ముత్యాల్లాంటి అనుభవాలు ఎన్నో

By iDream Post Aug. 18, 2020, 06:57 pm IST
ముత్యాల్లాంటి అనుభవాలు ఎన్నో

తెలుగు సినిమా ప్రస్థానంలో సెంటిమెంట్ చిత్రాలతో గొప్ప పేరు తెచ్చుకున్న అతికొద్ది దర్శకుల్లో ముత్యాల సుబ్బయ్య ఒకరు. క్లాసు మాస్ తేడా లేకుండా అందరి గుండెలు తడి చేసేలా హృద్యమైన కథలు తెరకెక్కించడంలో ఆయన నేర్పు వేరు. చిరంజీవి లాంటి అల్ట్రా మాస్ మెగాస్టార్ ని ఐదుగురు చెల్లెళ్ళకు అన్నయ్యగా చూపించి మెప్పించడం సుబ్బయ్యకే చెల్లింది. అదే చిరుతో అన్నయ్య రూపంలో నవ్వులు పూయించడం బ్లాక్ బస్టర్ సక్సెస్ అందించింది. అలా అని ఆయన వీటికే పరిమితం కాలేదు. కెరీర్ ప్రారంభంలో టి కృష్ణ స్ఫూర్తితో శిష్యరికంలో నవ భారతం, ధర్మయుద్ధం, నేటి చరిత్ర, ఎర్ర మందారం లాంటి ఎన్నో సామాజిక స్పృహ కలిగిన సినిమాలు చేసి అభ్యుదయంలోనూ తనదైన ముద్రవేశారు.

బాలకృష్ణతో ఇన్స్ పెక్టర్ ప్రతాప్, కృష్ణబాబు, వెంకటేష్ తో పవిత్ర బంధం-పెళ్లి చేసుకుందాం లాంటి ఆల్ టైం హిట్స్ ఆయన ఖాతాలో చాలానే ఉన్నాయి. గోపీచంద్ ని హీరోగా తొలివలపుతో లాంచ్ చేసింది సుబ్బయ్య గారే. సరైన మార్కెటింగ్ లేకపోవడం వల్ల అది జనానికి చేరలేకపోయింది. పవన్ కళ్యాణ్ రెండో సినిమా గోకులంలో సీతలో హీరో ఇమేజ్ కి భిన్నంగా పవర్ స్టార్ ని డిఫరెంట్ గా చూపించడం అప్పట్లో ఓ షాక్. హాస్య చిత్రాలలోనూ ముత్యాల సుబ్బయ్య గారు తనదైన మార్కు చూపించేవారు. మామగారులో ఎంత ఎమోషన్ ఉన్నా మంచి ఎంటర్ టైన్మెంట్ కూడా ఉంటుంది. పర్వతాలు పానకాలు ప్రేక్షకులను తెగ నవ్వించింది.

2008లో ఆలయం తర్వాత ఆయన దర్శకత్వానికి దూరమయ్యారు. బడ్జెట్ సినిమాలు చేస్తే వాటిని నిర్మాతలు సరైన థియేటర్లలో విడుదల చేయకపోవడంతో అవి ఫ్లాప్ ముద్రవేసుకోవడంతో సుబ్బయ్య గారికి ఆసక్తి సన్నగిల్లింది. ఒక్క నాగార్జునతో తప్ప తెలుగులో సీనియర్ అగ్రహీరోలందరితోనూ సినిమాలు చేసిన అనుభవం ఆయనది. రాజశేఖర్, మోహన్ బాబు, ఉపేంద్రలాంటి స్టార్లతోనే కాక అక్కినేని నాగేశ్వర్ రావు గారితోనూ చిత్రాలు రూపొందించారు. ఎప్పుడు అసభ్యత చోటివ్వకుండా జానర్ ఏదైనా సకుటుంబ సపరివార సమేతంగా చిత్రాలు తీయడంలో పేరు తెచ్చుకున్న ముత్యాల సుబ్బయ్య గారంటే ఇప్పటికీ గౌరవించే సినిమా ప్రేమికులు ఎందరో ఉన్నారు. మళ్ళీ వచ్చి తీసే ఉద్దేశం ఆయనకు లేకపోయినా అభిమానులు మాత్రం ఏదైనా చేయకపోతారా అని ఎదురు చూస్తూనే ఉన్నారు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp