇందులో కాస్త తగ్గినప్పటికీ ఫైనల్ గా సంతృప్తిగా ప్రేక్షకులు ఫీలవ్వడంలో జీతూ జోసెఫ్ సక్సెస్ అయ్యాడు. ఊహించినట్టే మోహన్ లాల్ వన్ మ్యాన్ షోగా అదరగొట్టేశాడు. సంగీతం, క్యాస్టింగ్ తమ పాత్రను సమర్ధవంతంగా పోషించడంతో ప్రైమ్ కు మరో ఓటిటి సూపర్ హిట్ వచ్చినట్టే

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp